కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేపై బిజెపి అనుకూలవాదులు జైపూర్‌లో జరిపిన భౌతిక దాడి గర్హనీయం. ఇది అప్రజాస్వామికం మాత్రమే కాదు; పిరికిపందల చర్య కూడా. ఈ ఘటనను ఒక వ్యక్తిపై జరిగిన దాడిగా కాక, భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కుపై జరిగిన దాడిగా చూడాలి. మే 15న ఒక కేసు విచారణ సందర్భంగా "కాక్రోచ్‌లు" అనే పదాన్ని ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి నిరుద్యోగ యువతను ఉద్దేశించి వాడడం తీవ్రమైన చర్చకు, కదలికకు దారి తీసింది. "మమ్మల్ని బొద్దింకలతో పోలుస్తారా? సరే! మేము బొద్దింకలమే" అంటూ యువత ఆ పదాన్ని తమ ప్రతిఘటనకు ప్రతీకగా మార్చుకుంది. ఆ నేపథ్యంలో అభిజిత్ దీప్కే ప్రారంభించిన కాక్రోచ్ జనతా పార్టీ అనే వ్యంగ్య ప్రతిఘటన వేదికకు కోట్లాది మంది యువజన, విద్యార్థుల నుంచి మద్దతు వెల్లువెత్తింది. ఈ ఉద్యమం మొదలైన తొలిరోజు నుంచి బిజెపి అనుకూల సంఘాలు, వేదికలు దానిపై తీవ్రమైన దుష్ప్రచారాన్ని మొదలు పెట్టాయి. అయినప్పటికీ, ఢిల్లీ, పుణే, నాగ్‌పూర్, అమృత్‌సర్, హైదరాబాద్, జైపూర్ నగరాల్లో సిజెపి చేపట్టిన ప్రదర్శనలకు పెద్ద ఎత్తున యువత హాజరయ్యారు. ఇది కాషాయవాదులకు మింగుడుపడని పరిణామంగా మారింది. దీంతో బిజెపి మద్దతుదారులు జైపూర్‌లో యువ సమూహంలో కలిసిపోయి అభిజిత్ మీద భౌతిక దాడికి పాల్పడ్డారు.
ఈ ఉద్యమం లేవనెత్తుతున్న ప్రశ్నలు నేరుగా మోడీ ప్రభుత్వపు అసమర్థతను, బాధ్యతారాహిత్యాన్ని వేలెత్తి చూపిస్తున్నాయి. అందుకనే బిజెపి నాయకగణం ‘కాక్రోచ్‌ల’పై విరుచుకుపడుతోంది. నీట్, సిబిఎస్‌ఇ పరీక్షల్లోని అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేదే ఈ ఉద్యమం ప్రధాన డిమాండ్. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, పేపర్ లీక్‌లపై కఠిన చర్యలు, నియామకాల్లో జవాబుదారీతనం, విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించే సంస్కరణలు చేపట్టాలన్న డిమాండ్లు కూడా ఈ వరుసలో ఉన్నాయి. వాస్తవానికి ఇవేవీ కొత్తవి కావు. ఎవరినీ పక్కదోవ పట్టించేవి అసలే కావు. గత కొన్నేళ్లుగా విద్యార్థి, యువజన సంఘాలు వినిపిస్తున్నవే! దేశంలో ప్రవేశ, నియామక పరీక్షల్లో చోటు చేసుకుంటున్న అవకతవకలు యువతలో తీవ్ర నిరాశను కలిగిస్తున్నాయి. ఒక ఉద్యోగం కోసం, ఒక సీటు కోసం సంవత్సరాల తరబడి శ్రమించిన విద్యార్థులు పేపర్ లీక్‌లు, పరీక్షల రద్దుల వార్తలు వినాల్సి వస్తోంది. 2014 ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోడీ ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని దేశ యువతకు హామీ ఇచ్చారు. అప్పటి నుంచి పన్నెండేళ్లు గడిచాయి. ఆ లెక్కన దేశంలో 24 కోట్ల ఉద్యోగాలు కల్పించి ఉండాలి. కానీ అది జరగలేదు. కాబట్టే ఉన్నత విద్య పూర్తిచేసిన లక్షలాది మంది ఇప్పుడు తమ భవిష్యత్తు గురించి గొంతెత్తి అడుగుతున్నారు. పరీక్షల్లో అవకతవకలపైనా, ఉద్యోగ కల్పన హామీలపైనా ప్రశ్నిస్తున్నారు. వాటికి సమాధానం చెప్పలేని స్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉంది. మతోన్మాదం వైపు మళ్లించడమే ఒక వ్యూహంగా పెట్టుకున్న పార్టీ - యువత నిలదీసి అడిగే సరికి నీళ్లు నములుతోంది. ఏదో విధంగా ఉద్యమాన్ని నీరుగార్చాలని ప్రయత్నిస్తోంది.
భారత రాజ్యాంగంలోని అధికరణ 19(1)(ఎ), 19(1)(బి) ప్రకారం, పౌరులకు భావప్రకటన స్వేచ్ఛ ఉంది. శాంతియుతంగా సమావేశమయ్యే హక్కు ఉంది. ఈ దేశపు యువత, విద్యార్థులు శాంతియుతంగా సమీకృతమై తమ భవిష్యత్తు గురించిన ఆవేదనను, ఆలోచనలను కలబోసుకోవటం రాజ్యాంగ విరుద్ధం కాదు. వారి హక్కును కాపాడాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలది. తమను విమర్శించే వారి హక్కులను కూడా కాపాడినప్పుడే ప్రజాస్వామ్యంపై విశ్వాసం బలపడుతుంది. అలాగే వారు లేవనెత్తుతున్న ప్రశ్నలకు జవాబులు చెప్పాలి. లోపాలను చక్కదిద్దుకొని, యువ విద్యార్థి లోకానికి భరోసా ఇవ్వాలి. అంతేకానీ, భౌతిక దాడులు, బెదిరింపులు, భయపెట్టే ప్రయత్నాలు సమర్థనీయం కావు. ఒక వ్యక్తిని కొట్టడం ద్వారా ప్రశ్నలను చంపలేరు. భయపెట్టడం ద్వారా ఒక తరం ఆవేదనను ఆపలేరు. ఒక చెంపదెబ్బతో నిరుద్యోగం సమసిపోదు, పరీక్షలపై ఉన్న అనుమానాలు తొలగిపోవు. ప్రశ్నలకు సమాధానాలు చెప్పటం, లోపాలను చక్కదిద్దుకోవటం మాత్రమే దీనికి సరైన పరిష్కారం. అందుకని కోట్లాది మంది విద్యార్థి యువస్వరాలు గొంతెత్తుతున్నట్టుగా - కేంద్ర విద్యాశాఖ మంత్రిని తక్షణం ఆ పదవి నుంచి తప్పించాలి. పరీక్షల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసి, విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు, యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే ప్రణాళిక ప్రకటించాలి.








కామెంట్‌లు (0)