విద్యను హక్కుగా కాకుండా మార్కెట్ సరుకుగా మార్చే ప్రక్రియ దేశంలోనూ, రాష్ట్రంలోనూ మరింత వేగంగా సాగుతోంది. విద్యాసంస్థల ఏర్పాటుపై ఉన్న నియంత్రణలను ఒక్కొక్కటిగా సడలించటం, ప్రైవేటు, కార్పొరేట్లకు అనుగుణంగా మార్పులు చేయటం అత్యంత దారుణం. ప్రజలకు ఉచిత విద్యను అందించే మౌలిక బాధ్యత నుంచి పాలకులు దశలవారీగా వైదొలగిపోవటం ఆందోళనకరమే కాదు, అభ్యంతరకరం కూడా. రాష్ట్ర మంత్రివర్గం బుధవారం తీసుకున్న నిర్ణయం ప్రభుత్వ విద్యారంగానికి గొడ్డలిపెట్టు. ఆంధ్రప్రదేశ్ విద్యా చట్టం, 1982లోని 20(1), 20(2), 20(3)(ఎ)(ఐ), 33-బి(1), 33-బి(2) నిబంధనలను సవరించేందుకు మంత్రిమండలి బుధవారం నాడు ఆమోదం తెలిపింది. దీని వల్ల ప్రైవేటు పాఠశాలల ఏర్పాటుకు ముందు ఉండే సర్వే, నోటిఫికేషన్, ఆ ప్రాంతంలో పాఠశాల అవసరం ఉందని నిరూపించాలనే నిబంధనలు తొలగిపోతాయి. దీంతో రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలలు, కార్పొరేట్ విద్యాసంస్థలు తామరతంపరగా పుట్టుకురావడానికి మార్గం మరింత సులభం అవుతుంది. ప్రభుత్వ విద్యాసంస్థలు మరింత నిర్వీర్యం కావటానికి ఇది దారి తీసే ప్రమాదం ఉంది.
మోడీ ప్రభుత్వం తెచ్చిన నూతన విద్యావిధానం (2020) కేంద్రీకరణ, వ్యాపారీకరణ, కాషాయీకరణ లక్ష్యంగా అమలు చేస్తున్నారు. ఉన్నత విద్యారంగంలో ఇప్పటికే ఈ ధోరణి మొదలైంది. విదేశీ విశ్వవిద్యాలయాలు భారత్‌లో తమ ప్రాంగణాలు ఏర్పాటు చేసుకునేందుకు బిజెపి ప్రభుత్వం 2023లో యుజిసి నిబంధనలు తీసుకొచ్చింది. తద్వారా విదేశీ విద్యాసంస్థలు భారత్‌లో తమ ప్రాంగణాలను ఏర్పాటు చేసుకుని, విద్యా కార్యక్రమాలు నిర్వహించవచ్చు. విదేశీ యూనివర్సిటీల సర్టిఫికెట్లు ఉంటే పెద్ద పెద్ద ఉద్యోగాల్లోకి వెళ్లొచ్చునన్న ప్రచారాన్ని ఊదరగొట్టి, ఇక్కడి నుంచే భారీగా ఫీజులు వసూలు చేసుకోవటానికి అవకాశం ఇవ్వటమే ఇది. తగిన వనరులు, సిబ్బంది, ప్రమాణాలను సమకూర్చకుండానే విదేశీ విద్యాసంస్థలు మన మధ్యతరగతి తల్లిదండ్రుల సొమ్మును దోచుకుపోవటానికి ఇలా అవకాశం ఇవ్వటం... బిజెపి వల్లించే స్వదేశీ కబుర్ల బూటకానికి నిదర్శనం. ఇప్పుడు టిడిపి ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తోంది. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఉన్నత విద్యలో విదేశీ, ప్రైవేటు సంస్థల చొరబాటుకు గేట్లు బార్లా తెరవగా... టిడిపి ప్రభుత్వం పాఠశాల స్థాయిలో ప్రైవేటు విస్తరణకు ఉన్న అరకొర నిబంధనలను సైతం సడలిస్తోంది.
ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేయటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ పోటాపోటీగా వ్యవహరిస్తున్నాయి. 2023–24లో ఆంధ్రప్రదేశ్‌లో 45,000 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, 2024–25లో ఆ సంఖ్య 44,886కు తగ్గింది. 2025–26లో 44,222కు పడిపోయింది. అంటే రెండేళ్లలో 778 ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయి. ఇదే కాలంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య కూడా 40 లక్షల 50 వేల నుంచి 34 లక్షల 93 వేలకు తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అంటే 5 లక్షల 56 వేలకు పైగానే విద్యార్థులు తగ్గారు. మరోవైపు ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగింది. ఈ పరిణామాలపై ఉపాధ్యాయ సంఘాలు, విద్యావేత్తల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని, ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని, మూతపడే పరిస్థితిలో ఉన్న పాఠశాలలను కాపాడాలని వారు కోరుతున్నారు. అలాంటి సమయంలో కొత్త ప్రైవేటు పాఠశాలలకు అనుమతులను సులభతరం చేయడం దారుణం.
ప్రైవేటు, కార్పొరేట్ విద్య కారణంగా సామాన్య, మధ్యతరగతి కుటుంబాలపై మోయలేనంత భారం పడుతోంది. 2025 జాతీయ విద్యా సర్వే ప్రకారం ప్రభుత్వ పాఠశాలలో ఒక్కో విద్యార్థిపై కుటుంబం చేసే సగటు వార్షిక ఖర్చు ₹2,863 కాగా, ప్రభుత్వేతర పాఠశాలల్లో అది ₹25,002గా ఉంది. అంటే దాదాపు తొమ్మిది రెట్లు ఎక్కువ. ఈ వ్యత్యాసం కేవలం ఫీజులకే పరిమితం కాదు. పుస్తకాలు, యూనిఫాం, రవాణా, ప్రత్యేక తరగతులు వంటి అదనపు ఖర్చులూ తల్లిదండ్రులపై భారంగా మారుతున్నాయి. ఏపీలో ఈ ఏడాది ప్రైవేటు పాఠశాలలు 15–20 శాతం వరకు ఫజులు పెంచినట్లు తల్లిదండ్రుల సంఘాలు ఫిర్యాదు చేశాయి. కార్పొరేట్ విద్యాసంస్థల పోటీ, విద్యావిధానం విద్యార్థులపై తీవ్ర ఒత్తిడిని పెంచుతోంది. చదువు కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి కూడా అనేక కుటుంబాల్లో కనిపిస్తోంది.
ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ పాఠశాలల సంఖ్య తగ్గుతూ, ప్రైవేటు విద్య విస్తరించేందుకు నిబంధనలు మరింత సడలించడం విద్యాహక్కు అనే రాజ్యాంగ హామీని తుంగలో తొక్కటమే! పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్య అందుబాటులో ఉండాలంటే ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయడం, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయడం ప్రభుత్వ ప్రాధాన్యాలుగా ఉండాలి. నాణ్యమైన విద్య అందించడం ప్రభుత్వ బాధ్యత. ఆ దిశగా పాలకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ప్రభుత్వ విద్యారంగాన్ని బలహీనపరిచే ప్రభుత్వ చర్యల పట్ల పౌరసమాజం అప్రమత్తంగా ఉండాలి.








కామెంట్‌లు (0)