- 85 శాతం దాటితే ప్లానింగుకు వెళ్లే ఆలోచన
- 50 శాతానికి చేరువలో పూలింగు ప్రక్రియ
- అమరావతి రైతులను కలుస్తున్న అధికారులు
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాజధాని అమరావతి పరిధిలోని రెండోదశ భూసమీకరణ (ల్యాండ్ పూలింగ్) ప్రక్రియ 50 శాతానికి చేరువైంది. రెండు నెలల్లో పూలింగు పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నప్పటికీ ఆచరణలో ఆలస్యంగా సాగుతోంది. కొన్ని గ్రామాల్లో రైతుల్లో పలు అనుమానాలు ఉండటం, లేమల్లెలో రోడ్డుకు ఆనుకుని ఉన్న భూములకు జరీబు ప్యాకేజీ ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. మరికొంత మంది రైతులు తమకు రిటర్నబుల్ ప్లాట్లు ఎక్కడ ఇస్తారో చెప్పాలని కోరుతున్నారు. మరికొంత మందైతే మొదటిదశ పూర్తయితే తాము ఇస్తామని తెగేసి చెబుతున్నారు. ఇటీవల సిఆర్‌డిఎ అధికారులు గుంటూరులోని ఓ మాజీ ప్రతినిధిని కూడా కలిసి వచ్చారు. వారి కుటుంబాలకు సంబంధించిన భూములివ్వాలని కోరారు. దీనిపై వారు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో అధికారులు ఎటూ తేల్చలేకపోతున్నారు. అయినా గ్రామాలకు కేటాయించిన స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు ఇంటింటికీ తిరిగి పూలింగుకు సహకరించాలని రైతులను కోరుతున్నారు. ఎంత తొందరగా భూములిస్తే అంత తొందరగా ప్లాట్లు తిరిగి ఇస్తామని తెలిపారు. పూలింగు ప్రక్రియపై ఇటీవల అధికారులతో మాట్లాడిన పెదకూరపాడు ఎమెల్యే భాష్యం ప్రవీణ్ నాలుగు గ్రామాల్లో 85 శాతం ప్రక్రియ పూర్తయితే అక్కడ ప్లానింగు, రోడ్లు, ఇతర సదుపాయాల కల్పన పనులు వెంటనే చేపడతామని, దానికి అనుగుణంగా భూములివ్వాలని రైతులను కోరారు. వారిని ఒప్పించాలని అధికారులకూ సూచించారు. వైకుంఠపురం, హరిశ్చంద్రాపురం మధ్యలో స్పోర్ట్స్ సిటీ వస్తుందని, సమీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. అమరావతిలో అన్ని రకాల భూములు కలిపి 20,494 ఎకరాలు ఉంది. దీనిలో పట్టా భూమి 16,562.56 ఎకరాలు ఉండగా, అసైన్డ్ భూమి 104 ఎకరాలు ఉంది. ఇది కాకుండా ప్రభుత్వ భూమి 3,828 ఎకరాలు ఉంది. దీనిలో సమీకరణ ప్రకియ చేపట్టి 2025 డిసెంబర్ నుండి ఇప్పటి వరకూ 8,180 ఎకరాలు మాత్రమే వచ్చింది.
గ్రామం మొత్తం భూమి వచ్చింది
వైకుంఠపురం 1,925 1,264
యండ్రాయి 1,965 1,047
పెదమద్దూరు 1,018 800
కర్లపూడి 2,654 1,553
హరిశ్చంద్రాపురం 1,380 574
వడ్డమాను 1,768 668
పెదపరిమి-1 3,072 1,182
పెదపరిమి-2 3,056 1,092







కామెంట్‌లు (0)