శనివారం, 14 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నాలుగు కార్పొరేషన్లలో గ్రామాల విలీన వివాదాలకు తెర

9 గంటల క్రితం

నాలుగు కార్పొరేషన్లలో గ్రామాల విలీన వివాదాలకు తెర
- శ్రీకాకుళం, మంగళగిరి-తాడేపల్లి, రాజమహేంద్రవరం, కాకినాడకు ఎన్నికల నగారా
- మొత్తం 260 డివిజన్లలో పోలింగ్ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 13, 2026, 07:50 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

- శ్రీకాకుళం, మంగళగిరి-తాడేపల్లి, రాజమహేంద్రవరం, కాకినాడకు ఎన్నికల నగారా

- మొత్తం 260 డివిజన్లలో పోలింగ్

ప్రజాశక్తి - యంత్రాంగం : ఏళ్ల తరబడి గ్రామాల విలీన వివాదాలు, కోర్టు కేసులతో ఎన్నికలకు దూరంగా ఉన్న రాష్ర్టంలోని నాలుగు కీలక మున్సిపల్ కార్పొరేషన్లకు ఎట్టకేలకు మోక్షం లభించింది. శ్రీకాకుళం, మంగళగిరి-తాడేపల్లి, రాజమహేంద్రవరం, కాకినాడ నగరపాలక సంస్థలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ 12న షెడ్యూల్ విడుదల చేసింది. న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోవడం, వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో ఈ నెల 26న పోలింగ్ నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ఈ నాలుగు కార్పొరేషన్లలో మొత్తం 260 డివిజన్లకు ఎన్నికలు జరగనున్నాయి.

శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ ఎట్టకేలకు ఎన్నికలకు నోచుకోనుంది. నగర ఓటర్లు సుమారు 21 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కార్పొరేషన్ పాలకవర్గాన్ని ఎన్నుకునే అవకాశం దక్కింది. శ్రీకాకుళం కార్పొరేషన్‌లో చివరిసారిగా 2005లో (అప్పటి మున్సిపాలిటీగా ఉన్నప్పుడు 36 వార్డులకు) ఎన్నికలు నిర్వహించగా, 2010లో ఆ పాలకవర్గం పదవీ కాలం ముగిసింది. ఆ తర్వాత కార్పొరేషన్ విస్తరణలో భాగంగా సమీపంలోని ఏడు గ్రామ పంచాయతీలను విలీనం చేశారు. శ్రీకాకుళం రూరల్ మండలంలో పెదపాడు, పాత్రునివలస, ఖాజీపేట, చాపురం, కిల్లిపాలెం, ఎచ్చెర్ల మండలంలో తోటపాలెం, కుశాలపురం గ్రామాలను విలీనం చేశారు. 2005 ఎన్నికల సమయంలో శ్రీకాకుళం మున్సిపాలిటీ జనాభా సుమారు 1.17 లక్షల నుంచి 1.25 లక్షల మధ్య ఉండేది. 2015లో కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ చేసి, సమీపంలోని ఏడు గ్రామ పంచాయతీలను విలీనం చేసిన తర్వాత కార్పొరేషన్ జనాభా 1,47,015 కు (2011 జనాభా లెక్కల ప్రకారం) చేరింది. అప్పుడు 50 డివిజన్లుగా విభజించారు. 2011 తర్వాత గత 15 ఏళ్లలో పెరిగిన సహజ జనాభా, విలీన గ్రామాల్లో పెరిగిన నివాసాలను పరిగణనలోకి తీసుకుని ప్రస్తుతం కార్పొరేషన్ జనాభా సుమారు 1.80 లక్షల నుంచి 2 లక్షల పైచిలుకు చేరినట్లు అంచనా. ఈ గ్రామాల విలీనంతో తొలుత 50 డివిజన్లుగా విభజించినప్పటికీ, కోర్టు కేసులు, ఇతర సాంకేతిక కారణాలతో రెండు దశాబ్దాలకు పైగా ఎన్నికలు నిలిచిపోయాయి. తాజాగా ఎన్నికల నిర్వహణపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించడంతో పాటు, ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన డివిజన్ల సంఖ్యను 50 నుంచి 60కి పెంచుతూ పునర్విభజన, రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేసింది. ఇక్కడ మేయర్ పదవిని బిసి మహిళకు రిజర్వ్ చేశారు.

మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్‌లో తొలి ఎన్నికల సమరం

రాజధాని ప్రాంతంలోని కీలకమైన మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంటిఎంసి) తొలిసారిగా ఎన్నికల సమరానికి సిద్ధమైంది. 2020లో కార్పొరేషన్‌గా ఏర్పడినప్పటి నుంచి కోర్టు కేసులు, విలీన వివాదాలతో దాదాపు ఐదేళ్లపాటు ఎన్నికలకు దూరంగా ఉన్న ఈ నగరపాలక సంస్థకు ఎట్టకేలకు మోక్షం లభించింది. విలీనానికి ముందు 2011 జనాభా లెక్కల ప్రకారం మంగళగిరి (32 వార్డులు), తాడేపల్లి (23 వార్డులు) పట్టణాల జనాభా కలిపి సుమారు 1.72 లక్షలుగా ఉండేది. కార్పొరేషన్ ఏర్పాటులో భాగంగా రెండు మండలాలకు చెందిన 21 గ్రామ పంచాయతీలను ఇందులో విలీనం చేశారు. మంగళగిరి మండలంలో ఆత్మకూరు, నూతక్కి, పెదవడ్లపూడి, రామచంద్రాపురం, ఎర్రబాలెం, కాజ, చినకాకాని, నవులూరు, చినవడ్లపూడి, నిడమర్రు, బేతపూడి, తాడేపల్లి మండలంలో ఉండవల్లి, పెనుమాక, ప్రాతూరు, వడ్డేశ్వరం, ఇప్పటం, మెల్లెంపూడి, చిర్రావూరు, కుంచనపల్లి, కొలనుకొండ, గుండిమెడ గ్రామాలను విలీనం చేశారు.ఈ గ్రామాల విలీనం, గత దశాబ్ద కాలంలో పెరిగిన జనాభాతో కలుపుకుని ప్రస్తుతం కార్పొరేషన్ జనాభా సుమారు 3.20 లక్షల నుంచి 3.50 లక్షలకు పైగా చేరింది. కార్పొరేషన్‌గా ఏర్పడిన కొత్తలో 50 డివిజన్లుగా ప్రతిపాదించినప్పటికీ, పెరిగిన జనాభాకు అనుగుణంగా తాజా పునర్విభజనలో డివిజన్ల సంఖ్యను 62కు ఖరారు చేశారు. గత నెల 30న ఈ 62 డివిజన్లకు రిజర్వేషన్లను అధికారికంగా ప్రకటించారు. ఎంటిఎంసి తొలి మేయర్ పదవిని ఎస్‌టి మహిళకు కేటాయించారు.

రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ లో మొత్తం 11 గ్రామాలను విలీనం చేశారు. హుకుంపేట, శాటిలైట్ సిటీ, పిడింగొయ్యి, బొమ్మూరు, ధవళేశ్వరం, వేమగిరి, కాతేరు, తొర్రేడు, వెంకటనగరం, రాజవోలు, లాలాచెరువు గ్రామాలు విలీనం అయ్యాయి. దీంతో గతంలో కార్పొరేషన్‌లోని వార్డుల సంఖ్య 50 ఉండగా ప్రస్తుతం ఇది 72 డివిజన్లకు పెరిగింది. నగర విస్తీర్ణం 44.5 చదరపు కిలోమీటర్ల నుంచి సుమారు 90 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. విలీనం తర్వాత నగరపాలక సంస్థ మొత్తం జనాభా 5,13,299కి చేరుకుంది. మేయర్‌ పీఠం ఎస్‌సి జనరల్‌కు కేటాయించారు. హైకోర్టులో న్యాయపరమైన వివాదాలు ఇంకా పెండింగ్‌లో ఉండటం వల్ల కాకినాడ కార్పొరేషన్ లో పాత సరిహద్దుల ప్రకారం ఉన్న 66 డివిజన్లకు మాత్రమే ఎన్నికలు నిర్వహిస్తున్నారు.మేయర్ పీఠం బిసి (మహిళ)కు దక్కింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్