సోమవారం, 07 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

10, 11 తేదీల్లో 8వ కలెక్టర్ల సదస్సు

1 గంట క్రితం

cm
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 07, 2026, 11:55 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- ప్రత్యేక ఓపెన్ ఫోరం నిర్వహణ

- ఆర్థిక వృద్ధి నుంచి ఎల్‌నినో, సంక్షేమం,

- భూ పరిపాలన, విద్యుత్, శాంతిభద్రతలపై సమీక్ష

- గత సదస్సు ఫలితాలపైనా చర్చ

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : రాష్ట్ర ఎనిమిదవ కలెక్టర్ల సదస్సు ఈ నెల 10, 11 తేదీల్లో అమరావతి సచివాలయంలో జరగనుంది. ముఖ్యమంత్రి అధ్యక్షతన రెండు రోజుల పాటు నిర్వహించే ఈ సదస్సులో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, జిల్లాల అభివృద్ధి, పెట్టుబడులు, ఎల్‌నినో ప్రభావం, సంక్షేమ పథకాలు, ఈ-గవర్నెన్స్, ఆరోగ్యం, విద్య, నైపుణ్యాభివృద్ధి, భూ పరిపాలన, విద్యుత్, శాంతిభద్రతలు తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించనున్నారు. ఈ మేరకు అజెండాను ఖరారు చేసారు. గతంలో జరిగిన కలెక్టర్ల సదస్సుల అనుభవాలను పరిగణనలోకి తీసుకుని ఈసారి సమావేశాల షెడ్యూల్‌ను జవాబుదారీతనం, అంశాల వారీ చర్చలు సమయపాలన, గణాంకాల సమీక్ష, స్పష్టమైన బాధ్యతల కేటాయింపు వంటి అంశాలతో అజెండా రూపొందించారు.

గత సదస్సులో తీసుకున్న నిర్ణయాలపై యాక్షన్ టేకెన్ రిపోర్ట్‌తో సదస్సు ప్రారంభమవుతుంది. రెండో రోజు కలెక్టర్లు తమ జిల్లాల సమస్యలను నేరుగా ప్రస్తావించేందుకు ప్రత్యేక ఓపెన్ ఫోరం కూడా ఏర్పాటు చేశారు. తొలుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్వాగత ప్రసంగం, రెవెన్యూ మంత్రి ప్రారంభ వ్యాఖ్యలు, ఆర్థిక మంత్రి 2026-27 ఆర్థిక ప్రాధాన్యాలపై మాట్లాడతారు. అనంతరం కలెక్టర్లనుద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడతారు. తొలిరోజు 11.15 నుంచి 12 గంటల వరకు 7వ కలెక్టర్ల సదస్సులో తీసుకున్న నిర్ణయాల అమలుపై జిల్లాల వారీగా యాక్షన్ టేకెన్ రిపోర్ట్ సమీక్షించనున్నారు. ఏ నిర్ణయాలు పూర్తయ్యాయి, ఏవి పెండింగ్‌లో ఉన్నాయి, ఆలస్యానికి కారణాలేమిటన్న దానిపై చర్చించనున్నారు. అనంతరం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ప్రజెంటేషన్ ఉంటుంది. స్వర్ణాంధ్ర-2047లో భాగంగా 11 కనీస అవసరాల అమలులో ఉన్న లోటుపాట్లను సమీక్షించనున్నారు. ఇళ్లస్థలాలు, గృహాలు, పారిశుధ్యం, తాగునీరు, డిజిటల్ కనెక్టివిటీ, ఎల్‌పీజీ, విద్యుత్, రహదారి అనుసంధానం, వీధి దీపాలు, వేస్ట్ టు వెల్త్, సామాజిక మౌలిక వసతులు వంటి అంశాలపై చర్చ జరుగుతుంది. అలాగే కేంద్ర ప్రాయోజిత పథకాలు, నిధుల మంజూరు, వినియోగం, మిగులు నిధులపై జిల్లా వారీగా, పథకం వారీగా సమీక్ష ఉంటుంది.

ఎల్‌నినో ప్రభావంపై సుదీర్ఘ సమీక్ష

తొలిరోజు అత్యంత కీలకమైన అంశాల్లో ఎల్‌నినో కార్యాచరణ ప్రణాళిక ఒకటిగా అజెండాలో పొందుపరిచారు. నీటి వనరులు, ప్రాథమిక రంగం, తాగునీరు, ఎల్‌నినో ప్రభావం, వేతన ఉపాధి సుమారు రెండు గంటల పాటు సమీక్ష జరగనుంది. వ్యవసాయం, పశుసంవర్ధక, జలవనరులు, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, మున్సిపల్ శాఖలతో ఈ చర్చ ఉంటుంది. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా సంక్షేమ, సూపర్ సిక్స్ పథకాలు, లబ్ధిదారులు, గృహాలు, పీ4, సాధికారత, సెర్ప్, మహిళా సాధికారత తదితర అంశాలపై చర్చిస్తారు.

రెండో రోజు ఈ-గవర్నెన్స్, ఆర్టీజీఎస్, ఫైళ్ల పరిష్కారం, పీజీఆర్‌ఎస్, ప్రభుత్వంపై సానుకూల ప్రజాభిప్రాయం వంటి అంశాలపై సమీక్ష జరగనుంది. జిల్లా వారీగా ఈ-ఆఫీస్ పెండెన్సీ, ఫిర్యాదుల పరిష్కారం, పెండింగ్ కేసులు, డేటా లేక్, అవేర్, ఏఐ స్టాక్ తదితర అంశాలను పరిశీలిస్తారు. ప్రతి జిల్లా నుంచి పీజీఆర్‌ఎస్‌కు సంబంధించి సమీక్షిస్తారు. ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సంజీవనిపై చర్చ జరగనుండగా, విద్య, నైపుణ్యాభివృద్ధి అంశాలపై ప్రత్యేక సెషన్లు ఉంటాయి. అనంతరం భూ పరిపాలన, విద్యుత్ రంగాలపై జిల్లా స్థాయి సమీక్షలు నిర్వహిస్తారు.

కలెక్టర్లకు ప్రత్యేక ఓపెన్ ఫోరం

రెండో రోజు మధ్యాహ్నం జిల్లాల ఉత్తమ విధానాలపై కలెక్టర్ల ఓపెన్ ఫోరం నిర్వహించనున్నారు. జిల్లాల్లో అమలు చేస్తున్న మంచి విధానాలను కలెక్టర్లు ప్రజెంట్ చేస్తారు. ప్రతి కలెక్టర్‌కు ఐదు నిమిషాల సమయం కేటాయించారు. అనంతరం 45 నిమిషాల పాటు కలెక్టర్లు నేరుగా తమ జిల్లాల్లో ఎదురవుతున్న క్షేత్రస్థాయి సమస్యలు, అడ్డంకులు, ప్రభుత్వానికి అవసరమైన ప్రత్యేక చర్యలను ప్రస్తావించే అవకాశం కల్పించారు. సదస్సు చివరి దశలో శాంతిభద్రతలపై సమీక్ష జరగనుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్