@సాగు నీటికి తీవ్ర ఇబ్బందులు
@ఆయిల్ ఇంజన్లతో బతికించుకొనే ప్రయత్నం
@బీడుగా 32 వేల ఎకరాలు
@పంటలు ఎండిపోయినా సాగయినట్టేనంటూ వ్యవసాయ శాఖ లెక్కలు!
ప్రజాశక్తి- కృష్ణా ప్రతినిధి : గత జూన్ లో కురిసిన తొలకరి వర్షాలకు కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన రైతులు యలవవర్తి కృష్ణార్జునులు ఎకరం, బోయిన ఏడుకొండలు రెండు ఎకరాలు, యలవర్తి నాగపోతరావు రెండు ఎకరాలు, కృత్తివెన్ను మండలం నీలిపూడికి చెందిన బుద్దన నాగేశ్వరరావు 3.5 ఎకరాలు, చినపాండ్రేకకు చెందిన నల్లగంచు సత్యనారాయణ ఎనిమిది ఎకరాల్లో వెద పద్ధతిలో వరి వేశారు. దుక్కులకు, గట్లు వేయడానికి, విత్తనాలు, కలుపు మందులు, ఎరువులకు ఎకరాకు రూ.12 వేలు చొప్పున ఖర్చయింది. ఎల్‌నినో ప్రభావంతో జులై, ఆగస్ట్ రెండు నెలలూ తీవ్ర వర్షాభావం నెలకొనడం, కాలువ నీరు రాకపోవడంతో వరి ఎండిపోయాయి. గొల్లగూడెంలో 70 ఎకరాలు, నీలిపూడిలో 250 ఎకరాలు, చినపాండ్రేకలో 270 ఎకరాలకుపైగా వెద పద్ధతిలో వేసిన వరి పరిస్థితి కూడా ఈ విధంగానే ఉంది. పెడన, గూడూరు, మచిలీపట్నం మండలాల్లోనూ వేలాది ఎకరాల్లో వెద పద్ధతిలో వేసిన వరి ఎండిపోయింది. పంట సాగుకు పెట్టిన పెట్టుబడి అంతా నష్టపోయామని, అప్పులే మిగిలాయని రైతులు వాపోతున్నారు. ఖరీఫ్ సీజనల్లో కృష్ణా డెల్టాలో కాలువల నీటి ఆధారంగా వరి ప్రధాన పంటగా సాగవుతుంది. జూన్ మూడు, నాలుగు వారాల్లో కురిసిన వర్షాలకు వెద పద్ధతిలో వేసిన వరి మొలకొచ్చింది. జులై ఒకటో తేదీన ప్రకాశం బ్యారేజీ నుంచి సాగు నీరు విడుదలైంది. ప్రజాప్రతినిధులు జలహారతులు ఇచ్చి ఏరువాక సాగించారు. రైతులు సాగుకు ఉపక్రమించారు.
ఆయిల్ ఇంజన్ ద్వారా తడులకు ఎకరాకు వారానికి రూ.800 చొప్పున ఖర్చు
ఖరీఫ్ సీజన్‌లో జిల్లాలో వరి సాధారణ విస్తీర్ణం సాగు 3,55,266 ఎకరాలు. సెప్టెంబర్ 15 నాటికి 1,70,319 మంది రైతులు 3,24,341 ఎకరాల్లో (మొత్తం విస్తీర్ణంలో 91 శాతం) పంటలు సాగు చేసినట్లు ప్రభుత్వం చెబుతున్నా ఇందులో ఎనిమిది వేలకు ఎకరాల్లో పైగా పంటలు పూర్తిగా ఎండిపోయాయి. 32 వేల ఎకరాలకై పైగా భూములు బీడుగా ఉన్నాయి. అవసరం మేరకు సాగు నీటిని విడుదల చేయకపోవడంతో కాలువల సమీపాన ఉన్న పంట పొలాలకూ ఆయిల్ ఇంజన్లతో నీటి తడులు ఇవ్వాల్సి వస్తోంది. ఇందుకోసం రైతులు వారానికి ఒక్కో ఎకరాకు రూ.800 అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది.
గత రెండు నెలలూ తీవ్ర వర్షాభావం
సాధారణ వర్షపాతం జూన్ లో 93.1 మిల్లీమీటర్లకుగానూ 91.6 మిల్లీమీటర్లు, జులైలో 196.5 మిల్లీమీటర్లకుగానూ 78.4 మిల్లీమీటర్లు (-60.1 శాతం లోటు), ఆగస్టులో 193.8 మిల్లీమీటర్లకుగానూ 84.1 మిల్లీమీటర్లు (-56.6 శాతం) వర్షపాతం నమోదైంది.
అరకొరగా సాగు నీరు
కృష్ణా తూర్పు డెల్టాలోని రైవస్ కాలువ సామర్థ్యం 5,200 క్యూసెక్కులకుగానూ రెండు వేల క్యూసెక్కులు, బందరు కాలువ సామర్థ్యం 3,035 క్యూసెక్కులకుగానూ ఎనిమిది వందల క్యూసెక్కులు, కెఇబి కెనాల్ సామర్థ్యం 1,980 క్యూసెక్కులకుగానూ ఎనిమిది వందల క్యూసెక్కులు, ఏలూరు కాలువ సామర్థ్యం 1,643 క్యూసెక్కులకుగానూ ఎనిమిది వందలు చొప్పున విడుదల చేస్తున్నారు. అంటే, ఆయకట్టుకు రోజువారీ 11,858 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాల్సి ఉండగా 4,400 క్యూసెక్కులు మాత్రమే విడుదల చేస్తున్నారు. ఎల్‌నినో పరిస్థితుల్లో వేసవిని తలపించేలా ఉష్ణోగ్రతలు నమోదవ్వడంతో పంటలకు నీటి తడులు అధికంగా ఇవ్వాల్సి వస్తోంది. విడుదల చేస్తున్న కొద్దిపాటి నీరు కాలువల సమీపంలోని భూములకే సరిపోతున్నాయి. కాలువ శివారు ప్రాంతాలకు అందక పంటలు ఎండిపోతున్నాయి.







కామెంట్‌లు (0)