బుధవారం, 08 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

పంటల బీమాకు భూధార్‌ తప్పనిసరి..

3 గంటల క్రితం

bima
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 08, 2026, 06:30 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- కేంద్రం కొత్త నిబంధన

- కౌలు రైతులకు మరింత దూరం

- రాష్ట్రంలో కంపెనీలకే పట్టం

- ఈసారీ ఉచితం లేదు... ఐచ్ఛికమే

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతులకు కొంతైనా ఆసరా కలిగించాల్సిన పంటల బీమా పథకాలకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు ఆంక్షలు అమలు చేసి దూరం చేస్తుండగా, ఈ సంవత్సరం కొత్తగా భూధార్‌‌ను తప్పనిసరి చేసింది. పౌరుల గుర్తింపునకు ఆధార్‌కు మల్లే రైతుల గుర్తింపునకు ‘డిజిటల్‌ అగ్రికల్చర్‌ మిషన్‌ (‌డామ్‌)’లో భాగంగా విశిష్ట గుర్తింపు నెంబర్‌‌తో భూధార్‌ ‌కార్డులు జారీ చేయాలని గతంలో రాష్ట్రాలను ఆదేశించింది. ఎపి ప్రభుత్వం ‘అగ్రిస్టాక్‌ ఫార్మర్స్‌ ‌రిజిస్ర్టీ’ పేరిట రాష్ట్రంలో భూమి సాగు చేస్తున్న రైతులకు ఐ.డి. నెంబర్లు కేటాయించి కార్డులిస్తోంది. ఈ ఐ.డి.లు సొంత భూమి కలిగిన వారికి మాత్రమే ఇస్తున్నారు. కౌలు రైతులకు ఇవ్వరు. ఈ తడవ పంటల బీమా పథకాలకు కేంద్రం నిర్ధేశించినట్లు రైతుల ఐ.డి.లు ఉంటేనే అర్హులని రాష్ట్రప్రభుత్వం సోమవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈసారికి ఆ నిబంధనను మినహాయించాలని కేంద్రాన్ని కోరగా, తమ అభ్యర్ధన ప్రస్తుతం పెండింగ్‌‌లో ఉందని, కేంద్రం నిబంధనను సడలించే వరకు ఫసల్‌, పునర్వ్యస్థీకరించిన వాతావరణ ఆధారిత పథకాల్లో రైతుల నమోదుకు భూధార్‌ ‌నెంబర్‌ ‌తప్పనిసరని నోటిఫికేషన్‌‌లలో స్పష్టం చేసింది.

ఈసారీ అంతే!

సమగ్ర పంటల బీమా తెస్తామన్న టిడిపి కూటమి ప్రభుత్వం తొలి రెండేళ్లూ ఉచిత పంటల బీమా ఎత్తేసి రైతులను తమ వాటా ప్రీమియం చెల్లించాలంది. కేంద్రం పంటల బీమాను రైతులకు ఐచ్ఛికం చేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల (డబుల్‌ ఇంజిన్‌) ‌దెబ్బతో రెండేళ్లల్లో రైతుల నమోదు భారీగా పడిపోయింది. ఆ అనుభవం ఉండి కూడా, రైతులు ఉచిత పంటల బీమా కోరుతున్నా, గత రెండేళ్లల్లో అమలు చేసిన నిబంధనలనే 2026-27 ఖరీఫ్‌, రబీలకు అమలు చేస్తూ రాష్ట్ర సర్కార్‌ నోటిఫికేషన్‌ ఇచ్చింది.

ప్రైవేటుకు పట్టం

ప్రయివేటు ఇన్సూరెన్స్‌ కంపెనీలకే ఈసారి కూడా బీమా పథకాల అమలును ప్రభుత్వం అప్పగించింది. ఫసల్‌ ‌బీమా (దిగుబడి ఆధారిత)ను ఎనిమిది క్లస్టర్ల కింద జిల్లాలను వర్గీకరించి అమలు చేస్తుండగా ఒక క్లస్టర్‌లోని మూడు జిల్లాలకే ప్రభుత్వరంగ సంస్థ అగ్రికల్చర్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎఐసి)కి అప్పగించింది. మిగతా అన్ని క్లస్టర్లనూ ప్రైవేటు కంపెనీలకు కేటాయించింది. వాతావరణ ఆధారిత బీమాను రెండు క్లస్టర్లను, ఎనిమిది జిల్లాలను ఎఐసికి, తతిమ్మా క్లస్టర్లను ప్రైవేటుకు అప్పగించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్