గురువారం, 13 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionపొగాకు రైతులకు కేంద్రం మొండిచేయి

1 రోజు క్రితం

TOBACO
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 12, 2026, 05:15 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

  • కేంద్రం వాటాగా రూ.10 బోనస్‌ కోరిన రాష్ట్రం

  • ఒక పంటకిస్తే మిగతా పంటలకూ అడుతారంటూ తిరస్కరణ

  • కిలోకు రూ.10తోనే సరిపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం

  • పొగాకు బోర్డు వద్ద రూ.750 కోట్ల రైతుల డబ్బున్నా ఆదుకొనే చర్యలు శూన్యం

ప్రజాశక్తి- ఒంగోలు బ్యూరో : పొగాకు రైతులకు కేంద్రం మొండిచేయి చూపింది. కొనుగోళ్లు సజావుగా లేక నాలుగు నెలలుగా రైతులు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కొంత ఆలస్యంగానైనా స్పందించి పొగాకు రైతుల మార్కెట్‌‌ సమస్యలపై స్పందించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు పలుసార్లు సమీక్షలు చేశారు. తెరపైకి కొన్ని ప్రతిపాదనలు వచ్చాయి. వాటిని ఆచరణలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రం సాయం ఆశించింది. అందుకు కేంద్రం ససేమిరా అంది. దీంతో, పొగాకు రైతులకు ఇవ్వాల్సిన సాయంలో కోత పెట్టి రాష్ట్ర ప్రభుత్వమే తన నిధులతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

పొగాకు మార్కెట్ సంక్షోభంలో ఉంది. గిట్టుబాటు ధర రాక బ్యారన్‌‌కు రూ.నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల వరకూ నష్టపోతామంటూ రైతులు

ఇప్పటికీ వివిధ రూపాల్లో ఆందోళనలు చేపట్టారు. ఈ నెల పదిన జైల్‌‌భరో కూడా నిర్వహించారు. మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కసరత్తు చేపట్టాయి. వ్యాపారులపై ఎన్ని రకాలుగా ఒత్తిళ్లు చేసినా ధరలు పెరగలేదు. ఆరంభం నుంచీ ఇప్పటి వరకూ గరిష్ట ధర రూ.250కు మించలేదు. కనిష్ట ధరలు రూ.130కు పడిపోయాయి. లోగ్రేడుకు ఎంత ఇచ్చేదీ స్పష్టత లేదు. రాష్ట్ర మంత్రులు ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఆర్థిక, వాణిజ్య శాఖల మంత్రులను కలిశాక అమరావతికి ఉన్నతాధికారులు వచ్చారు.

ముఖ్యమంతి చంద్రబాబుతో భేటీ అయ్యారు. పొగాకు రైతులకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలనే ప్రతిపాదన కేంద్రం నుంచి వచ్చింది. అయితే, రైతుసంఘాలు మాత్రం రూ.వెయ్యి కోట్లు ఇచ్చి కొనుగోళ్లు చేయించాలని కోరుతున్నాయి. సంక్షోభానికి ఇదొక్కటే మార్గమని సూచించాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంత్రులు ఢిల్లీకి వెళ్లిన సమయంలో కిలోకు రూ.20 బోనస్‌‌గా ధర లోటు భర్తీ కింద ఇవ్వాలని కేంద్ర మంత్రులకు సూచించి వచ్చారు. రాష్ట్రం నుంచి రూ.10 ఇస్తామని, కేంద్రం కూడా మరో పది రూపాయలు కలిపి ఇవ్వాలని ప్రతిపాదించారు. కిలోకు రూ.20 ధర లోటు భర్తీ అనేది ప్రతిపాదనల్లోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఈ పది రూపాయలు ఇవ్వడానికి సిద్ధపడ లేదు. పొగాకు రైతులకు ఇస్తే రేపు కాఫీ, పత్తి, మిర్చి, ధాన్యం ఇలా... ఏ పంటకు ధర లేదో ఆ రైతులూ ఇదే తరహాలో అడిగితే ఎలా ఇవ్వగలమంటూ మెలిక పెట్టినట్లు, మీరే ఇచ్చుకోవాలని సలహా ఇచ్చినట్లు సమాచారం.

రూ.94 కోట్లకే పరిమితం కానున్న లోటు భర్తీ!

దీంతో, ధర లోటు భర్తీ రూ.20 నుంచి రూ.10కు తగ్గిపోయింది. పొగాకు రైతులు జాతీయ రహదారి దిగ్బంధనకు పిలుపునిచ్చిన ముందు రోజునే పొగాకు రైతులకు రూ.188 కోట్లు అంటూ జిఒ జారీ అయ్యింది. ఇప్పుడు ఆ కేటాయింపుల్లో సగానికి తగ్గిపోయాయి. రూ.94 కోట్లు రైతులకు అందుతాయి. లోగ్రేడుకు మాత్రమే ఈ ధర లోటు భర్తీ కింద రైతులకు లబ్ధి చేకూరనుంది. కిలోకు పది రూపాయల లెక్కన ఒక క్వింటాలుకు వెయ్యి రూపాయలు రైతులకు దక్కనున్నాయి. కేంద్రం నుంచి ఎటువంటి సాయమూ లేదు. రైతుల నుంచి పెనాల్టీల రూపేణా వసూలు చేసిన రూ.750 కోట్లు పొగాకు బోర్డు వద్ద ఉన్నాయి. వాటిని కొంత కేటాయించాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర మంత్రులు సూచించినా ఫలితం లేకుండాపోయింది. వడ్డీ లేని రుణం రూ.50 వేలు ఇస్తామని కేంద్రం చెప్పింది. రుణం తీసుకునేందుకు రైతులు ఆసక్తిగా లేరు. దీనివల్ల మార్కెట్‌‌కు ఉపయోగం లేదని, ధరలు రావని వారు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకూ కొనుగోలు చేసిన పొగాకుకు లభించిన ధరల వల్ల ఎటూ నష్టం వస్తోందని, ఇక నుంచి ఉన్న పొగాకుకైనా ధరలు రావాలంటే సమాఖ్య, ఎస్టీసీలను రంగంలోకి దించాలని రైతులు కోరుతున్నారు. కేంద్రం నుంచి పొగాకు రైతులను ఆదుకునే దిశగా ఆర్థిక చర్యల్లేవు. వ్యాపారులపై ఒత్తిడికి కూడా ప్రయత్నం కనిపించడం లేదు. దీంతో, ఆందోళనలో పొగాకు రైతులు ఉన్నారు. తమను నష్టాల నుంచి గట్టెక్కించాలని కోరుతున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్