మోడీ ప్రభుత్వంపై యువతలో వ్యతిరికేత పెరుగుతుండటంతో వారికి ఓటుహక్కును కల్పించకుండా ఒక వ్యూహం ప్రకారం అడ్డుకుంటున్నారా? కొత్తగా 18 ఏళ్లు నిండిన యువత (జెన్-జీ) ఓటు హక్కు నమోదు కోసం ప్రతి ఏటా నిర్వహించే 'స్పెషల్ సమ్మరీ రివిజన్' (ఎస్ఎస్ఆర్) నిర్వహణను కొన్ని సంవత్సరాలుగా నిలిపివేయడంతో ఆ అనుమానాలు బలపడుతున్నాయి. 'స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్' (ఎస్ఐఆర్)ను సాకుగా చూపుతూ ఎన్నికల కమిషన్ ఎస్ఎస్ఆర్ను నిలిపివేసింది. 1950 నాటి ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 21 ప్రకారం, దేశంలో ఓటరు జాబితాను నిరంతరం తాజాపరచడం, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడం ఎన్నికల సంఘం ప్రాథమిక రాజ్యాంగ బాధ్యత. సాధారణంగా ప్రతి ఏటా నోటిఫికేషన్ విడుదల చేసి ఎస్ఎస్ఆర్ ద్వారా 18 ఏళ్లు నిండిన యువతను ఓటర్లుగా నమోదు చేస్తారు. 2024 తరువాత ఈ ప్రక్రియను నిలిపివేశారు. దీనిపై ఎన్నికల కమిషనర్లు — సుఖ్బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషి అభ్యంతరం తెలిపారంటూ వచ్చిన వార్తలు కలకలం రేపాయి. సాధారణంగా ప్రతి ఏటా క్రమం తప్పకుండా జరగాల్సిన ఎస్ఎస్ఆర్ నిలిచిపోవడం వెనుక రాజకీయోద్దేశాలు ఉన్నాయనే అనుమానాలున్నాయి. ఎస్ఎస్ఆర్ నిలిచిపోవడం వల్ల దాదాపు 1.5 కోట్ల నుండి 2 కోట్ల మంది 18-19 ఏళ్ల జెన్-జీ యువత కొత్తగా ఓటరు జాబితాలో నమోదు చేసుకోలేకపోయారు. 2025లో బిహార్లో ఎస్ఐఆర్ ప్రారంభమై, అనంతరం ఇతర రాష్ట్రాలకు విస్తరించింది. ఎస్ఐఆర్ ప్రక్రియను కారణంగా చూపుతూ దశాబ్దాలుగా కొనసాగుతున్న వార్షిక ఓటర్ల నమోదు విధానాన్ని నిలిపివేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం అందుబాటులో ఉందనే కారణాన్ని చూపుతూ ఎస్ఎస్ఆర్ అవసరం లేదనే వాదనను ముందుకు తెచ్చారు. అయితే ఆన్లైన్ ద్వారా స్వయంగా తమ పేర్లను ఓటర్ల జాబితాలో నమోదు చేసుకునే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుందని తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్, గోవా రాష్ట్రాల్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎస్ఎస్ఆర్ ద్వారా కొత్త ఓటర్లు చేరకుండా అడ్డుకోవడం, ఎస్ఐఆర్ ద్వారా తమకు వ్యతిరేకంగా ఉండే అవకాశం ఉన్న ఓట్లను తొలగించడం అనే వ్యూహాన్ని అమలు చేస్తున్నారన్నది జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
దేశవ్యాప్తంగా యువ ఓటర్ల గణాంకాలు :
భారత ఎన్నికల సంఘం డేటా ప్రకారం, దేశంలో మొత్తం నమోదు చేసుకున్న ఓటర్ల సంఖ్య దాదాపు 96.8 కోట్లు. వీరిలో మొదటిసారి ఓటర్లు (18-19 ఏళ్లు) దాదాపు 1.86 కోట్లు ఉన్నట్లు ఇసి ప్రకటనల ద్వారా తెలుస్తోంది. అలాగే, 20-29 ఏళ్ల వయస్సు గల యువత దాదాపు 19.47 కోట్లు. మొత్తంగా దేశంలో 18 నుండి 35 ఏళ్ల మధ్య ఉన్న ఓటర్ల సంఖ్య 19 కోట్ల నుండి 20 కోట్ల పైగా వుంది. అంటే వీరి సంఖ్య మొత్తం ఓటర్లలో దాదాపు 20% - 22% వరకు ఉంటుంది. సర్ ప్రక్రియలో భాగంగా ఎన్నికల కమిషన్ తొలగించిన ఓట్లలో దాదాపు 2.1 నుండి 2.5 కోట్ల వరకు యవతే ఉంటుందని అంచనా. ఏ రాజకీయ పక్షమైనా ప్రజామోదంతోనే అధికారంలోకి రావాలి తప్ప, యువత ఓట్లను తొలగించి లేదా వారి నమోదును నిలిపివేసి కాదు.








కామెంట్లు (0)