ఒక మాయా వలయం
ప్రాంతాల్ని బంధించే దిశలో విస్తరిస్తోంది
కరువు రాకాసిగా జడలు విప్పుకుంటూ
వాతావరణాన్ని కబళించేందుకు
రెక్కలు కట్టుకుని బయలుదేరింది.
నీటి మేఘాలపై వత్తిడి పెంచుతూ
ఒక స్థిరత్వాన్ని చెదరగొట్టేందుకు
వేడి పవనంగా పరుగులతో వస్తోంది
అతివృష్టి అనావృష్టి వలయాకారంగా
భూమిపై వాలిపోడానికి సిద్ధమైంది.
సూపర్ ఎల్ నినో పేరును తగిలించుకుని వడగాల్పుల్ని వెదజల్లుతూ వస్తోంది
ఉపరితల ఉష్ణానికి ఆజ్యం పోస్తూనే
వర్షాభావ పరిస్థితికి అద్దం పడుతోంది
పాడి పంటలపై మంటను ఉసిగొల్పుతూ
నష్టాల కడలిలో ముంచడానికి వస్తోంది.
బీడువారిన భూమిలో పగుళ్ళను
మనసారా నిమరడానికి ఉవ్విళ్లూరుతోంది
ఆకలి కడుపుల రోదనలను
రాగాలాపంగా వినాలని ఆత్రుత పడుతోంది
మొలకలపై వత్తిడి పెంచుతూనే
చిగురును తుంచడానికి సంసిద్ధమైంది.
సూపర్ ఎల్ నినో పరివర్తనంలో
ఏ ప్రాంతం ఏ రంగును పులుముకుంటుందో
ఏ ఆవర్తనం ఎంత వరకు విస్తరిస్తుందో
మండే సూర్యగోళపు సెగల కిరణాలకు
రోకలి బండ పగిలే దీనావస్థ రాకముందే
జాగ్రత్తకు దగ్గరవుతూ జీవిద్దాం.
- నరెద్దుల రాజారెడ్డి
సెల్ : 9666016636








కామెంట్‌లు (0)