సోమవారం, 21 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కెజిబివి టెండర్లలో ‘అవినీతి’

1 గంట క్రితం

kgbv
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 22, 2026, 03:45 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

మార్కెట్‌ కంటే అదనంగా టెండర్లు అప్పగింత

కేంద్రీకృత కొనుగోలు పేరుతో అప్పగింత

కీలక మంత్రి అండతో ప్రక్రియ

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల(కెజిబివి)ల్లో విద్యార్ధులకు అందించే సరుకుల్లో విద్యాశాఖ అధిక ధరకు టెండర్లు అప్పగించింది. మార్కెట్‌‌లో ఉన్న ధరకు, టెండర్లలో ఉన్న ధరకు 35శాతం అదనంగా వ్యత్యాసం ఉన్నా ఇష్టానుసారం టెండర్లను అప్పగించింది. ప్రభుత్వంలో కీలకంగా ఉన్న మంత్రి అండతో సమగ్ర శిక్షలోని ఉన్నతాధికారులు ఈ టెండర్లను కట్టబెట్టినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కెజిబివిల్లో చదువుకునే విద్యార్ధులంతా అనాథలు, పేదలు ఉన్నారు. ఒక్కొ విద్యార్ధికి ప్రతి నెలా రూ.1600ల చొప్పున కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో బడ్జెట్‌ ‌కేటాయించాలి. ఈ బడ్జెట్‌‌లోనే విద్యార్ధులకు అవసరమైన భోజనం, పాలు, గుడ్డు, హార్లిక్స్‌, చిక్కీలు, సాయంత్రం స్నాక్స్‌ ఇవ్వాలి. వీటికోసం సమగ్ర శిక్ష మేలో టెండర్లను పిలిచింది. గతేడాది జిల్లాల వారీగా టెండర్లను పిలవగా ఈ ఏడాది మాత్రం జోన్లు వారీగా టెండర్లు పిలిచింది. టెండర్లలో అవినీతికి ఇక్కడే బీజం పడినట్లు విమర్శలు వస్తున్నాయి. మార్కెట్‌ ‌ధర కంటే అదనంగా కోడ్‌ ‌చేసిన కంపెనీలకు సమగ్రశిక్ష కట్టబెట్టిందనే విమర్శలు పెద్దఎత్తున వస్తున్నాయి. మార్కెట్‌‌లో గోధుమ పిండి కెజీ రూ.66లు ఉండగా టెండర్‌‌లో రూ.70లకు అప్పగించారు.హర్లిక్స్‌ ‌బయట మార్కెట్‌‌లో రూ.499లు ఉంటే టెండర్‌‌లో రూ.542.50లకు, కెజి రూ.390లుగా ఉన్న కారపొడిని రూ.450లకు, లీటర్‌ ‌పాల ధర మార్కెట్‌‌లో రూ.65లకు దొరుకుతుంటే రూ.70లకు, రూ.28లకు దొరికే టాటా సాల్ట్‌‌ను రూ.33.200ల చొప్పున టెండర్లు కట్టబెట్టారు. కోడిగుడ్డు బయట మార్కెట్‌‌లోనే విడిగా తీసుకుంటే రూ.7ల లోపు దొరుకుతుంది. కానీ బల్క్‌‌గా లక్షల్లో తీసుకునే కోడిగుడ్డుకు టెండర్‌‌లో రూ.7.188లకు అప్పగించారు. మరోపక్క మధ్యాహ్నం భోజన పథకంలో ప్రభుత్వ పాఠశాలలకు అందించే కోడిగుడ్డును ఇదే సమగ్ర శిక్ష రూ.6.50ల చొప్పున అందించడం. కానీ ఇక్కడ మాత్రం అదనంగా కట్టబెట్టింది. ఇలా ఒక్కొ వస్తువును గతేడాది కంటే ఈ ఏడాది 30శాతం అదనంగా ధర పెంచి టెండర్లు అప్పగించింది. ‌మొత్తం రూ.178కోట్లకు చెందిన ఈ టెండర్‌లో రూ.25కోట్ల అవినీతి జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ధర పెంచినా నాణ్యత మాత్రం అందడం లేదు. కోడిగుడ్డు బరువు 50 గ్రాములు ఉండాల్సి ఉండగా కాంట్రాక్టర్‌ ‌నుంచి 30 నుంచి 35 గ్రాముల బరువు ఉన్న గుడ్డు మాత్రమే అందుతున్నట్లు కెజిబివి సిబ్బంది చెబుతున్నారు.

టెండర్ల వెనుక కీలక వ్యక్తి, నిబంధనలకు పాతర

ఈ టెండర్లు వెనుక ప్రభుత్వంలోని కీలక వ్యక్తి ప్రమేయం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వంలో నెంబర్‌-2గా ఉన్న ఓ మంత్రి కనుసన్నల్లో ఈ ప్రక్రియ అంతా జరిగినట్లు విమర్శలు వస్తున్నాయి. అతని ప్రమేయం వల్లే అధిక ధరలకు సమగ్ర శిక్ష అధికారులు జోన్లు వారీగా టెండర్లు అప్పగించినట్లు తెలుస్తోంది. జిఎఫ్‌ఆర్‌-2017 నిబంధనల ప్రకారం ప్రభుత్వ కొనుగోళ్లల్లో నిర్దిష్టమైన బ్రాండ్ మాత్రమే కొనాలని నిబంధనలు విధించకూడదు. కానీ కెజిబివి టెండర్లలో ఇడ్లీ రవ్వను శ్రీలలితా, బెల్‌, లోహిత బ్రాండ్‌‌లు, సాల్ట్‌‌లో టాటా, పసుపు ఆశ్వీరాద్‌, ప్రియా బ్రాండ్‌లు, గోధుమ పిండి, ఆశ్వీరాద్‌, అన్నపూర్ణ,జీవన్‌ అనే బ్రాండ్‌‌లు మాత్రమే కొనుగోలు చేయాలని షరతు విధించింది. ప్రతి సరుకులో కూడా తేమశాతానికి ఇంత ఉండాలని నిబంధనలు పొందుపరిచింది. ఉదాహరణకు ఇడ్లీ రవ్వలో తేమశాతం 14శాతం కంటే ఎక్కువ ఉండకూడదని షరతు విధించింది. అలాంటి సమయంలో ప్రత్యేకంగా బ్రాండ్‌‌లు నిబంధన ఎందుకనే ప్రశ్నలు తల్లెతున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్