గురువారం, 27 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

వందేమాతరం దుర్వినియోగం..

1 రోజు క్రితం

vande mataram
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 26, 2026, 05:45 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

స్వాతంత్ర్యోద్యమ రణనినాదమైన వందేమాతర గేయాన్ని విభజన రాజకీయాల కోసం బిజెపి, హిందుత్వ మతోన్మాద శక్తులు దుర్వినియోగం చేస్తుండటం గర్హనీయం. ఢిల్లీ సహా దేశ నలుమూలలా జెన్‌ జీ ఉద్యమం బలపడుతుండటం, విద్య, ఉపాధి, ఉద్యోగం తదితర అంశాలు ముందుకొస్తుండటంతో ప్రజల దృష్టిని దారిమళ్లించే ప్రయత్నాలను మోడీ సర్కారు ముమ్మరం చేసింది. స్వాతంత్ర్యోద్యమ కాలం నుంచి, వాజ్‌పేయి, మోడీ ఏలుబడిలో సైతం ఇటీవలి వరకూ రెండు చరణాల వందేమాతర గేయాన్నే ఆలపిస్తున్నారు. మత విభజనకు, దేశ ప్రజల ఐక్యతను దెబ్బతీసేందుకు కారణమవుతుందన్న ఉద్దేశంతో నాటి స్వాతంత్ర్యోద్యమకారులు కాదన్న మరో ఆరు చరణాలను కలిపి వందేమాతర గేయాన్ని పాడాల్సిందేనని పార్లమెంట్‌లో చట్టం చేయించి, ఇప్పుడు అమలుకు ఉపక్రమించడం ప్రమాదకర పరిణామం.

ప్రకృతిని, భారతదేశ మాతృభూమిని పొగుడుతూ, దేశభక్తియుతమైన భావోద్వేగాన్ని రగిల్చేలా ఉన్న తొలి రెండు చరణాల వందేమాతర గేయం స్వాతంత్ర్యోద్యమ పోరాట యోధుల నినాదమైంది. బంకించంద్ర చటోపాధ్యాయ రచించిన ఆనంద్‌‌మఠ్‌ ‌నవలకు అనుగుణంగా వుండేలా దశాబ్దాలు గడిచిపోయిన తర్వాత ఆరు చరణాలను అదనంగా కలిపారు. 1937లో కలకత్తాలో జరిగిన ఆనాటి కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం ఈ అంశంపై కూలంకషంగా చర్చించింది. ఆరు చరణాలు పాడటం వల్ల దేశం మతపరమైన భావోద్వేగాల మధ్య విడిపోవడం మినహా ఎటువంటి ప్రయోజనం ఉండదన్న ముందుచూపు నాటి దేశభక్తులది. మతాలకతీతంగా పోరాడుతున్న భారతీయుల ఐక్యతను దెబ్బతీసేందుకు కమ్యూనల్‌ అవార్డు, విభజించు.. పాలించు... తదితర పద్ధతులు అనుసరిస్తున్న బ్రిటీష్‌ వలస పాలకుల కుట్రలు తిప్పికొట్టేందుకు మొదటి రెండు చరణాలు పాడాలనే నిర్ణయం అందులో భాగమే. మొత్తంగా పాడాలన్న హిందుత్వ సంఘాలు, మొత్తంగా తొలగించాలన్న ముస్లిం సంఘాల డిమాండ్ల తిరస్కరణ అందుకే. నాటి స్వాతంత్రోద్యమ నేతలు గాంధీ, నెహ్రూ, సుభాష్‌ చంద్రబోస్‌, వల్లబాయ్‌ పటేల్‌, విశ్వకవి రవీంద్రనాధ్‌ టాగూర్‌ తదితరులంతా ఈ కీలక నిర్ణయంలో భాగస్వాములే. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత రాజ్యాంగ నిర్ణాయక అసెంబ్లీలోనూ ఇదే తీర్మానం చేశారు. నాటి నుంచి ఆలపిస్తున్నట్టుగా వందేమాతరం మొదటి రెండు చరణాలు ఆలపించేందుకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. అదనంగా ఆరు చరణాలను కలిపిన మోడీ సర్కారు ఆ గేయాన్ని ఆలపించడమే దేశభక్తికి కొలమానంగా చూపే ప్రయత్నాలు జరుగుతుండటం ఆందోళనకరం. ఇది హిందుత్వ శక్తుల మతోన్మాద, విచ్ఛిన్నకర లక్ష్యాలను స్పష్టంగా వెల్లడిస్తోంది. అందుకే సిపిఎం, కాంగ్రెస్‌ సహా అనేక ప్రతిపక్ష‍ పార్టీలు తాజా ఎత్తుగడలను వ్యతిరేకించాయి. నిజానికి వందేమాతరంపై బిజెపి, హిందుత్వ శక్తులకు ప్రత్యేకమైన అభిమానమేమీ లేదు. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోడీ హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో వందేమాతరం ఊసేలేదు. ఇటీవల జాతీయ గీతాన్ని ఆలపిస్తుండగా మధ్యలోనే ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌ ‌బయటకు వెళ్లిపోవడం లాంటి ఉదంతాలెన్నో.

జాతీయ వాదం పేరుతో మోడీ ప్రభుత్వం పెంచిన భ్రమలన్నీ ఆపరేషన్‌ సిందూర్‌లో అర్ధాంతరంగా విరమించడంతో పటాపంచలయ్యాయి. తానే ఆపానని అమెరికా అధ్యక్ష‍ుడు ట్రంప్‌ ప్రకటించడం, ఎటువంటి నిర్దిష్ట ప్రయోజనాలు సాధించకుండానే విరమించడం అప్రతిష్టను తెచ్చిపెట్టింది. రష్యా సహా అనేక దేశాలతో వాణిజ్యంలో అమెరికా ఒత్తిడికి లొంగిపోవడం చర్చనీయాంశమైంది. ఏకరూప పౌరస్మృతి తరహా నినాదాలు పనిచేయడం లేదు. జెన్‌ జీ ఉద్యమంతో విద్య, ఉద్యోగాలు, పరీక్ష‍లు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. కులమతాలకతీతంగా విద్యార్థులు, యువత ఐక్యమయ్యారు. వారిపై పాశవిక పోలీసు దాడి దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకతను తీసుకొచ్చింది. పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా నోరు మెదపకపోవడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. అయోధ్య రామమందిరానికి వచ్చిన చందాలు, హుండీలో నగదు చోరీ చేయడం ఇన్నాళ్లూ వారికి అండగా నిలిచిన ఓటర్లలోనూ వ్యతిరేకతను తీసుకొచ్చింది. ఈ తరుణంలో ప్రజల దృష్టిని మళ్లించే మోడీ సర్కార్‌ ఎత్తుగడే వందేమాతరాన్ని మరోసారి ముందుకు తీసుకురావడం. సాతంత్ర్యోద్యమంలో పాల్గొనవద్దని పిలుపునిచ్చిన చరిత్ర నాటి సంఘ్‌ పరివార్‌ది. నాటి ఉద్యమ సమయంలో ఆ గేయాన్ని పాడేందుకు, వందేమాతరం నినాదం ఇవ్వడానికి కూడా నోరు పెగలని, ధైర్యం చాలని వారే తాజాగా వివాదాన్ని రగల్చడం విచారకరం. ఇది దేశ ప్రజల ఐక్యతను దెబ్బతీసే చర్య. రాజ్యాంగబద్ధంగా ఆమోదించిన భావనలన్నింటినీ గౌరవించాలి. అవి, బహుళత్వాన్ని, సమ్మిళిత తత్వాన్ని గుర్తించే భారతదేశ భావనకు ప్రతీకలు. మోడీ సర్కారు అనుసరిస్తున్న వందేమాతర గేయం అదనపు చరణాలు వంటి ఎత్తుగడలను ప్రజలంతా ఐక్యంగా ప్రతిఘటించాలి.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్