గురువారం, 08 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionన్యాయ వ్యవస్థలో ‘సర్‌’ స్వరాలు?

1 గంట క్రితం

sir...enough.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 08, 2026, 05:06 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

సంగీతంలో సరిగమ పదనిస... వుంటాయి. కానీ భారత రాజకీయాలలో ఇప్పుడు ‘సర్‌’గమపద ఎక్కువగా వినిపిస్తుంది. ‘సర్‌’ చాలు, ఇక పదండి సార్‌ అని దేశమంతా నిప్పులు చెరుగుతున్నది. ఇందుకు తగినట్టే న్యాయస్థానాలలోనూ తీవ్ర యుద్ధం జరుగుతున్నది. మొదట్లో ‘సర్‌’పై ఖచ్చితంగా నిరాకరించడంలో సుప్రీంకోర్టు విఫలమైందనే విమర్శలూ వున్నాయి. ఇప్పుడు సిఇసి జ్ఞానేష్‌ ను ఇంటికి పంపించే ఉద్యమం ఉధృతమైన తరుణంలో సుప్రీంకోర్టు సిజెఐ సూర్యకాంత్‌ ‌ధర్మాసనం కూడా కొన్ని అంశాల్లో తీవ్రంగా స్పందిస్తూనే విధుల నుంచి దూరం వుంచాలనే ఉత్తర్వులకు మాత్రం సిద్ధం కాలేదు. అయితే సుప్రీం కోర్టు న్యాయమూర్తులలో ఒకరైన జస్టిస్‌ ఉజ్జల్‌‌ భుయాన్‌ ‌మాత్రం హైదరాబాద్‌ ‌నల్సార్‌‌లో మాట్లాడుతూ సామూహిక ఓట్ల తొలగింపునకు పాల్పడే ఏ ప్రక్రియ అయినా రాజ్యాంగ విరుద్ధమని తేల్చేశారు. నల్సార్‌ ‌విద్యార్థులు చాలా ధైర్యవంతులని మెచ్చుకున్నారు. సిజెఐ రాకను నిరసిస్తూ కొంత కాలం కిందట ఆందోళన చేసిన సంగతి తెలిసీ ఆయన అలా అన్నారంటే ఆ మాట ఎంత లోతైనదో తెలుస్తుంది. న్యాయ వ్యవస్థపై ఆర్‌.ఎస్‌.ఎస్‌, విహెచ్‌‌పి ప్రభావం పెంచుతున్నారనేది తరచూ చెప్పుకునే విషయమే కదా. మాజీ సిజెఐ జస్టిస్ బి.ఆర్‌. గవాయ్‌‌తో సహా ముగ్గురు మాజీ న్యాయమూర్తులు ఉజ్జల్‌‌పై దాడికి దిగారు. కేసు కోర్టు ముందు వుండగా మీరు అలా మాట్లాడ్డం హద్దు మీరడమేనని చెలరేగిపోయారు. కానీ సుప్రీంకోర్టు ఫారం 6 మార్పులకు మేము అనుమతినివ్వలేదని చేసిన వ్యాఖ్యలను పరోక్షంగా తోసిపుచ్చుతూ ఇ.సి ప్రకటనలు జారీ చేయడం మాత్రం ఈ మాజీ న్యాయకోవిదులు పట్టించుకోకపోవడమే తమాషా. పైగా జస్టిస్‌ ‌గవాయ్‌ ‌గతంలో యుపిఎ తో పనిచేసిన సీనియర్‌ ‌గవాయ్‌ ‌కుటుంబానికి చెందిన వారు కూడా. అయితే ఇదే సమయంలో ముంబాయి హైకోర్టు మాత్రం ఇ.సి తీరుపై తీవ్రంగానే విరుచుకుపడింది. ప్రజాప్రాతినిధ్య చట్టం 25(2) ఓటు కల్పించమని చెబుతుందే గానీ కట్టలు కట్టలు తీసి పారేయమని చెప్పడం లేదని చురకలేసింది. ఫారం 6, ఫారం 8 మధ్య ఓట్ల ఊచకోత ఏంటని నిలదీసింది.

మహిళల గొంతు అర్థం ఒకటే...

‘ఆడువారి మాటలకు అర్థాలు వేరులే...’ అని అప్పుడెప్పుడో ‘మిస్సమ్మ’ సిన్మాలో పాట పాడుకుంటూ తిరుగుతామంటే కుదరదని తేల్చిచెప్పారు జాన్వీ కపూర్‌. తెలుగువారికెంతో ప్రియమైన తారామణి శ్రీదేవి కూతురు కూడా అయిన జాన్వీ పాటను ఎ.ఐ లో అసభ్యంగా మార్ఫింగ్‌ ‌చేయడం తీవ్ర దుమారమే రేపింది. ఎన్టీఆర్‌ ‌మొదలుపెట్టగా పెద్ద పెద్ద హీరోలందరూ ఖండించారు. ఈ సమయంలో జాన్వీ మరో అడుగు ముందుకేసి మహిళల గొంతు గట్టిగా వినిపించారు. నేను ఎ.ఐ గురించే చెప్పడం లేదు. మన సమాజంలో మా పరిశ్రమలో ప్రతి అమ్మాయి ఇలాంటి దుస్థితినే ఎదుర్కొంటుందని బాంబు పేల్చారు. ఒక స్ర్తీ శరీరం ఆమె స్వంతం, ఆమె ఎలా వుండాలి, ఏం చేయాలి అన్నది ఆమె చూసుకుంటుంది. ఆమె అభిప్రాయాలు కూడా ఆమె స్వంతం. మీరెవరు శాసించడానికని ప్రశ్నించారు జాన్వీ. అయిదు రోజులు ఎస్‌ ‌చెప్పిన ఒక అమ్మాయి ఆరో రోజున నో చెప్పిందంటే నో అనే అర్థం. మరోలా చెప్పడానికి మీరెవరు? ఒక మినీ స్కర్టు వేసుకుంటే ఇష్టం వచ్చినట్టు కెమెరాలు పెట్టి ఫోటోలు తీయొచ్చని అర్థమా? అమ్మాయి అందాలైనా, ఆలోచనలైనా మీరు శాసిస్తారా అని ఎడాపెడా నిప్పులు చెరిగారు. ఇవన్నీ వింటే మహిళా సంఘాలు, ఫెమినిస్టు రచయితలు లేవనెత్తిన మౌలిక ప్రశ్నలు గుర్తుకు వస్తాయి కదా? ఇప్పుడు సనానతం అంటున్న జనసేన పవన్‌ ‌కల్యాణ్‌ ‌తీసిన ‘వకీల్‌‌ సాబ్‌‌’లో ఈ డైలాగ్‌ ఎంత బలంగా వినిపించారో అంతకు ముందు ‘పింక్‌‌’లో బిగ్‌ ‌బి దాన్ని మరెంత గొప్పగా పండించారో గుర్తు చేసుకోండి.

పిల్లల లౌక్యం...వాస్తవ దౌత్యం

స్కూల్లోనో స్నేహితుల దగ్గరో జరిగింది చెప్పడానికి పిల్లలు వేర్వేరు పద్ధతులు ఎందుకు అనుసరిస్తారు? కొన్ని తల్లికి, కొన్ని తండ్రికి లేదా కొన్ని సార్లు వారికి, ఎక్కువ సార్లు వీరికి ఎందుకు చెబుతారు? వారిపై ప్రేమ, నమ్మకం ఎక్కువగా వుండటం వల్లనా? లేక ఒకరిపై భయంతో కాపాడుకోవడానికా? చెప్పేప్పుడు కూడా ఒకరికి ఒక విధంగా మరొకరికి మరో విధంగా కూడా చెబుతారా? ఈ ప్రశ్నలు ఇంటింటా వుండేవే. కానీ వీటిపై పరిశోధన చేసిన మనస్తత్వవేత్తలు తేల్చిన సమాధానాలే చిత్రంగా వున్నాయి. పెద్దలు వినడం బట్టి, స్పందించడం బట్టి పిల్లలు వ్యవహరిస్తారట. ఎవరు ఏది ఆసక్తిగా వింటారో, విన్నాక ఎవరు సరిగా స్పందిస్తారో, వారు అంచనా వేస్తుంటారు. అలాగే చెప్పిన తర్వాత వాటిపై చర్య తీసుకోవడం లేదా సరైన సలహా ఇవ్వడం ఎవరి దగ్గర బాగా జరుగుతుందో కూడా గమనిస్తారట. చెప్పగానే మండిపడటం. తమదే తప్పు అని హడావుడిగా తీర్పు ఇచ్చేయడంగాక సావధానంగా విని సంయమనంతో వ్యవహరిస్తే సంతోషిస్తారు వారు. అలాగే క్రీడలు, కళలు, మార్కులు, చొరవ ఇలాంటివి అమ్మానాన్నల్లో ఏది ఎవరు ఎక్కువ ఆసక్తి చూపుతారో కూడా గమనించి చెబుతుంటారు. అసలు ప్రతి విషయం ఇద్దరికీ చెప్పాలనీ ఒకే విధంగా చెప్పాలని అనుకోరు. ఒకరికి చెబితే చాలనే భావనతో పాటు అప్పుడున్న స్పందనను బట్టి కొన్ని వివరాలు అదనంగా చేరుతుంటాయి. అంతేగానీ ఇద్దరికీ చెరో విధంగా చెప్పాలని పిల్లలు పథకాలు వేయరు. నిజానికి పిల్లలే పెద్దలవుతారు గనక...ఈ సూత్రాలు ఎంతో కొంత అందరికీ వర్తిస్తాయి.

- పీపీ

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్