గురువారం, 08 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionవిద్యా వ్యవస్థ-హేతుబద్ధత నుండి ఆచారాల దిశగా

1 గంట క్రితం

acadamia drift from reason to the ritual.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 08, 2026, 05:41 పూర్వాహ్నం | 5 నిమిషాల చదవడం

విద్యాసంస్థలెప్పుడూ ‘‘ప్రత్యక్ష అనుభవజ్ఞాన ఆలయాలు’’గా ఉండాలనేది అత్యంత మౌలిక సూత్రం. వాటి సంపూర్ణ చట్టబద్దత తిరుగులేని ఒకే ఒక సూత్రంపై ఆధారపడి ఉంటుంది. సత్యం అనేది పరిశీలన, ప్రయోగం, తోటి నిపుణులతో కలసిచేసే అనుశీలన ద్వారా మాత్రమే ఆవిష్కరించబడుతుంది. అంతేగాని సాక్షాత్కారం, సాంప్రదాయం, ఆకర్షణీయమైన అధికార పీఠాల ద్వారా కానే కాదు. వైజ్ఞానిక పద్ధతి అనేది ప్రశ్నించడం, తప్పులను తొలగించడం, కఠినమైన సందేహాల నివారణపైనే వికసిస్తుంది. ఇవి కేవలంనమ్మకం, ఆధ్యాత్మికత, అంధ భక్తికి పూర్తిగా వ్యతిరేకమైన గుణాలు. ఇది కేవలం ఒక సౌందర్యాత్మక ఎంపికనో సాంస్కృతిక వారసత్వాన్నో తెలిపే ఒక నిరపాయకరమైన ఆమోదం మాత్రమే కాదు. ఇదొక ప్రగాఢమైన తాత్విక వ్యత్యాసం. ఏదైనా ఒక విద్యా సంస్థ మేధోపరమైన దృఢత్వం కంటే ఆధ్యాత్మిక ప్రదర్శనకు, రాజకీయ మర్యాదలకూ పెద్ద పీట వేసినపుడు దాని మూల పునాదులే బలహీనపడతాయా అనే ఆందోళనకరమైన ప్రశ్న తలెత్తుతుంది.

హేతుబద్ధత వర్సెస్ భక్తి​

జ్ఞానం అనేది గత చరిత్రను పూజించడం ద్వారా కాక, దాన్ని ప్రశ్నించడం ద్వారానే పురోగమిస్తుంది. న్యూటన్ చెప్పిన " గతకాలపు దిగ్గజాల భుజాలపై నిలబడటం" అనే మాట ఒక చమత్కారం వంటిదే-అది కేవలం పూజించమని కాదు, గతంలో జరిగిన పనిని విమర్శనాత్మకంగా విశ్లేషించడానికే. ఒకప్పుడు పవిత్రంగా భావించిన సత్యాలను గెలీలియో, డార్విన్, ఐన్‌స్టీన్ అందరూ తిరగరాశారు. పాత నమ్మకాలను నిర్దాక్షిణ్యంగా బద్దలుకొట్టే తత్వమే మానవ జ్ఞానానికి చోదక శక్తి.​

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వంటి విశ్వవిద్యాలయం లేదా పరిశోధనా సంస్థ రాచరికపు సామాజిక శ్రేణుల మర్యాదలను ప్రవేశపెట్టినప్పుడు -విద్యార్థులు ప్రముఖులకు నమస్కరించాలని కోరడం, లేదా స్నాతకోత్సవాల వేడుకలను మంత్రోచ్ఛారణలతో నిర్వహించడం వంటివి చేసినప్పుడు - అది తీవ్రమైన ప్రతికూల సందేశాన్ని ఇస్తుంది.​

ఈ ఆగస్టు నెలలో ఢిల్లీ ఐ.ఐ.టి లో జరిగిన 2026 స్నాతకోత్సవాన్ని పరిశీలిస్తే, అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆ వేడుకకు సంబంధించి వచ్చిన వార్తల మేరకు రెండు అంశాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. ప్రధానమంత్రి నుండి పతకాలు అందుకునేటప్పుడు విద్యార్థులు ఎంతగా వంగాలో నిర్దేశించారని, అలాగే వైదిక మంత్రోచ్ఛారణల సమయంలో నిలబడాలని చెప్పారన్నది ఆ సమాచార సారాంశం. ​

ఒక లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంలో భవిష్యత్తులో తీవ్ర పర్యవసానాలకు దారితీసే సైద్ధాంతిక ప్రకటనలుగా ఇవి కనిపిస్తున్నాయి. ఇలా చేయడం ద్వారా ఆ సంస్థ ... ప్రభుత్వం, దాని అధినేతలు ఏదో సర్వాతీత శక్తి అనుజ్ఞతో పనిచేస్తున్నారనే భావనను ఆమోదించినట్టువు తున్నది. ఒక ఆధునిక గణతంత్ర రాజ్యానికి వుండవలసిన హేతుశీల వైఖరికీ, ఆధార సహితంగా నడవాల్సిన చట్రానికి పూర్తిగా విరుద్ధమైన పని ఇది.

పూర్వకాలపు రాచరిక సంస్కృతిని మళ్లీ తీసుకొస్తున్న ఈ విధేయ ప్రణామ మర్యాదలు నిబంధనలకు- విద్యాప్రతిభకూ మేధో విముక్తికి కట్టుబడినట్టు భావించబడే ఒక సంస్థలో ఏమాత్రం స్థానం వుండదు. ఇవి పట్టభద్రులవుతున్న విద్యార్థులను స్వతంత్ర, విమర్శనాత్మక ఆలోచనాపరులుగా కాక, పాలకుల అనుగ్రహం కోసం పాకులాడేవారిగా మారుస్తున్నాయి. ఇక్కడే ఈ వేడుక యొక్క అతి పెద్ద వైపరీత్యం బయటపడుతుంది. తన మతాచారాలను బహిరంగంగా ప్రకటించుకునే ప్రధానమంత్రి అక్కడ తన తెలివితేటలను ప్రయోగించి సాంప్రదాయ పద్ధతులను ప్రశ్నించాలని కోరారు. పాటించే ఆచార తంతుకూ ప్రవచించే సూక్తులకు పొంతన లేకపోవడానికి ఇంతకన్నా చక్కటి ఉదాహరణ వుండదు. మాటల్లో ఇచ్చిన సందేశంలోని సారాంశాన్ని బలిపెట్టడానికి ఉద్దేశించిన భక్తిప్రపత్తుల ప్రదర్శన ఇది. ప్రభుస్వామ్య విధేయత కన్నా ప్రజాస్వామిక సమానతకు ఎక్కువ విలువివ్వాలని రాజ్యాంగం మనకిచ్చే స్ఫూర్తి.​

సంస్థాగత సమగ్రత?​

విద్యా జీవితంలో ఆచార సంప్రదాయ విధేయతను తిరిగి ప్రవేశపెట్టడం ద్వారా, మనం ఒక మేధోపరమైన శృంఖలాలు వేస్తున్నాం. ఒక విద్యార్థి వేదికపై ఉన్న రాజకీయ నాయకుడికి వంగి మరీ నమస్కరించవలసి రావడమంటే దాని సందేశం స్పష్టం. అధికారాన్ని ప్రశ్నించకూడదు, కేవలం తలవంచాలి అనేదే. ఒక వైజ్ఞానిక సదస్సు మతపరమైన ప్రార్థనతో ప్రారంభమవడమంటే, ప్రత్యక్ష జ్ఞానాధ్యయనం జరగాల్సిన చోట అతీతశక్తులకు కూడా పీటవేయడమే. ​

ఇవి కేవలం "సాంస్కృతిక సొబగులు" అని ఈ పద్ధతులను సమర్థించేవారు చెబుతారు. ఘనమైన భారతీక గత వైభవానికి నిష్కల్మషమైన ఆరాధనేననీ, విద్యార్థుల పునాది గట్టిపరచి గౌరవాన్ని నేర్పడానికేనని అంటారు. కానీ ఈ వాదన పరీక్షకు క్షణమైనా నిలబడదు. పాత కాలపు 'గురు-శిష్య' పరంపర సంస్కృతి ఎంత గౌరవప్రదమైనా తిరుగులేని విధేయత వుండాలంటుంది. శిష్యుడు గురువు మాటను మారు మాట్లాడకుండా శిరసావహించాల్సిందే. కాని ఆధునిక విద్యాబోధన దాన్ని దాటి ముందుకు సాగింది. అది సోక్రటిస్‌ ‌తర్క పద్ధతిపై ఆధారపడి పెరిగింది. భావాల ఘర్షణపైన, కఠోరమైన గౌరవ ప్రదమైన అసమ్మతిపైన ఆధారపడి నడుస్తుంది. కానీ ఆధునిక విద్యా విధానం సోక్రటీస్ పద్ధతిలోని తార్కిక చర్చలపై-భావాల ఘర్షణపై, కఠినమైనా కానీ గౌరవప్రదమైన భిన్నాభిప్రాయాలపై ఆధారపడి ఉంటుంది.​

ఈ ప్రదర్శనాత్మక సాంప్రదాయవాదం ఒక రాజకీయ సాధనంగా పని చేయడం కద్దు. పురాతన సంస్కృతి అనే ముసుగు వేసుకున్న సంస్థలు నిశిత పరీక్షను అడ్డుకుంటాయి. అసమ్మతి స్వరాలను నిరుత్సాహ పరుస్తాయి. విమర్శకుల మీద "పాశ్చాత్య ధోరణులకు లోనైనవారు", "జాతి వ్యతిరేకులు ",ఇంకా ఇటీవల కనిపెట్టిన "దిమాగీ నక్సల్స్" వంటి ముద్రలు వేస్తారు. విద్యాపరమైన నైతిక సూత్రాలను భంగపరచడంపై అసమ్మతి తెలిపినందుకే ఇలా ముద్ర వేయడం జరుగుతుంది. ఈ విధమైన మాటల దాడి మేధో పరంగా నిజాయితీ లేని వ్యవహారం. ఇది సాంస్కృతిక ఔన్నత్యం అన్నదాన్ని మరి ప్రశ్నించడానికి వీలులేని విధేయత అనీ, సంప్రదాయానుసరణే సత్యమనీ పోటీ పెడుతుంది. దీనివల్ల ఉత్పన్నమయ్యేది భయ వాతావరణమే. బోధకులు విద్యార్థులు కూడా తమ గొంతు తామే నొక్కుకోవాలి. సంస్థ సమగ్రతను సంరక్షించేందుకు వారు ప్రయత్నిస్తే ద్రోహులుగా ముద్ర పడుతుంది. ఈ రోజున తమ విద్యాంశాలతో అనేక విషయాలలో ప్రభుత్వ విపరీత అధికార చొరబాటును ప్రశ్నించడానికి చాలామంది భారతీయ పరిశోధకులు భయపడిపోతున్నారు.​

ప్రపంచవ్యాప్తంగా విద్యా సంఘాల పరిస్థితిని పర్యవేక్షించే అంతర్జాతీయ నెట్‌వర్క్ 'స్కాలర్స్ ఎట్ రిస్క్'(ప్రమాదంలో విద్యా విజ్ఞానులు) ప్రచురించిన "ఫ్రీ టు థింక్ 2026"(ఆలోచనా స్వేచ్ఛ) నివేదిక భారతదేశపు విద్యా రంగ పరిస్థితిలోని సవాళ్లను సమగ్రంగా అంచనా వేసింది. జులై 1, 2025 నుండి జూన్ 30, 2026 వరకు ఉన్న డేటా ఆధారంగా, భారతదేశంలో విద్యా స్వేచ్ఛ "తీవ్ర ఆంక్షలలో చిక్కింది" అని ఈ నివేదిక అభిప్రాయపడింది. భారతదేశపు ‘అకడమిక్ ఫ్రీడమ్ ఇండెక్స్’(విద్యా స్వేచ్ఛ) స్కోరు 2022లో 0.38 నుండి 2025లో 0.14కి పడిపోయిందని, ఇది "తీవ్ర పరిమితులు కలిగిన" వర్గంలోకి చేరిందని నివేదిక పేర్కొంది. ​

వ్యవస్థాగతమైన క్షీణతతో పాటు విశ్వవిద్యాలయ నిర్వహణలో ఒక పద్ధతి ప్రకారం ప్రభుత్వ తలదూర్చడం ఇందుకు కారణమవుతున్నాయని పేర్కొంది. అధ్యాపకులు, విద్యార్థుల భిన్నాభిప్రాయాల అణచివేత, విశ్వవిద్యాలయ ప్రాంగణాలలో ఆవరించిన భయకంపిత వాతావరణం, తమ గొంతు తామే నొక్కుకునే వాతావరణం వుంటున్నాయి. ​

బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యుజిసి) ద్వారా ఉన్నత విద్యారంగంపై తన అధికారాల పట్టు పెంచుకున్నది. వైస్‌ ‌ఛాన్సలర్ల నియామకానికి అర్హత ప్రమాణాలను సడలించింది. శాశ్వత ఉద్యోగులుగా గాక కాంట్రాక్ట్ పద్ధతిపై అధ్యాపకుల నియామకాలు 10 శాతం లోపలే వుండాలన్న పరిమితిని తొలగించి అకడమిక్‌ ‌సిబ్బంది క్యాజువల్‌ ‌స్వభావం పెంచింది.ఈ విధాన మార్పులు 2018 నిబంధనల ప్రకారం ఉన్న పరిమితులను తొలగించాయి. విశ్వవిద్యాలయాల పాలనా నిర్వహణ, పాఠ్యప్రణాళిక, యాజమాన్యంపై అజమాయిషీ ద్వారా ప్రభుత్వ జోక్యం పెరిగింది. ఇది వాటి సంస్థాగత స్వయంప్రతిపత్తిని, విద్యా ప్రమాణాలను దెబ్బ తీస్తోందని నివేదిక ప్రముఖంగా ప్రస్తావించింది. అలాగే, లోపల బయట కూడా విద్యార్థుల నిరసనలపై పోలీసుల హింసాకాండ వంటివి ధిక్కార స్వరాలను తొక్కిపట్టే ఉదాహరణలుగా పేర్కొంది.

అప్రమత్తత, టాగూర్ ఆదర్శాలకు పిలుపు ​

శాస్త్రీయ పరిశోధన సంపూర్ణతను మనం కాపాడుకోవాలనుకుంటే, విద్యాసంస్థలు సందేహపూర్వక ప్రశ్నలకు నిలయాలుగా ఉండాలి. మన విశ్వవిద్యాలయాలు ఆధ్యాత్మిక రంగస్థలాలగానో లేక రాజకీయ భజన బృందాల వేదికలగానో మారకూడదు. జ్ఞాన సంపద భవిష్యత్తు, అలాగే ఒక స్వేచ్ఛా, ప్రజాస్వామ్య సమాజపు భవిష్యత్తు దీనిపైనే ఆధారపడి ఉంటుంది.​

సాంస్కృతిక పునర్వికాసం, విమర్శనాత్మక ఆలోచనలతో కూడిన భారతీయ వారసత్వాన్ని మనం నిజంగా గౌరవించాలనుకుంటే, రవీంద్రనాథ్ టాగూర్ రాసిన "ఎక్కడ మనస్సు నిర్భయంగా సంచరిస్తుందో" అన్న గీతం గుర్తుచేసుకోవాలి. ఆయన బ్రిటిష్ పాలననాడు రాసిన ఈ కవిత ఏదో కేవలం గత వైభవ స్మృతి కాదు, భవిష్యత్ ప్రపంచానికి ఒక సృజనాత్మక ఆదర్శం. ప్రజలు ధైర్యంతో ఆలోచించే, నిర్భయంగా సత్యాన్ని అన్వేషించే ప్రపంచం కావాలి. విభజనలనే సంకుచితపు గోడలు లేకుండా జీవించేలా వుండాలి. అదే మనం కాపాడుకోవాల్సిన నిజమైన సాంప్రదాయ బంధం. స్నాతకోత్సవంలో మార్మోగవలసిన మంత్రం కూడా అదే. ధైర్యంగా పరిశోధించే స్వేచ్ఛా స్ఫూర్తిని మనం పునరుద్ధరించుకుందాం, మన విద్యా రంగాలు లౌకిక సూత్రాలకు కట్టుబడి ఉండేలా చూసుకుందాం. కుప్పకూలుతున్న మన విద్యారంగాన్ని తిరిగి నిలబెట్టుకుందాం.

cp rajendran.jpg

వ్యాసకర్త సి.పి. రాజేంద్రన్

శాస్త్ర, రాజకీయ, పర్యావరణ,

విద్యా విషయాల భూవిజ్ఞాన శాస్త్రవేత్త, రచయిత)

( హిందూ సౌజన్యంతో)

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్