న్యూఢిల్లీ : ఎన్నికల సంబంధిత విధులకు భారత ఎన్నికల సంఘం (ఇసిఐ) ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులను వినియోగించవచ్చని ఢిల్లీ హైకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. అయితే ఆ విధులు వారిపై తీవ్రమైన ఒత్తిడిని కలిగించకూడదని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.కె. ఉపాధ్యాయ, జస్టిస్ తుషార్ రావు గేదెలలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. ఈ సందర్భంగా ఇసిఐ సర్క్యులర్‌లోని కొన్ని నిబంధనలను ధర్మాసనం ప్రశ్నించింది. ఢిల్లీలో నిర్వహిస్తున్న ఎస్‌ఐఆర్ కోసం ప్రభుత్వ, పురపాలక, ప్రభుత్వ-సహాయక పాఠశాలల ఉపాధ్యాయులను బూత్ స్థాయి అధికారులు (బిఎల్‌ఒలు), గణన సిబ్బందిగా నియమించడాన్ని సవాలు చేస్తూ న్యాయవాదులు రాజేష్ కుమార్ గోగ్నార్, అశోక్ అగర్వాల్‌లు పిల్‌ను దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
'ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వర్సెస్ సెయింట్ మేరీస్ స్కూల్' కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా, పాఠశాల పని వేళల్లో ఉపాధ్యాయులను ఎన్నికల సంబంధిత విధుల్లో వినియోగించడం లేదని స్పష్టం చేస్తూ తాము సమగ్ర అఫిడవిట్‌ను దాఖలు చేసినట్లు ఇసిఐ కోర్టుకు తెలిపింది. ఇసిఐ నివేదికను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం ఉపాధ్యాయుల సేవలను వినియోగించుకునే అధికారం ఇసిఐకి ఉందని, అయితే 'పిల్లలకు ఉచిత, నిర్బంధ విద్య చట్టం, 2009'లోని సెక్షన్ 27 నిబంధనలను విస్మరించకూడదని సూచించింది. తరగతి గదుల్లో సుమారు 8గంటల పాటు బోధన చేసిన తర్వాత, ఉపాధ్యాయులపై ఎన్నికల విధులతో అదనపు భారం వేయకూడదని ధర్మాసనం స్పష్టం చేసింది. పాఠశాల వేళల తర్వాత ఎన్నికల విధుల్లో పాల్గొనేటప్పుడు ఉపాధ్యాయులు ఎదుర్కొనే ఒత్తిడిని ఇసిఐ పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించింది. ఎన్నికల సంబంధిత విధులు ఉపాధ్యాయులపై ‘భరించలేనంత’ ఒత్తిడిని కలిగించకుండా ఉండేలా తగిన చర్యలన్నీ తీసుకోవాలని పునరుద్ఘాటించింది.
విచారణ సందర్భంగా, ఉపాధ్యాయులు పాఠశాల సమయం ముగిసిన తర్వాత మాత్రమే ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారని, వారికి సాయంగా వాలంటీర్లను కూడా నియమించారని ఇసిఐ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే, ఇసిఐ నివేదికను పిటిషనర్ తిరస్కరించారు. ఈ నివేదిక వందశాతం అబద్ధమని పేర్కొన్నారు. పిల్ దాఖలు చేసిన తర్వాతే అధికారులు సుమారు పదివేల మంది ఉపాధ్యాయులను తిరిగి పాఠశాలలకు పిలిపిస్తూ సర్క్యులర్లు జారీ చేశారని, ఇది సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఉపాధ్యాయులను గతంలోనే నియమించారనే విషయాన్ని అంగీకరించినట్లేనని పిటిషనర్ వాదించారు. పాఠశాలలకు హాజరు కావాలా లేక ఎన్నికల విధులు నిర్వర్తించాలా అనే విషయంలో ప్రిన్సిపాల్‌లు, ఎన్నికల అధికారుల నుండి ఉపాధ్యాయులకు పరస్పర విరుద్ధమైన సూచనలు వస్తున్నాయని పిటిషనర్ వాదించారు. ఈ ప్రక్రియ కోసం కేటాయించిన బిఎల్‌ఒలు, వాలంటీర్ల సంఖ్యను సూచిస్తూ ఇసిఐ ఒక ఫ్యాక్ట్ షీట్‌ను రికార్డులో ఉంచిందని హైకోర్టు పేర్కొంది. ఇసిఐ నివేదికను వ్యతిరేకించినట్లయితే, అఫిడవిట్‌ను సమర్పించాల్సి వుంటుందని తెలిపింది.







కామెంట్‌లు (0)