గుక్కెడు నీళ్ల కోసం పరుగులు
భూగర్భం తడి లేని గొంతుతో
ఆర్తనాదాలు చేస్తూ దుఃఖిస్తోంది
బోరు బావుల చూట్టూ ఎండు గడ్డి
ఎముకలు మీదేసుకున్న శరీరంలా
పిల్లగాలికి ఊగుతూ విరిగిపోతోంది.
బిందెలో నీటి చుక్క తడి లేక
ఒట్టి నీటి కుండ మూలకు చేరింది
వానాకాలంలో ఎండాకాలం
పైపైన నేల తడుపుతూ పొడి చినుకులు
భూతాపం ఎండమావులై పరిగెడుతూ
ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
నీళ్ళు కరువొచ్చింది సామీ
పంటలు లేని బీడు భూమి
పిచ్చి మొక్కల గుంపులో ఇరుక్కుని
ఊపిరాడక విలవిలలాడుతోంది
చుక్క నీరు కూడా లేని కుళాయిలు
స్పృహ తప్పి పడినట్టు గమ్మునున్నాయి.
పిడచ పిడచకు గొంతారిపోతుంటే
మెతుకు మింగుడు పడలేదు సామి
అతుకుల బతుకుల మధ్యలో
నీళ్ళు కరువు కాటేసింది
వలసెళ్ళే కాలం కాలనాగై
బుసలు కొడుతూ తరుముతుంటే
ఎటు వెళ్ళాలో తెలియని సంకటమైంది.
నీళ్ళు కొనే స్థితి దాపురించినాక
మట్టిని కూడా తాకలేని పరిస్థితి వచ్చింది
పిల్లా పాప కుయ్యో మొర్రో అంటుంటే
ఎండిపోయిన కన్న పేగు అలమటిస్తోంది
అయ్యా, కరువు వచ్చి మీద పడింది
గుక్కెడు నీళ్లు కావాలి సామీ.
- నరెద్దుల రాజారెడ్డి,
సెల్ : 9666016636








కామెంట్‌లు (0)