- ఏళ్ల తరబడి వివాదంలో మందస సరిహద్దు గ్రామాలు
- సిక్కోలు గిరిజనులను వేధిస్తున్న ఒడిశా అధికారులు
ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి : ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల మధ్య నిత్యం నలుగుతున్న పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం కొటియా గ్రామ తరహాలోనే శ్రీకాకుళం జిల్లా మందస మండలం మాణిక్యపట్నం గ్రామంలో ఏళ్ల తరబడి సరిహద్దు వివాదం కొనసాగుతోంది. ఒడిశా ప్రభుత్వం ఇవి తమ గ్రామాలే అంటూ పేచీ పెడుతోంది. తమ తోటే ఉండాలంటూ గిరిజన కుటుంబాలను నిత్యం వేధిస్తోంది. మందస మండలం మాణిక్యపట్నం, గుడ్డికోల, దాలసరి, కొండమేర, మట్టికల్లు గిరిజన గ్రామాల్లోని గిరిజన కుటుంబాలు సరిహద్దు వివాదాల నడుమ నలిగిపోతున్నాయి. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా సాబకోట పంచాయతీ మాణిక్యపట్నం గ్రామ ప్రజలను ఓటు వేయడానికి వెళ్లనీయకుండా ప్రధాన కూడలిలో ఒడిశా పోలీసులు పహారా కాశారు. దీంతో, గిరిజనులు వేరే మార్గంలో వెళ్లి ఓటు వేయాల్సి వచ్చింది. స్థానిక సంస్థల్లో తమకు ఓటు వేయాలంటూ ఎపిలో ప్రధాన రాజకీయ పక్షాలు ఒకవైపు ప్రచారం చేస్తుంటే... ఎపి ఎన్నికల్లో ఓటు వేయొద్దంటూ ఒడిశా ప్రభుత్వం మాణిక్యపట్నం, పుత్తూరు తదితర గిరిజన గ్రామాల్లో ప్రతి ఇంటికీ 50 కేజీల బియ్యం, రూ.250 పంచినట్లు తెలిసింది. ఈ ఏడాది మేలో ఎపి ప్రభుత్వం హౌస్ హోల్డ్ మ్యాప్ సర్వే చేపట్టిన సందర్భంలోనూ ఒడిశా పోలీసులు గ్రామాల్లోకి ప్రవేశించి గిరిజనులను భయపెట్టారు. హౌస్ హోల్డ్ మ్యాప్ సర్వే పూర్తయినట్లు ఇంటి గోడలపై ఎపి ప్రభుత్వ అధికారులు రాసిన రాతలను ఒడిశా అధికారులు బలవంతంగా చెరిపేశారు. గిరిజనులను పోలీస్ స్టేషన్లకు పిలిచి విచారణ చేశారు. 2021 సెప్టెంబరులో మాణిక్యపట్నంలో ఎపి ప్రభుత్వం ఏర్పాటు చేసిన అంగన్‌వాడీ కేంద్రానికి తాళాలు వేయడం, అడ్డుకున్న అంగన్‌వాడీ కార్యకర్త లక్ష్మి భర్త సవర గురునాథ్‌ను ఒడిశా పోలీసులు అరెస్టు చేయడంతో అప్పట్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అదే ఏడాది ఫిబ్రవరిలో ఒడిశాలో పంచాయతీ ఎన్నికల సమయంలో ఒడిశా అధికారులు మాణిక్యపట్నం గ్రామంలోకి వచ్చి పోస్టర్లు అతికించి ప్రచారం చేశారు. ఒడిశా భూ భాగంలో నివసిస్తున్నారంటూ, పంచాయతీ ఎన్నికల్లో ఓట్లేయడానికి రావాలంటూ, లేకుంటే గ్రామాలను ఖాళీ చేసి వెళ్లిపోవాలంటూ హుకుం జారీ చేశారు. ఒడిశా ఎన్నికలకు గంగాబడా పంచాయతీ కుంబగాం అనే గ్రామంలో ఉన్న పోలింగ్ బూత్‌ను తీసుకొచ్చి మాణిక్యపట్నంలో ఏర్పాటు చేశారు. ఒడిశా అధికారులు ఎప్పటికప్పుడు ఎపి సరిహద్దు గ్రామాల్లోకి వచ్చి గిరిజనులను భయబ్రాంతులకు గురిచేయడం సాధారణమైపోయింది.
మాణిక్యపట్నం సరిహద్దు వివాదం ఇదీ...
మందస మండలం సాబకోట పంచాయతీ మాణిక్యపట్నం... ఒడిశాలో మాణిక్యపట్నగా పిలిచే ఈ గ్రామం గజపతి జిల్లా రాయగడ బ్లాక్ సరిహద్దుగా ఉంది. 1936 నాటి రికార్డుల ప్రకారం మద్రాస్ ప్రెసిడెన్సీ ఉత్తర సరిహద్దులోని మహేంద్రగిరుల్లోని ఈ కొండ ప్రాంతం పర్లాఖిముండి, మందస జమిందార్ల ఎస్టేటులో ఉండేది. 1936లో మద్రాస్ ప్రెసిడెన్సీ, ఒడిశాగా పర్లాఖిముండి ఎస్టేట్‌ను విభజించారు. ఈ విభజనలో గంగాబడా, మాణిక్యపట్నం ప్రాంతాలు దట్టమైన అటవీ ప్రాంతాలు కలిగి ఉంది. అక్కడ సవర, కొండులు అత్యధికంగా నివసిస్తున్నారు. శివారు గ్రామాల వాస్తవ భౌగోళిక పరిస్థితులను విస్మరించి సరిగా మ్యాపింగ్ చేయకపోవడంతో ఇరు రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదంగా మారింది.
పరస్పర విరుద్ధమైన రెవెన్యూ మ్యాపులతో సమస్య
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1953లో మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటయ్యాక శ్రీకాకుళం ఆంధ్రలో భాగమైంది. ఇరు రాష్ర్టాల రెవెన్యూ అధికారులు రూపొందించిన పరస్పర విరుద్ధమైన మ్యాపులతో సమస్య జఠిలమైంది. రెవెన్యూ రికార్డుల ప్రకారం తమ భూభాగ పరిధిలోకి వస్తుందటూ ఎపి ప్రభుత్వం వాదిస్తోంది. మాణిక్యపట్నం గంగబడా పంచాయతీ పరిధిలో వస్తుందంటూ ఒడిశా ప్రభుత్వం... తమ రెవెన్యూ, పోలీసు రికార్డులను చూపుతోంది.
రెండు పర్యాయాలు సర్వే చేసినా తేలని సరిహద్దుల నిర్ధారణ
ఇరు రాష్ర్టాల సరిహద్దుల నిర్ధారణలో రెండుసార్లు ఉమ్మడిగా సర్వే చేసినా ఫలితం లేకపోయింది. 1980లో ఒకసారి, 1994లో మరో పర్యాయం ఎపి, ఒడిశా అధికారులు సర్వే చేసినా ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపడంలో విఫలమయ్యారు. సరిహద్దులను తేల్చకుండా ప్రజలను అనిశ్చితిలోనే ఉంచారు.








కామెంట్‌లు (0)