ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రజారోగ్యం సామాన్యుడికి దూరమౌతున్నది. నేడు వైద్యం కేవలం ఒక సేవా రంగం కాదు... అదొక పక్కా లాభసాటి బిజినెస్! ఒకప్పుడు అనారోగ్యం వస్తే ఆసుపత్రికి వెళ్లి నయం చేయించుకుని ఊపిరి పీల్చుకునేవారు. కానీ నేడు, రోగం నయమవుతుందో లేదో తెలియదు గానీ, అయ్యే ఖర్చు చూసి రోగి కుటుంబం మానసికంగా, ఆర్థికంగా కుంగిపోతోంది.
మహారాష్ట్ర ప్రభుత్వ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ విభాగం, వైద్యానికి అవసరమైన వస్తువులు, పరికరాలు, మందులు మార్కెట్ ధరలు, కార్పొరేట్ ఆసుపత్రుల బిల్లుల ద్వారా వసూలు చేస్తున్న ధరల మీద అధ్యయనం చేసింది. ఎఫ్.డి.ఎ కమిషనర్, ఐ.ఏ.ఎస్ అధికారి తుకారాం ముండే సర్వే నిర్వహించి ఇచ్చిన నివేదిక దిగ్భ్రాంతి గొలిపే వివరాలు బయటపెట్టింది. మార్కెట్లో రూ.11 ధర ఉన్న ఐ.వి, ద్రవ పదార్థాలను నరాలలోకి ఎక్కించే ట్యూబ్ సెట్ కి హాస్పిటల్ రూ.325 ఛార్జ్ చేసింది. పది ఎం.ఎల్ సిరంజి ధర రూ.7 కాగా బిల్లులో రూ.57, ఆవిరిపట్టే ఆక్సిజన్ మాస్క్ రూ.45 కాగా హాస్పిటల్ బిల్లులో రూ.625 వసూలు చేస్తున్నట్లు, మొత్తం మీద ఆసుపత్రులు 2840 శాతం లాభాలు వేసుకుంటున్నట్లు నివేదిక తెలియజేసింది. రోగులు అంతులేని దోపిడీకి గురవుతున్నారని, వారి రక్షణ కోసం పారదర్శకత, నియంత్రణ, జవాబుదారీతనం నెలకొల్పాలని ప్రభుత్వాన్ని కోరారు. దీనికి తోడు నేషనల్ హెల్త్ అకౌంట్స్ సంస్థ అంచనాల ప్రకారం వైద్య ఖర్చులలో మందులు తదితర అంశాల కోసం జేబు నుంచి పెట్టుకొనే (ఔట్ ఆఫ్ పాకెట్ ఎక్స్‌పెన్సెస్ ) 43.2 శాతానికి చేరి సామాన్య ప్రజలకు పెను భారంగా మారాయి.
ఒకప్పుడు కేవలం మెట్రో నగరాలకే పరిమితమైన కార్పొరేట్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, ఇప్పుడు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకూ చొచ్చుకెళ్తున్నాయి. దేశీయ కార్పొరేట్ దిగ్గజాలతో పాటు విదేశీ ప్రైవేటు షేర్ మార్కెట్ పెట్టుబడి సంస్థలు, విదేశీ పెట్టుబడులు (ఎఫ్.డి.ఐ) మన కార్పొరేట్ ప్రైవేట్ ఆసుపత్రుల్లో లక్షలకొద్దీ డాలర్లను కుమ్మరిస్తున్నాయి. కానీ ప్రజలకు నాణ్యమైన వైద్యం తక్కువ ధరకు అందించాలనే సామాజిక స్పృహ ఆ యాజమాన్యాలకు ఉండదు. వారి ఏకైక లక్ష్యం తమ పెట్టుబడులపై అత్యధిక లాభాలను సంపాదించటం. ప్రైవేటు ఆస్పత్రులు లాభాపేక్షతో నడవడంతో వైద్య ఖర్చులు ఆకాశాన్నంటుతున్నాయి. వైద్యులకు కూడా నెలవారీ టార్గెట్లు విధిస్తున్న పరిస్థితి నేడు ఉందనేది బహిరంగ రహస్యం. అనవసరమైన ల్యాబ్ పరీక్షలు, నిర్బంధ స్కానింగ్‌లు, సుదీర్ఘంగా ఐసియు లో ఉంచటం, అత్యవసరం లేకున్నా చేసే శస్త్రచికిత్సలు సామాన్యుడి జేబులను గుల్ల చేస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వానికి చెందిన నీతి ఆయోగ్ అధికారిక నివేదికల ప్రకారం-భారత దేశంలో ఏటా కేవలం అపరిమితమైన వైద్య ఖర్చులు భరించలేక 7 శాతం కుటుంబాలు పేదరికంలోకి, తీర్చలేని అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్నాయి. తమ పొదుపు మొత్తాలు ఖాళీ చేసుకుని, ఇళ్లు, భూములు, బంగారం విక్రయించి రోడ్డున పడుతున్నారు. వైద్య బీమా ఉన్నప్పటికీ, అనేక రకాల వ్యాధులకు లేదా నిర్దిష్ట చికిత్సలకు పూర్తి స్థాయిలో పరిహారం అందడం లేదని, ఇన్సూరెన్స్ కంపెనీల నిబంధనలు రోగులకు శాపంగా మారుతున్నాయని బాధితులు వాపోతున్నారు. పబ్లిక్ హెల్త్ సిస్టమ్ బలహీన పడటమే సమస్యలకు మూల కారణం. భారత్‌లో జిడిపి తో పోలిస్తే ప్రభుత్వాలు ఆరోగ్య రంగానికి కేటాయించే నిధులు 2.1 శాతం కంటే పెరగటం లేదు. ఇది ప్రపంచ సగటు కంటే చాలా తక్కువ. దీనికితోడు ప్రభుత్వ ఆసుపత్రులలో తీవ్రమైన వైద్యుల కొరత, మౌలిక వసతుల లేమి కారణంగా సామాన్యుడు కూడా ప్రైవేట్ రంగానికే వెళ్లక తప్పడం లేదు.
ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పుకోకూడదు. ప్రతి పౌరుడికి అందుబాటులో ఉండే బలమైన ప్రభుత్వ ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేసుకోవాలి. ప్రజా ఉద్యమాల ద్వారానైనా ఇది సాధించుకోవాలి. అదే దేశ ఆర్థికాభివృద్ధికి పునాది.

వ్యాసకర్త పి. వెంకటరామయ్య
సెల్ : 9553533815/







కామెంట్‌లు (0)