గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలు స్వీకరించి బుధవారం (అక్టోబర్ ఏడవ తేది) నాటికి 25 సంవత్సరాలు పూర్తయ్యాయి. 2001 అక్టోబర్ ఏడవ తేదీన ఆయన తొలిసారి సి.ఎం గా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ముఖ్యమంత్రిగా, ప్రధానిగా మోడీ సాగించిన అధికార ప్రస్థానాన్ని పురస్కరించుకుని బిజెపి శ్రేణులు దేశ వ్యాప్తంగా 'సేవా సంకల్ప్ అభియాన్' పేరిట ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాయి. ఎన్నికల వ్యవస్థను భ్రష్టు పట్టించిన ఎస్‌ఐఆర్ కు వ్యతిరేకంగా దేశమంతటా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించడం గమనార్హం. ఈ సందర్భంగా ప్రసంగించిన మోడీ తనదైన శైలిలో హావభావాలు ప్రదర్శిస్తూ ఎప్పటిమాదిరే అసత్యాలను, అర్ధసత్యాలను వల్లెవేశారు. సుదీర్ఘంగా చేసిన ప్రసంగంలో దేశ వ్యాప్తంగా ప్రజానీకం ఆందోళన చెందుతున్న ఎస్‌ఐఆర్, ఎల్‌నినో, అధిక ధరలు, నిరుద్యోగం వంటి అంశాలను మాట మాత్రంగా కూడా ప్రస్తావించకుండా ఆత్మ నిర్భర్ భారత్, గ్లోబల్ మాన్యుఫాక్చరింగ్ హబ్, అంతరిక్షంలో అడుగుపెట్టడం, ఒలింపిక్స్ నిర్వహణ వంటి అంశాలతో ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకునే మీడియాలో మోడీ పాలనను కీర్తిస్తూ ప్రచార ఆర్భాటం సాగుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం మోడీని ఆకాశానికెత్తుతూ స్వయంగా ఒక వ్యాసాన్ని రాశారు. అదే సమయంలో, రాష్ట్రానికి ప్రత్యేక హోదాను తిరస్కరించడమేగాక, విభజన హామీలను అమలు చేయని మోడీ-షా సర్కారును పల్లెత్తు మాట అనకపోవడం అన్యాయం. బిజెపి, నరేంద్ర మోడీ అమలు చేస్తున్న విద్వేష, విధ్వంస రాజకీయాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా నవ యువత రోడ్ల మీదకు వచ్చి, గళం వినిపిస్తున్న సమయంలో వ్యూహాత్మకంగా మిత్రపక్షాల నాయకుల ద్వారా ఈ ప్రచారం సాగుతుండటం గమనార్హం.
నిజానికి గుజరాత్‌లో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు కావడం, అనంతరం కేంద్రంలో మోడీ పాలన ప్రారంభం కావడం మతోన్మాద రాజకీయాల ఫలితమే. మోడీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఏడాది కాలంలోనే 2002 ఫిబ్రవరిలో చోటు చేసుకున్న గోద్రా హింసాకాండ దేశ చరిత్రలోనే మాయని మచ్చగా మిగిలింది. అధికారిక లెక్కల ప్రకారమే ఈ హింసాకాండలో 1,044 మంది మృతి చెందారు. బెస్ట్ బేకరీ, బిల్కిస్ బానో, గుల్బర్గ్ సొసైటీ, నరోడా పాటియా, నరోడా గామ్ ఊచకోత ఇలా చెప్పుకుంటూ పోతే గుజరాత్ మారణకాండ సృష్టించిన హృదయ విదారక సంఘటనలు ఎన్నో! ఈ నెత్తుటేరుల ప్రవాహం తరువాత గుజరాత్ సమాజం మెజార్టీ, మైనార్టీల లెక్కలుగా విభజనకు గురైంది. మోడీ, బిజెపి అధికారం స్థిరపడింది. 2014లో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం దేశ వ్యాప్తంగా అదే విద్వేష వ్యూహాన్ని అమలు చేశారు. వివిధ రాష్ట్రాలలో ముస్లింలను, దళితులను, గిరిజనులను లక్ష్యంగా చేసుకుని మూక దాడులకు దిగారు. తినే తిండిని ఆధారంగా చేసుకుని విష ప్రచారం చేశారు. ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అమలు చేసిన బుల్డోజర్ రాజ్ లక్ష్యం ఎవరో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సిఎఎ, ఎన్‌ఆర్‌సిలు మైనార్టీ ప్రజానీకంలో తీవ్ర భయాందోళనలకు కారణమయ్యాయి. ఈ సందర్భంగా దేశ రాజధానిలో జరిగిన ఘర్షణల్లోనే 52 మంది ప్రాణాలు వదిలారు. మోడీ పాలనలో కార్పొరేట్లకు రాయితీలు, సామాన్యులపై భారాలు సర్వసాధారణమైనాయి. భారత రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చేయడానికి సకల ప్రయత్నాలు గావిస్తున్నారు. దేశంలో ప్రజాస్వామ్యం, లౌకికతత్వం, సామాజిక న్యాయం, సార్వభౌమత్వం, ఫెడరలిజంపై తీవ్రమైన దాడి చేస్తున్నారు. ఇదంతా జాతీయవాదం ముసుగులో ఫాసిస్టు ఆర్‌ఎస్‌ఎస్ మార్గదర్శనంలో సాగుతోంది. స్వాతంత్ర్యోదమ వారసత్వంగా వచ్చిన అలీన విదేశాంగ విధానాన్ని అటకెక్కించి, అమెరికాకు జూనియర్ భాగస్వామిగా భారత్‌ను మార్చే దుర్విధానాలు మోడీ పాలనలో పతాక స్థాయికి చేరుతున్నాయి. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల పేరుతో దేశ వ్యవసాయ రంగాన్ని, ఆర్థిక వ్యవస్థనూ తీవ్రంగా దెబ్బతీసే చర్యలకు ఒడిగడుతున్నారు.
రోహిత్ వేముల, పాయల్ తాడ్వి ఆత్మహత్యలు, డాంగవాస్ మూకహత్య, అనేక విశ్వవిద్యాలయాలు, మణిపూర్‌లో చోటుచేసుకున్న ఘర్షణలు మోడీ ప్రభుత్వ మనువాద అహంకారానికి, దళిత, గిరిజన వ్యతిరేకతకు నిదర్శనాలు. మోడీ ప్రభుత్వం అమలు చేసిన ఈ విధానం దేశంలో మతపరమైన విభజనను పాతుకుపోయేలా చేసి, లౌకిక, రాజ్యాంగ పునాదులను దెబ్బతీసింది. మహిళల అణచివేత, మానవ హక్కుల హననం గురించి ఎంత చెప్పినా తక్కువే! ఫ్రీడమ్ హౌస్ సంస్థ పాక్షికంగా మాత్రమే స్వేచ్ఛ ఉన్న దేశంగా మన దేశాన్ని అభివర్ణించింది. ‘వి-డెమ్’ ‘ఎలక్టోరల్ ఆటోక్రసీ’గా మన ప్రజాస్వామ్యాన్ని అభివర్ణించింది. 2025 ప్రెస్ ఫ్రీడమ్ గణాంకాల్లో మన దేశం 151వ స్థానానికి దిగజారింది. విశ్వగురువుగా తనను తాను ప్రచారం చేసుకునే మోడీ పాలనలో మన దేశం సాధించిన ఘనతలివి! ఈ కాలంలోనే ప్రతిపక్ష రాజకీయ నేతలపై 193 కేసులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇ.డి) నమోదు చేసింది. సిబిఐ దర్యాప్తులో 95శాతం ప్రతిపక్ష నేతలను లక్ష్యం చేసుకున్నవే! ఇలా నిర్వీర్యమైన వ్యవస్థల జాబితాలో తాజాగా ఎన్నికల కమిషన్ సైతం చేరింది. మొత్తం మీద విద్వేష వ్యూహంతో సాగిన 25 సంవత్సరాల నరేంద్ర మోడీ ప్రస్థానం దేశ ప్రజలకు మంచి కన్నా చెడునే ఎక్కువ చేసింది.







కామెంట్‌లు (0)