- ఐదు గదుల్లో 870 మంది విద్యార్థులు
- ఆరు బయటే భోజనం, స్నానం
- వాకాడు గురుకులంలో వసతుల లేమి
- విద్యార్థులను ఇళ్లకు తీసుకెళ్తున్న తల్లిదండ్రులు
- కోట గురుకులం మూసివేతతో తప్పని తిప్పలు
ప్రజాశక్తి - తిరుపతి బ్యూరో : “అమ్మా.. ఇక్కడ ఉండలేకపోతున్నా.. నన్ను ఇంటికి తీసుకెళ్లమ్మా..” గురుకుల పాఠశాలలో చదువుకుంటున్న ఓ విద్యార్థి తన తల్లికి చేసిన ఈ ఫోన్ కాల్‌తో ఆ తల్లి గుండెల్లో రైళ్లు పరిగెత్తినంత భయాన్ని నింపింది. విద్యా సంవత్సరం మధ్యలో ఈ పరిస్థితి ఏంటని ఆ తల్లి తల పట్టుకుంది. మంచి చదువు చదివి జీవితంలో ఎదగాలని ఆశించి బిడ్డను గురుకులానికి పంపిన ఆ తల్లి.. తన కొడుకు పడుతున్న కష్టాలను విని కన్నీళ్లు పెట్టుకుంది. వెంటనే పాఠశాలకు చేరుకుని అక్కడి దృశ్యాలను చూసి ఆమె నోట మాట రాలేదు.ఒకే గదిలో వందమంది పిల్లలు.. పడుకోవడానికి చోటు లేదు.. స్నానాలకు సౌకర్యం లేదు.. భోజనాలకు సరైన వసతి లేదు.. మరుగుదొడ్ల కోసం 60 మంది క్యూలైన్లలో నిలబడాల్సిన దుస్థితి..“ఇంతటి కష్టాల కోసం మా పిల్లలను గురుకులానికి పంపామా?” అంటూ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. బిడ్డల్ని చూసి తల్లిదండ్రుల గుండె తరుక్కుపోతోంది
చదువు కోసం వచ్చి.. కన్నీళ్లతో వెళ్తున్న బిడ్డలు
నెల్లూరు జిల్లా కోట గురుకుల పాఠశాలను ఆగస్టు ఒకటి నుంచి మూసివేయడంతో, అక్కడ చదువుతున్న విద్యార్థులను అధికారులు ఇతర గురుకులాలకు తరలించారు. ఈ నిర్ణయంతోనైనా తమ పిల్లల చదువు సజావుగా సాగుతుందని ఆశించిన తల్లిదండ్రులకు.. తిరుపతి జిల్లా వాకాడు గురుకులంలో ఎదురైన పరిస్థితులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. గతంలో వాకాడు గురుకులంలో 621 మంది విద్యార్థులు ఉండగా, అదనంగా కోట నుంచి మరో 250 మందిని ఇక్కడికి తరలించారు. దీంతో వసతి గదులు సరిపోక విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కేవలం ఐదు గదుల్లోనే మొత్తం 871 మంది విద్యార్థులు కిక్కిరిసి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకే గదిలో దాదాపు వంద మంది వరకు సర్దుకుని పడుకుంటున్నారు. తీవ్రమైన ఉక్కపోత, రద్దీ కారణంగా రాత్రిళ్లు నిద్రపట్టడం లేదని విద్యార్థులు తమ తల్లిదండ్రుల వద్ద కన్నీరుమున్నీరవుతున్నారు. చదువు చెప్పాల్సిన ఆ తరగతి గదులు.. నేడు విద్యార్థుల దీనస్థితికి సాక్ష్యాలుగా మారుతున్నాయి.
“మా పిల్లలను మేమే చదివించుకుంటాం”
తమ పిల్లలు పడుతున్న నరకయాతనను స్వయంగా చూసిన కొందరు తల్లిదండ్రులు.. ఇక తమ పిల్లలను ఆ గురుకులంలో ఉంచేందుకు సాహసించలేకపోతున్నారు. విధిలేని పరిస్థితుల్లో పాఠశాల నుంచి టిసిలు తీసుకుని పిల్లలను ఇళ్లకు తీసుకెళ్తున్నారు. 'ప్రభుత్వం మంచి చదువు, వసతులు ఇస్తుందని నమ్మి పిల్లలను పంపించాం. కానీ, వారు ఇంతటి ఇబ్బందులు పడుతుంటే మేం చూస్తూ భరించలేం. మా ఊరిలోనే ఏదో ఒక పాఠశాలలో చేర్పించి చదివించుకుంటాం' అంటూ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. వసతుల లేమి కారణంగా ఈ వారం రోజులో ఇప్పటికే 11 మంది విద్యార్థుల తల్లిదండ్రులు టిసిలు తీసుకుని వెళ్లిపోవడం అక్కడి పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది."
సెంటర్ ఫర్ ఎక్సలెన్సీ పేరుతో
టిడిపి కూటమి ప్రభుత్వం సెంటర్ ఫర్ ఎక్సలెన్సీ విధానంలో భాగంగా ఎస్‌సి, ఎస్‌టి విద్యార్థులకు ఐఐటి, నీట్, జెఇఇ తదితర పోటీ పరీక్షలకు సమగ్ర శిక్షణ అందించేందుకు రాష్ట్రంలో మూడు కేంద్రాలను ఎంపిక చేసింది. గుంటూరు జిల్లాలో తాడికొండ, విశాఖపట్నం మేఘాద్రిగడ్డ ప్రాంతంతో పాటు నెల్లూరు జిల్లా కోటను కేంద్రంగా ఎంపిక చేశారు. ఈ ఏడాది జూలై పదిన జారీ చేసిన 144 జిఒ ద్వారా కోటలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఎస్‌సి గురుకుల పాఠశాలను సెంటర్ ఫర్ ఎక్సలెన్సీగా మార్చాలని నిర్ణయించారు. దీంతో అక్కడ సుమారు 600 మంది విద్యార్థులు చదువుతున్న గురుకుల పాఠశాలను ఎత్తివేసి, విద్యార్థులను తిరుపతి జిల్లా వాకాడు, చిల్లకూరు, నాయుడుపేట గురుకులాలకు బదిలీ చేశారు.
విద్యా సంవత్సరం మధ్యలో ఏంటీ నిర్ణయాలు..?
కోట గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులలో అత్యధికులు దళిత కుటుంబాలకు చెందినవారే. ఆర్థిక స్థోమత లేకపోయినా.. తమ పిల్లలు ఉన్నత చదువులు చదివి స్థిరపడాలనే ఆశతోనే తల్లిదండ్రులు ఈ ప్రభుత్వ గురుకులాలపై ఆధారపడ్డారు. తీరా ఇప్పుడు అదే గురుకుల వ్యవస్థలో కనీస వసతులు కూడా కరువవడంతో ఆయా కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో పడిపోయాయి. 'పేదరికం కారణంగా ఇంట్లో తగిన సౌకర్యాలు లేకనే పిల్లలను గురుకులానికి పంపించాం. తీరా ఇక్కడికి వచ్చాక కూడా నరకం కనిపిస్తుంటే మా పిల్లల భవిష్యత్తు ఏంటి?' అని తల్లిదండ్రులు దీనంగా ప్రశ్నిస్తున్నారు.
ప్రభుత్వం మానవీయంగా ఆలోచించాలి : కుంచం వెంకట రమణయ్య, వాకాడు
విద్యార్థుల సంఖ్యకు తగిన వసతి ఏర్పాట్లు చేయకుండా పాఠశాలలను విలీనం చేయడం వల్ల పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విద్యార్థి తండ్రి కుంచం వెంకటరమణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఎత్తివేసిన కోట గురుకులంను వెంటనే పున : ప్రారంభించాలని డిమాండ్ చేశారు. మంత్రి నారా లోకేష్ జోక్యం చేసుకొని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ సెంటర్ ను వేరేచోటికి మార్చాలని అభ్యర్థించారు.








కామెంట్‌లు (0)