'విద్య లేకపోవడంతో జ్ఞానం నశించింది, జ్ఞానం లేకపోవడంతో నైతిక విలువలు నశించాయి, నైతిక విలువలు లేకపోవడంతో అభివృద్ధి నశించింది, అభివృద్ధి లేకపోవడంతో సంపద నశించింది. ఒక్క విద్యాలోపం వల్లే ఇంత విఘాతం జరిగింది` అని దాదాపు 180 ఏళ్ల క్రితం జ్యోతిరావు పూలే అన్నారు. విద్య అనేది సమాజంలో మార్పు తీసుకొచ్చే అత్యంత శక్తివంతమైన ఆయుధం. ఆ ఆయుధాన్ని పదును పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. కానీ నేటి విద్యావిధానం శాస్త్రీయ దృక్పథంతో కాకుండా రాజకీయ, సాంస్కృతిక ఆధిపత్య సాధనంగా మారింది. పాఠ్యాంశాల్లో మార్పులు, చరిత్ర పుస్తకాల పునర్వ్యాఖ్యానాలు, సామాజిక శాస్త్రాల ప్రాధాన్యతను మసకబార్చడం వంటి చర్యలు ఊపందుకున్నాయి. అంతేకాదు, వరుసగా సిబిఎస్ఇ, నీట్ పరీక్షా పేపర్ల లీకేజీ కేంద్ర ప్రభుత్వ వైఫల్యాన్ని బట్టబయలు చేసింది._ దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో రూపు దిద్దుకుంటుందని చెబుతారు. కానీ నేడు భారత విద్యారంగం వైపు చూస్తే ఆశల కంటే ఆందోళనలే ఎక్కువగా కనిపిస్తాయి. పాఠశాలలు తిరిగి తెరుచుకుంటున్న ఈ సమయంలో విద్యార్థులు కొత్త పుస్తకాలతో, కొత్త కలలతో తరగతి గదుల్లో అడుగుపెడుతుంటే, విద్యావ్యవస్థ మాత్రం గందరగోళం, వివాదాలు, అనిశ్చితి, లీకేజీల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఉపాధ్యాయుల కొరత, పాఠ్యపుస్తకాల లభ్యత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోకపోవడం ఆందోళనకరం. సీబీఎస్ఈ తాజాగా తొమ్మిదో తరగతిలో త్రిభాషా విధానాన్ని తప్పనిసరి చేస్తూ తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. విద్యార్థులు మూడు భాషలు నేర్చుకోవాలని, అందులో రెండు భారతీయ భాషలైనా ఉండాలని చెప్పడం ఆందోళన కలిగించే అంశం.
అంతేకాదు, దేశంలోని అతి పెద్ద జాతీయ పరీక్షా సంస్థలలో ఒకటైన సిబిఎస్ఇ, పదేపదే సంక్షోభాలలో చిక్కుకుంటోంది. జాతీయ ప్రవేశ పరీక్షలను నిర్వహించే సంస్థలు కూడా తరచుగా వివాదాలలో కూరుకుపోతున్నాయి. విద్యా వ్యవస్థలో మరో తీవ్రమైన సమస్య జవాబుదారీతనం లేకపోవడం. పాఠశాలలో చిన్న లోపం జరిగినా, ఉపాధ్యాయులపై చర్య తీసుకుంటారు. జిల్లా స్థాయి అధికారి పొరపాటు చేస్తే, విచారణ జరుగుతుంది. కానీ జాతీయ స్థాయిలో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ ప్రభావితం చేసే లోపాలు జరిగితే దానికి బాధ్యులు ఎవరు? ఎవరిని జవాబుదారీ చేయాలి? 'సంస్థది తప్పు లేదు' అనే వైఖరి భారత అధికార యంత్రాంగంలోని పురాతన రోగాలలో ఒకటి. సిబిఎస్ఇ నుంచి నీట్ వరకు, రాష్ట్ర స్థాయి నియామక పరీక్షల నుంచి ఉద్యోగ నియామక ప్రక్రియల వరకు ప్రశ్నపత్రాల లీకేజీలు, అవకతవకలు, పారదర్శకత లేమి వరుసగా బయటపడుతున్నాయి. పరీక్ష అంటే ప్రతిభకు కొలమానం కావాలి. కానీ నేడది వ్యవస్థీకృత వైఫల్యాల బారిన పడుతోంది. “విద్య యొక్క అసలు లక్ష్యం వాస్తవాలను సేకరించడం కాదు; ఆలోచించే మనసును నిర్మించడం” అంటారో విద్యావేత్త. కానీ నేడు విద్యార్థుల ముందు నిలిచిన పరిస్థితి వేరు. ప్రశ్నాపత్రం లీక్ అవుతుందేమో, పరీక్ష వాయిదా పడుతుందేమో, ఫలితాల్లో తప్పులు వస్తాయేమో అన్న భయాలు వారిని వెంటాడుతున్నాయి. లక్షలాది యువత జీవితాలపై పడుతున్న మానసిక భారం. ఉద్యోగ నియామకాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. పోటీ పరీక్షలకు ఏళ్ల తరబడి సిద్ధమయ్యే యువతకు నోటిఫికేషన్లలో ఆలస్యం, పరీక్షల రద్దు, లీకేజీలు, కోర్టు కేసులు నిత్యకృత్యంగా మారాయి. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు ఉద్యోగాలిచ్చింది లేదు. ఫలితంగా యువతలో నిస్పృహ, నిరాశ, భవిష్యత్తుపై అనిశ్చితి పెరుగుతోంది. జాతీయ విద్యా విధానం గురించి గొప్ప ప్రసంగాలు చేయడం, డిజిటల్ విద్యపై సమావేశాలు నిర్వహించడం సులభం. కానీ ఒక విద్యా వ్యవస్థకు అసలైన కొలమానం, ఆ విద్యార్థికి ఫలితాలు సకాలంలో అందుతున్నాయా, పరీక్ష సురక్షితంగా నిర్వహించబడుతోందా, ఏదైనా ఫిర్యాదు వస్తే అది త్వరితగతిన పరిష్కరించబడుతోందా అనేదే.
విద్యా రంగంలో సంస్కరణలు అవసరమే. కానీ సంస్కరణ అంటే కేవలం కొత్త నిబంధనలు తీసుకురావడం కాదు. విద్యార్థి, ఉపాధ్యాయుడు, తల్లిదండ్రుల అవసరాలను అర్థం చేసుకుని వ్యవస్థను మెరుగుపరచడం. పరీక్షల నిర్వహణలో సంపూర్ణ పారదర్శకత, సాంకేతిక భద్రత, బాధ్యతాయుత వ్యవస్థ, సామాజిక శాస్త్రాల బలోపేతం, ఉపాధ్యాయుల శిక్షణ- ఇవన్నీ కలిస్తేనే నిజమైన సంస్కరణ. సామాజిక శాస్త్రాలు సమాజాన్ని అర్థం చేసుకునే కిటికీలు. చరిత్ర మనకు గతాన్ని నేర్పుతుంది. రాజ్యాంగం ప్రజాస్వామ్య విలువలను తెలియజేస్తుంది. ఆర్థిక శాస్త్రం అభివృద్ధి దిశను చూపిస్తుంది. రాజకీయ శాస్త్రం హక్కులు, బాధ్యతలను వివరిస్తుంది. ఈ అంశాల ప్రాధాన్యత తగ్గితే విమర్శనాత్మక ఆలోచన బలహీనపడుతుంది. 'మనిషిలో ఇప్పటికే ఉన్న పరిపూర్ణతను వెలికితీయడమే విద్య` అంటారు స్వామి వివేకానంద. ఆ పరిపూర్ణతను వికసింపజేసే వ్యవస్థ, పాఠశాలల వాతావరణం అవసరం. విద్య కేవలం నేటి విద్యార్థుల సమస్య కాదు... రేపటి దేశ నిర్మాణం. అందుకే అంటాడు మహాకవి శ్రీశ్రీ- 'మీదే, మీదే సమస్త విశ్వం/మీరే లోకపు భాగ్యవిధాతలు/ మీ హాసంలో మెరుగులు తీరును/ వచ్చేనాళ్ల విభాప్రభాతములు` అని. దేశానికి నేడు కావలసింది విద్యపై రాజకీయ ఆధిపత్యం కాదు; విద్యపై సామాజిక బాధ్యత. పాఠ్యాంశాలపై నియంత్రణ కాదు; జ్ఞానంపై విశ్వాసం. 'ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో/ ఎక్కడ మనుషులు తలలెత్తి తిరుగుతారో/ఎక్కడ జ్ఞానం విరివిగా వెల్లివిరుస్తుందో/ …ఆ స్వేచ్ఛ స్వర్గానికి, నా దేశాన్ని మేల్కొలుపు` అంటారు టాగూర్. విద్యాలయాల నుంచి సమాజంలోకి అడుగు పెట్టే యువతకు కావాల్సంది ఈ నూతన విద్యాసంవత్సరం అయినా సజావుగా సాగడం. ఆ బాధ్యతను ప్రభుత్వం, విద్యాసంస్థలు, సమాజం- అందరూ కలిసి నిర్వర్తించాల్సిన సమయం ఇదే.
భవిష్యత్తును రక్షించాలి
5 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 14, 2026, 06:30 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం







కామెంట్లు (0)