- జర్నలిస్టులపై దురుసు ప్రవర్తనపై సుప్రీంకోర్టులో ఢిల్లీ పోలీసుల అఫిడవిట్
న్యూఢిల్లీ : ఆందోళనలు వంటి జన సమూహ నియంత్రణ కార్యకలాపాల్లో మహిళలను కేవలం మహిళా సిబ్బంది మాత్రమే నియంత్రించాలనే నియమం ఏదీ లేదని ఢిల్లీ పోలీసులు సుప్రీంకోర్టుకు తెలిపారు. ఈ మేరకు అత్యున్నత న్యాయస్థానంలో పోలీసులు ఒక అఫిడవిట్‌లో సమర్పించారు. మహిళలను అరెస్టు చేయడం లేదా సోదాలు నిర్వహించడం కేవలం మహిళా పోలీసు అధికారులు మాత్రమే నిర్వహించాలనే చట్టపరమైన నిబంధన, జన సమూహ నియంత్రణ పరిస్థితులలో తప్పనిసరి కాదని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన ఆందోళనల సందర్భంగా పురుష పోలీసు అధికారులు మహిళా నిరసనకారులను, జర్నలిస్టులను లైంగికంగా వేధించారని, దురుసుగా ప్రవర్తించారన్న ఆరోపణలపై పోలీసులు స్పందించారు. న్యాయవాది ఆర్తి రాజన్ ప్రాతినిధ్యం వహిస్తున్న 'నెట్‌వర్క్ ఆఫ్ విమెన్ ఇన్ మీడియా, ఇండియా'తో పాటు, ఢిల్లీ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్, ఫ్రీ స్పీచ్ కలెక్టివ్, కేరళం యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ వంటి ఇతర సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారిస్తోంది. ఈ విచారణలో ‘‘మహిళా జర్నలిస్టులపై దురుసుగా ప్రవర్తించారన్న ఆరోపణలకు సంబంధించి, సోదాలు - అరెస్టుల విషయంలో భారతీయ నాగరిక్ సురక్షా సంహిత 2023లో స్పష్టంగా నిర్దేశించిన విధంగా, జన సమూహ నియంత్రణ కార్యకలాపాల సందర్భంలో మహిళలను మహిళా సిబ్బంది నియంత్రించాలనేది చట్టబద్ధమైన ఆదేశం కాదని గౌరవపూర్వకంగా విన్నవిస్తున్నాం’’ అని పోలీసులు తెలిపారు. సిజెపి ఆందోళనలు సందర్భంగా జన సమూహ నియంత్రణ చర్యలకు కేవలం పురుష పోలీసు సిబ్బందిని మోహరించడం తప్పుకాదని తెలిపారు. జన సమూహ నియంత్రణకు పురుష పోలీసు అధికారి బాధ్యతలు నిర్వహించడానికి చట్టపరమైన అడ్డంకి ఏదీ లేదని తెలిపింది. ‘‘ఇలాంటి నిర్ణయాలు క్షణంలో తీసుకోవాల్సి ఉంటుంది’’ అని పోలీసులు తమ అఫిడవిట్‌లో పేర్కొన్నారు. అలాగే, పాత్రికేయులు, న్యాయవాదులు, ఇతర నిపుణులు తమ వృతిపరమైన విధులు నిర్వర్తించడానికి ‘‘అడ్డంకులు సృష్టించవద్దని’’ అక్టోబర్ 11న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశంపై స్పందిస్తూ.. రీల్-మేకర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు లేదా నిషేధిత సమావేశ స్థలంలో పోలీసుల ఆదేశాలను ఉల్లంఘించే అల్లరి మూకలకు ఇది వర్తించదని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ‘కొంత మంది కెమెరా, మైక్రోఫోన్‌ను ఉపయోగించి పాత్రికేయులుగా నటిస్తున్నారని పోలీసులు ఆరోపించారు. జర్నలిస్టులకు, రీల్-మేకర్లకు మధ్య తేడాను గుర్తించడం కష్టంగా ఉన్నా... , శాంతిభద్రతలకు, చట్టానికి ముప్పు వాటిల్లేంత వరకు రీల్-మేకర్లను అడ్డుకోలేదని లేదా నిరోధించలేదని అఫిడవిట్‌లో పేర్కొన్నారు.







కామెంట్‌లు (0)