mh ad
గురువారం, 25 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వెనిజులాను వెంటాడుతున్న భూకంపాలు

2 గంటల క్రితం

Venezuela earthquake
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 25, 2026, 10:45 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

వెనిజులా తరచూ భూకంపాల బారిన పడుతున్న దేశాల్లో ఒకటి. గత నాలుగు శతాబ్దాలుగా అక్కడ సంభవించిన భూకంపాలు పదేపదే ప్రాణనష్టం, ఆస్తి నష్టాన్ని మిగిల్చాయి. కొన్ని సందర్భాల్లో మొత్తం పట్టణాలే శిథిలాలుగా మారగా, వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. గురువారం సంభవించిన తాజా జంట భూకంపాలతో మరోసారి వెనిజులా ప్రకృతి విపత్తును ఎదుర్కొంటోంది. గతంలో ఆ దేశాన్ని వణికించిన ప్రధాన భూకంపాల వివరాలు ఇవి.


2026 – కారాబోబో–కారకాస్ జంట భూకంపాలు

2026 జూన్ 24న కేవలం 39 సెకన్ల వ్యవధిలో 7.2, 7.5 తీవ్రతలతో రెండు భూకంపాలు సంభవించాయి. కేంద్రం కారాబోబో రాష్ట్రంలోని మొరాన్ సమీపంలో ఉన్నప్పటికీ, ప్రభావం రాజధాని కారకాస్‌తో పాటు పలు రాష్ట్రాల్లో కనిపించింది. బహుళ అంతస్తుల భవనాలు కూలిపోయాయి. రహదారులు, విద్యుత్, సమాచార వ్యవస్థలకు అంతరాయం ఏర్పడింది. విమానాశ్రయం, మెట్రో, రైల్వే సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ప్రకటించి సహాయక చర్యలు కొనసాగిస్తోంది. మృతులు, గాయపడిన వారి సంఖ్యతో పాటు ఆస్తి నష్టంపై అధికారిక అంచనాలు ఇంకా వెలువడుతున్నాయి.


2018 – సుక్రే తీర ప్రాంత భూకంపం

2018 ఆగస్టు 21న సుక్రే రాష్ట్ర తీర ప్రాంతంలో 7.3 తీవ్రతతో భూకంపం నమోదైంది. ప్రకంపనలు ట్రినిడాడ్ అండ్ టొబాగో, గయానా, కొలంబియా వరకు అనుభవించారు. ఐదుగురు మరణించారు. వందలాది భవనాలు దెబ్బతిన్నాయి. విద్యుత్, టెలికమ్యూనికేషన్ సేవలకు అంతరాయం ఏర్పడింది. తీర ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, నివాస భవనాలకు పగుళ్లు ఏర్పడ్డాయి.



1997 – కారియాకో భూకంపం

1997 జూలై 9న సుక్రే రాష్ట్రంలోని కారియాకో ప్రాంతంలో 6.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. 81 మంది మరణించారు. 683 మంది గాయపడ్డారు. వేలాది ఇళ్లు దెబ్బతిన్నాయి. రహదారులు, వంతెనలు, విద్యుత్ వ్యవస్థలకు నష్టం వాటిల్లింది. వేల కుటుంబాలు తాత్కాలిక శిబిరాల్లో ఆశ్రయం పొందాల్సి వచ్చింది.



1967 – కారకాస్ భూకంపం

1967 జూలై 29న కారకాస్ నగరాన్ని 6.6 తీవ్రతతో భూకంపం కుదిపేసింది. అనేక అపార్ట్‌మెంట్ భవనాలు కూలిపోయాయి. 225 నుంచి 300 మంది వరకు మరణించారు. 1,500 మందికిపైగా గాయపడ్డారు. ఆ కాలపు విలువ ప్రకారం సుమారు ₹43 కోట్ల నుంచి ₹120 కోట్ల వరకు ఆస్తి నష్టం సంభవించినట్లు అంచనా. ఈ ఘటన తర్వాత వెనిజులా ప్రభుత్వం భూకంప నిరోధక నిర్మాణ నిబంధనలను కఠినతరం చేసింది.



1929 – కుమానా భూకంపం

1929 జనవరి 17న కుమానా నగర సమీపంలో 6.9 తీవ్రతతో భూకంపం నమోదైంది. అనంతరం సునామీ అలలు తీరాన్ని తాకాయి. 200 మందికిపైగా మరణించారు. ఓడరేవు, చారిత్రక భవనాలు, వాణిజ్య సముదాయాలు దెబ్బతిన్నాయి. తీర ప్రాంత రవాణా, చేపల వేటకు అంతరాయం ఏర్పడింది.


1900 – మిరాండా తీర ప్రాంత భూకంపం

1900 అక్టోబర్ 29న మిరాండా రాష్ట్ర తీర ప్రాంతంలో 7.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని ప్రభావంతో చిన్నపాటి సునామీ నమోదైంది. 100 మందికిపైగా మరణించారు. తీర ప్రాంత గృహాలు, ఓడరేవులు, రహదారులు దెబ్బతిన్నాయి. కారకాస్‌లోని కొన్ని భవనాలకు కూడా పగుళ్లు ఏర్పడ్డాయి.



1894 – మెరిడా భూకంపం

1894 ఏప్రిల్ 28న మెరిడా ప్రాంతంలో 7.0 తీవ్రతతో భూకంపం నమోదైంది. కొండచరియలు విరిగిపడటంతో అనేక గ్రామాలు దెబ్బతిన్నాయి. సుమారు 350 మంది మరణించారు. వేలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. రహదారులు తెగిపోవడంతో పర్వత ప్రాంతాలు కొన్ని రోజుల పాటు బయటి ప్రపంచంతో సంబంధాలు కోల్పోయాయి.



1875 – కుకుటా సరిహద్దు భూకంపం

1875 మే 18న వెనిజులా–కొలంబియా సరిహద్దులోని కుకుటా ప్రాంతంలో 7.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. సరిహద్దు ప్రాంతంలోని పట్టణాలు, గ్రామాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సుమారు 10 వేల మంది మరణించినట్లు చారిత్రక అంచనాలు చెబుతున్నాయి. వేలాది ఇళ్లు, ప్రభుత్వ భవనాలు, ప్రార్థనా మందిరాలు కూలిపోయాయి. రహదారులు, వంతెనలు దెబ్బతినడంతో సహాయక చర్యలు ఆలస్యమయ్యాయి.


1853 – సుక్రే తీర ప్రాంత భూకంపం

1853 జూలై 15న సుక్రే తీర ప్రాంతంలో 7.5 తీవ్రతతో భూకంపం నమోదైంది. అనంతరం సముద్రంలో ఏర్పడిన సునామీ అలలు తీర గ్రామాలను తాకాయి. తీర ప్రాంత గృహాలు, పడవలు, ఓడరేవులు దెబ్బతిన్నాయి. ప్రాణనష్టం తక్కువగా నమోదైనా ఆస్తి నష్టం గణనీయంగా జరిగింది.


1812 – కారకాస్–వర్గాస్ భూకంపం

1812 మార్చి 26న కారకాస్, లా గువైరా, మెరిడా, బార్క్విసిమెటో ప్రాంతాల్లో 7.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. వెనిజులా చరిత్రలో అత్యధిక ప్రాణనష్టం కలిగించిన భూకంపంగా ఇది నమోదైంది. 15 వేల నుంచి 20 వేల మంది వరకు మరణించినట్లు అంచనాలు ఉన్నాయి. చర్చిలు, ప్రభుత్వ భవనాలు, నివాస ప్రాంతాలు కూలిపోయాయి. పలు పట్టణాలు పూర్తిగా శిథిలాలుగా మారాయి. ఈ విపత్తు దేశ స్వాతంత్ర్య ఉద్యమ కాలంలోని సామాజిక, ఆర్థిక పరిస్థితులపైనా ప్రభావం చూపింది.


1641 – కారకాస్ భూకంపం

1641 జూన్ 11న కారకాస్ నగరంలో 6.5 తీవ్రతతో భూకంపం నమోదైంది. సుమారు 200 మంది మరణించారు. చర్చిలు, ప్రభుత్వ భవనాలు, నివాస గృహాలు దెబ్బతిన్నాయి. అప్పటి నిర్మాణ పద్ధతులు భూకంపాలను తట్టుకునేలా లేకపోవడంతో నగరానికి గణనీయమైన నష్టం జరిగింది. వెనిజులా చరిత్రలో నమోదు అయిన తొలి ప్రధాన భూకంప విపత్తుల్లో ఇది ఒకటిగా పరిగణిస్తారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్