‘ఏం కొనేటట్టు లేదు.... ఏం తినేటట్టు లేదు....’ అని నాటి ఆర్. నారాయణమూర్తి సినిమాలో పాట నేటి పరిస్థితులకు అద్దం పడుతుంది. ఆదాయం గోరంతగా, నిత్యావసర వస్తువుల ధరలు అందనంతగా వున్నాయి. దాంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు కొనలేక తినలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పెరిగిన ధరలకు పేదవాడి పొట్టే బలి అన్నట్లుగా భారం అంతా సామాన్య, మధ్యతరగతి ప్రజల పైన పడుతున్నది. మరోపక్క హోటల్ యజమానులు గ్యాస్ రేట్లు పేరుతో టిఫిన్, టీ ధరలు పెంచేశారు. గ్యాస్ రేట్లు తగ్గినా టిఫిన్, టీ, ధరలు తగ్గించడం లేదు. ప్రస్తుత ఇదే కూటమి ప్రభుత్వం విపక్షంలో ఉన్నప్పుడు బాదుడే...బాదుడు...అంటూ రోడ్లపై కొచ్చి అప్పట్లో హంగామా చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ‘దంచుడే దంచుడు’ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారే తప్ప ధరలను అరికట్టడంలో విఫలమవుతున్నారు. ఇంకో పక్క వర్షాభావ పరిస్థితులను అడ్డుగా పెట్టుకుని వ్యాపారస్తులు రోజు రోజుకి ధరలు పెంచేస్తున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని రోజువారీ కూలీల పరిస్థితి మరీ అగమ్యగోచరంగా మారుతున్నది. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించి పెరిగిన ధరలను నియంత్రించి సామాన్య ప్రజలకు ఉపశమనం కలిగించాలి.
- దాసం వెంకటరెడ్డి, ఊరదాళ్లపాలెం, ప.గో జిల్లా.








కామెంట్‌లు (0)