మంగళవారం, 13 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అప్రకటిత ఎమర్జెన్సీ!

1 గంట క్రితం

sa
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 13, 2026, 05:15 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అడుగులు దేశంలో అత్యయిక స్థితి వైపు పడుతున్నాయని తొలినాళ్లల్లోనే బిజెపి వృద్ధ నేత ఎల్‌‌కె అద్వానీ పేర్కొన్నారు. రాజకీయ ప్రత్యర్ధులు ఆ మాట అంటే విమర్శగా మోడీ గణాలు ఎదురుదాడి చేసే వీలుంటుంది. కానీ అద్వానీని తన రాజకీయ గురువుగా మోడీ చెప్పుకున్నందున ఆ నాటి నుంచే విశ్లేషకులు ఆలోచించసాగారు. నల్ల వ్యవసాయ చట్టాల రద్దు కోసం ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాదిపాటు రైతులు నిర్వహించిన ఆందోళన సమయంలో మోడీ ప్రభుత్వ అణచివేత ప్రజలకు అనుభవమైంది. జులై నెలలో ఢిల్లీ నడి వీధుల్లో విద్యార్థి, యువత నీట్‌ ‌పరీక్షలో అవకతవకలకు బాధ్యత వహిస్తూ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ‌రాజీనామా డిమాండ్‌‌తో చేపట్టిన ఆందోళనల సమయంలో ప్రభుత్వ నిరంకుశత్వం తీవ్ర స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ (సిఇసి) ‌జ్ఞానేష్‌ ‌కుమార్‌ ‌రాజీనామా కోసం వామపక్షాలు, సిజెపి, కాంగ్రెస్‌, ఇండియా బ్లాక్‌ ‌పార్టీలు, యువత దేశవ్యాప్తంగా కదం తొక్కడంతో మోడీ ప్రభుత్వం రాజధాని ఢిల్లీలో, బిజెపి, ఎన్‌‌డిఎ పాలిత రాష్ట్రాల్లో ప్రయోగిస్తున్న నిర్బంధం ఎమర్జెన్సీని తలపిస్తోంది. మందస్తు అరెస్టులు, లాఠీఛార్జీలు, నేతల గృహ నిర్బంధాలు, అరెస్టులు, అప్రకటిత కర్ఫ్యూ, బారికేడ్లు, ప్రజా రవాణా నిలిపివేత, పౌరుల రాకపోకల కట్టడి, వేల సంఖ్యలో సాయుధ పోలీసుల మోహరింపు...కల్లోల ప్రాంతాలను మించిపోయాయి.

సిఇసి రాజీనామా డిమాండ్‌‌తో విపక్ష ఎంపీల మార్చ్‌ సందర్భంగా చేపట్టిన పోలీస్‌ ‌చర్యలపై అభ్యంతరాలు ఉండగా, జంతర్‌ ‌మంతర్‌ ‌వద్ద ఆందోళనకు కాక్రోచ్‌ ‌జనతా పార్టీ (సిజెపి) శనివారం పిలుపునివ్వగా, వామపక్షాలు, ఇతర విపక్షాలు మద్దతిచ్చాయి. ఆ సందర్భంగా ఢిల్లీ పోలీసులు అమలు చేసిన నిర్బంధ చర్యలు రాచరిక దేశాల్లోనూ కనిపించవు. మెట్రో స్టేషన్ల మూసివేత, రైళ్ల రద్దు, బయటి ప్రాంతాల నుంచి ఢిల్లీ వచ్చే రైళ్లలో తనిఖీలు, సిసి కెమెరాలు, ఫేషియల్‌ ‌రికగ్నిషన్ సిస్టం, రోడ్ల మధ్య సిమెంట్‌ ‌దిమ్మల వంటి బారికేడ్లు, డ్రోన్లతో నిఘా, సోషల్‌ ‌మీడియా, ఇంటర్నెట్‌ నిలుపుదల... చెప్పుకుంటూ పోతే ఎన్ని రకాల నిర్బంధ పద్ధతులున్నాయో అన్నింటినీ మోడీ ప్రభుత్వం ప్రయోగించింది. సిజెపి చీఫ్‌ అభిజీత్‌ దీప్కేని విమానంలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిరసనలపై రాజ్యానికి ఇంతటి అసహనమేల? ఢిల్లీ కన్నాట్‌ ప్లేస్‌లో మీడియాతో మాట్లాడుతున్న సిపిఎం ఎంపి జాన్‌ ‌బ్రిట్టాస్‌‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని వాహనంలోనే స్పృహ కోల్పోయేలా కొట్టడం ఆటవిక పాలనను తలపిస్తోంది. తాను పార్లమెంట్‌ ‌సభ్యుడినని ఐడి కార్డు చూపించినా పారా మిలటరీ బలగాలు నిర్దాక్షిణ్యంగా కొట్టి రోడ్డుపక్కన పడేశారంటే ప్రభుత్వం ఎంత కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదో బోధ పడుతోంది. జర్నలిస్టులను, మహిళల్ని సైతం పోలీసులు కొట్టడం, అవమానించడం అమానుషం. ప్రజాస్వామ్యానికి నాల్గవ మూల స్తంభంగా చెప్పబడే మీడియా పట్ల మోడీ సర్కారు వైఖరి ఇదీ!

పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ఓటు చాలా కీలకమైనది. దేశంలో 18 సంత్సరాలు నిండిన ప్రతి పౌరుడికీ రాజ్యాంగం ఓటు హక్కు కల్పించింది. ఓటు హక్కును, తద్వారా రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సింది ఎన్నికల కమిషన్‌. అవకతవకలకు పాల్పడ్డ సిఇసి జ్ఞానేష్‌ ‌కుమార్‌‌ రాజీనామా చేయాలని, ఆయనపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని, సమగ్ర ప్రత్యేక ఓటర్ల సవరణ (ఎస్‌ఐఆర్‌)‌ను నిలిపివేయాలని, తొలగించిన ఓట్లను పునరుద్ధరించాలని ప్రతిపక్షాలు, సిజెపి, యువత డిమాండ్‌ ‌చేస్తుండగా, మోడీ ప్రభుత్వం జ్ఞానేష్‌ ‌కుమార్‌‌ను వెనకేసుకొస్తోంది. ఆయనకు మద్దతు నిలిచి ఆందోళనలను ఉక్కుపాదంతో అణచివేస్తోంది. ఓట్‌ ‌చోర్‌‌ను కుర్చీ వదిలి పొమ్మంటే మోడీకెందుకు బాధ? జ్ఞానేష్‌‌ను ముందు పెట్టి ఓట్ల దొంగతనం చేయించింది మోడీ, ఆయన పార్టీ అని భావించాలి. ఢిల్లీ నడిబొడ్డునున్న జంతర్‌‌ మంతర్‌ ఒక చారిత్రక, ప్రాచీన ఖగోళ శాస్ర్త విజ్ఞానానికి సంబంధించిన ప్రదేశం. వందల ఏళ్ల క్రితం నిర్మితమైంది. స్వాతంత్ర్యం వచ్చాక ముఖ్య పర్యాటక ప్రాతంగా విలసిల్లుతోంది. అలాగే ప్రజా పోరాటాలకూ వేదికగా ప్రసిద్ధి చెందింది. జంతర్‌‌ మంతర్‌ వద్ద ఆందోళనలను నిషేధిస్తూ మోడీ ప్రభుత్వం నిర్ణయించడం పరమ నిరంకుశత్వం. సుప్రీం కోర్టు నిరసనకారులను నిర్బంధించవద్దని, ప్రజా రవాణాను నిలిపివేయడం వంటి చర్యలతో సామాన్యుల రాకపోకలను అడ్డుకోవద్దని చెప్పినా చెవికెక్కించుకోలేదు. నిర్బంధాలు, అణచివేతలు, నిరంకుశ చర్యలు ప్రజా ఉద్యమాలను ఆపలేవని పలు సందర్భాల్లో చరిత్ర నిరూపించింది. సిఇసి వ్యతిరేక ఆందోళనలు మరింత ఉధృతం కావడం ఖాయం.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్