ప్రతి ఏడాది పంట ఇంటికి చేరే వేళ సంక్రాంతి పండగ ఊరంతా జరుపుకుంటారు. దీనికోసం సంవత్సరమంతా ఎదురుచూపులు చూస్తాం. అలాగే అంతర్జాతీయ శాంతి దినోత్సవం కోసం నేడు ప్రపంచమంతా ఎదురుచూసే పరిస్థితి. ఒక్కరోజైనా ప్రపంచమంతా యుద్ధ విరామం, హింసకు దూరం, పరస్పర గౌరవం, మానవతా విలువల గురించి మాట్లాడుకునే రోజు. ప్రపంచానికి కావాల్సింది మరిన్ని ఆయుధాలు కాదు.. మనుషుల మధ్య మరింత విశ్వాసం.. దేశాల మధ్య మరింత స్నేహం.. విభేదాలను హింసతో కాదు.. సంభాషణతో పరిష్కరించుకునే వివేకం.. ప్రతి చిన్నారి భయంలేకుండా నవ్వగలిగే ప్రపంచం.. ప్రతి కుటుంబం ప్రశాంతంగా జీవించగలిగే సమాజం.. సెప్టెంబర్ 21 అంతర్జాతీయ శాంతి దినోత్సవం. కానీ ఈసారి శాంతి దినోత్సవం మరింత గంభీరమైన ప్రశ్నల మధ్య వచ్చింది. ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో యుద్ధాలు, అంతర్యుద్ధాలు, సైనిక ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఆయుధాల కోసం దేశాలు లక్షల కోట్ల డాలర్లు ఖర్చు చేస్తున్నాయి. ఒకవైపు ఐరాస శాంతి కోసం పిలుపునిస్తుంటే, మరోవైపు అగ్రరాజ్యం అమెరికా ఆధిపత్య పోటీ ప్రపంచాన్ని కొత్త ప్రమాదాల వైపు నడిపిస్తోంది. ఈ నేపథ్యంలో అట్టమీది కథ.

2026 అంతర్జాతీయ శాంతి దినోత్సవానికి ఐక్యరాజ్యసమితి ఇచ్చిన నినాదం. ‘‘Invest in Peace - For Everyone, Everywhere, Every Day’’. తెలుగులో చెప్పాలంటే.. ‘‘ప్రతిఒక్కరి కోసం, ప్రతిచోటా, ప్రతిరోజూ శాంతి కోసం సమయం హెచ్చించండి.’’ ఈ నినాదంలోనే నేటి ప్రపంచ సంక్షోభానికి ఒక పరిష్కార సూచన దాగి ఉంది. ఆయుధాలపై కాకుండా శాంతిపై పెట్టుబడి పెట్టాలి. యుద్ధాలపై కాకుండా విద్య, వైద్యం, ఉపాధి, ఆహారం, మానవ వనరులపై పెట్టుబడి పెట్టాలి.
శాంతి అంటే యుద్ధం లేకపోవడమేనా?
శాంతి అంటే కేవలం తుపాకులు మౌనంగా ఉండటం కాదు. బాంబులు పేలకపోవడం మాత్రమే కాదు. ఒక దేశం మరో దేశాన్ని ఆక్రమించకపోవడం మాత్రమే కాదు. శాంతి అంటే భయం లేకుండా జీవించే హక్కు. శాంతి అంటే ఆకలి లేకుండా జీవించే హక్కు. శాంతి అంటే విద్య, వైద్యం పొందే హక్కు. శాంతి అంటే తన భవిష్యత్తును తానే నిర్ణయించుకునే హక్కు. శాంతి అంటే ఒక దేశ సార్వభౌమత్వాన్ని మరో దేశం గౌరవించడం. అందుకే శాంతి రాజకీయాలను కేవలం యుద్ధ వ్యతిరేక నినాదంగా పరిమితం చేయలేం. అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థతోనూ, సామాజిక న్యాయంతోనూ, అంతర్జాతీయ చట్టంతోనూ, దేశాల సార్వభౌమత్వంతోనూ ముడిపడి ఉంది.
1981లో అంకురార్పణ..
ప్రపంచ శాంతికి ఒక ప్రత్యేక రోజును పాటించాలన్న ఆలోచనను ఐక్యరాజ్యసమితి సాధారణ సభ 1981లో ముందుకు తెచ్చింది. 1982లో తొలిసారిగా అంతర్జాతీయ శాంతి దినోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం 2001లో సెప్టెంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా హింస, కాల్పుల విరమణకు అంకితమైన రోజుగా ఏకగ్రీవంగా నిర్ణయించారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 21న ప్రపంచం శాంతి గురించి ఆలోచిస్తోంది. కానీ అసలు ప్రశ్న ఏంటంటే? శాంతి గురించి మాట్లాడటం మాత్రమే సరిపోతుందా? కాదు. శాంతి కోసం వ్యవస్థలు మారాలి. యుద్ధాల కారణాలను ప్రశ్నించాలి. ఆయుధ పోటీని తగ్గించాలి. సైనిక జోక్యాలకు అడ్డుకట్ట వేయాలి. దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించాలి. ఐరాసను బలోపేతం చేయాలి. అప్పుడే శాంతి దినోత్సవం ఒక ఈవెంట్ కాకుండా, ప్రజల జీవితాల్లో మార్పుకు దారితీసే ఉద్యమంగా మారుతుంది.
దేశాల మధ్య ఆయుధాల పోటీ
ప్రపంచం శాంతి గురించి మాట్లాడుతున్న సమయంలో ఆయుధాల కోసం చేస్తున్న ఖర్చు మాత్రం పెరుగుతూనే ఉంది. స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎస్‌ఐపిఆర్‌ఐ) గణాంకాల ప్రకారం 2025లో ప్రపంచ సైనిక వ్యయం సుమారు రూ.275.07 లక్షల కోట్లకు చేరింది. అమెరికా ఒక్కటే సుమారు రూ.91.16 లక్షల కోట్లు సైనిక రంగానికి ఖర్చు చేసింది. ప్రపంచ సైనిక వ్యయంలో ఇది సుమారు 33 శాతం. ఈ ఆధిపత్యాన్ని అడ్డుకోవడానికి అనివార్యంగా గతంలో సోవియట్ రష్యా, నేడు చైనా సైనిక వ్యయం పెంచుకోవలసి వచ్చింది. ప్రస్తుతం చైనా సుమారు రూ.32 లక్షల కోట్లతో రెండో స్థానంలో ఉంది. ఈ సంఖ్యలు కేవలం గణాంకాలు కావు. ప్రపంచ సమాజం తన వనరులను ఎటు మళ్లిస్తోందో చెప్పే అద్దం. ఒకవైపు ప్రపంచంలోని కోట్లాది మందికి సరైన ఆహారం లేదు. అనేక ప్రాంతాల్లో పిల్లలకు పాఠశాలలు లేవు. వైద్యం అందుబాటులో లేదు. ఉపాధి కోసం యువత వలసలు వెళ్తోంది. మరోవైపు బాంబులు, క్షిపణులు, యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు, అణ్వాయుధాల కోసం లక్షల కోట్ల డాలర్లు ఖర్చవుతున్నాయి. అందుకే శాంతి దినోత్సవం అడుగుతున్న ప్రశ్న ఒక్కటే. ప్రపంచానికి నిజంగా అవసరమైనది ఆయుధాలా? లేక మనుషుల జీవితాలా?

సవాలు విసురుతున్న అమెరికా ఆధిపత్యం
రెండో ప్రపంచ యుద్ధం అనంతరం ప్రపంచ రాజకీయాల్లో అమెరికా అపారమైన ఆర్థిక, సైనిక, దౌత్య ప్రభావాన్ని సంపాదించింది. సోవియట్ యూనియన్ పతనంతో ప్రపంచ పోలీసుగా అమెరికా వ్యవహరిస్తోంది. అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, సైనిక కూటములు, డాలర్ ఆధిపత్యం, సాంకేతిక శక్తి, ప్రపంచవ్యాప్త సైనిక స్థావరాలు. ఇవన్నీ అమెరికా ప్రభావాన్ని విస్తరించాయి. అమెరికా తన విదేశాంగ విధానాన్ని ప్రపంచ భద్రత, ప్రజాస్వామ్యం, ఉగ్రవాద వ్యతిరేక పోరాటం వంటి పదాలతో వివరిస్తుంది. అయితే ఆ విధానాల వెనుక భౌగోళిక, ఆర్థిక, వ్యూహాత్మక ప్రయోజనాలున్నాయి. ఇదే కారణంగా ప్రపంచవ్యాప్తంగా ‘‘అమెరికా సామ్రాజ్యవాదం’’ అనే రాజకీయ విమర్శ కూడా బలపడింది. అయితే యుద్ధాలను, సైనిక జోక్యాలను, ఆయుధ వ్యయాలను అమెరికన్లూ కూడా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా ట్రంప్ ఆధిపత్యాన్ని వారు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల ట్రంప్ అహంకారానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ‘నో కింగ్స్’ (రాజులెవరూ లేరు) ఉద్యమం నడిచింది. అంతేకాదు, అక్కడి యువత సోషలిజం వంటి అభ్యుదయ భావాల పట్ల ఆకర్షితులవుతున్నారని పలు నివేదికలు స్పష్టం చేశాయి.
శాంతికి వీటో పేరిట విఘాతం
ప్రపంచ శాంతి దినోత్సవం సందర్భంగా గాజా పరిస్థితిని విస్మరించలేం. గాజాలో కాల్పుల విరమణకు సంబంధించిన ఐరాస భద్రతామండలి తీర్మానాలపై అమెరికా పలుమార్లు వీటో అధికారాన్ని ఉపయోగించింది. 2025 జూన్‌లో తక్షణ, శాశ్వత కాల్పుల విరమణ కోరిన తీర్మానానికి భద్రతామండలిలో 14 దేశాలు అనుకూలంగా ఓటు వేయగా, అమెరికా వ్యతిరేకంగా ఓటు వేసి తీర్మానాన్ని అడ్డుకుంది. 2025 సెప్టెంబర్‌లోనూ మరో కాల్పుల విరమణ తీర్మానాన్ని అమెరికా వీటో చేసింది. ఒక్కటే ఐరాస భద్రతామండలిలో ఒక్క దేశం వీటోతో 14 దేశాల అభిప్రాయాన్ని అడ్డుకోగల వ్యవస్థ ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఎంతవరకు అనుగుణంగా ఉంది? ఈ ప్రశ్న చాలాకాలంగా ప్రపంచ దేశాలను వెంటాడుతోంది. ఐరాసను బలోపేతం చేయాలంటే భద్రతామండలి సంస్కరణలతో పాటు, వీటో అధికారాన్ని కూడా ప్రజాస్వామ్య కోణంలో పునఃపరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
సార్వభౌమత్వంపై ప్రశ్న
2026, జనవరి 3న అమెరికా వెనిజులా అధ్యక్షుడు మదురోతో పాటు ఆయన భార్యను కిడ్నాప్ చేసిన తర్వాత ఐరాస తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇజ్రాయిల్ మినహా ప్రపంచ దేశాలు ముక్త కంఠంతో వ్యతిరేకించాయి. ఐరాస ప్రధాన కార్యదర్శి అంతర్జాతీయ చట్టం, ఐరాస చార్టర్‌లోని దేశాల భౌగోళిక సమగ్రత, రాజకీయ స్వాతంత్ర్యానికి సంబంధించిన నిబంధనలను గుర్తుచేశారు. ఇది ఒక కీలకమైన అంతర్జాతీయ ప్రశ్నను ముందుకు తెచ్చింది. ఒక దేశంలో రాజకీయ పరిస్థితులు నచ్చకపోతే మరో దేశానికి సైనికంగా జోక్యం చేసుకునే హక్కు ఉందా? ఐరాస చార్టర్ దేశాల సార్వభౌమత్వాన్ని, భౌగోళిక సమగ్రతను గౌరవించాలని చెబుతుంది. అంతర్జాతీయ వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ప్రపంచ ప్రజలు కోరుకుంటున్నారు. అందుకే వెనిజులా పరిణామాలు ఒక దేశానికి సంబంధించిన సమస్యగా మాత్రమే కాకుండా, అంతర్జాతీయ వ్యవస్థలో బలమైన దేశాలకు ఉన్న అధికార పరిమితులపై చర్చగా మారాయి.
ఐరాసాను లెక్కచేయకపోతే..
ఐరాస ఏర్పడిన ప్రధాన ఉద్దేశాల్లో ఒకటి భవిష్యత్ తరాలను యుద్ధాల నుంచి కాపాడటం. దేశాల మధ్య వివాదాలు యుద్ధాలుగా మారకుండా చర్చలకు వేదిక కల్పించడం. కానీ ఐరాస నిర్ణయాలను శక్తివంతమైన దేశాలు తమకు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే గౌరవిస్తే, దాని విశ్వసనీయత దెబ్బతింటుంది. ఒక దేశం చేసిన దాడిని అంతర్జాతీయ చట్ట ఉల్లంఘనగా పరిగణించి, అదే చర్యను మరో శక్తివంతమైన దేశం చేసినప్పుడు మౌనం వహిస్తే, ప్రపంచ ప్రజల్లో న్యాయంపై నమ్మకం సన్నగిల్లుతుంది. అంతర్జాతీయ చట్టం చిన్న దేశాలకు మాత్రమేనా? ఐరాస చార్టర్ బలహీన దేశాలకే వర్తిస్తుందా? అగ్రరాజ్యానికి ప్రత్యేక మినహాయింపులున్నాయా? ఇలాంటి ప్రశ్నలకు ప్రపంచ వ్యవస్థ సమాధానం చెప్పాల్సిందే.

బహుళధ్రువ ప్రపంచం వైపుగా..
ఇదే సమయంలో చైనా, క్యూబా, వియత్నాం, లావోస్, ఉత్తర కొరియా వంటి సోషలిస్టు రాజకీయ వ్యవస్థలున్న దేశాల్లోనూ కీలకమైన మార్పులు జరుగుతున్నాయి. అయితే వీటన్నింటినీ ఒకే విధమైన రాజకీయ ఆర్థిక నమూనాలో ఉన్న దేశాలుగా చూడటం సరైంది కాదు. ప్రతి దేశానికీ ప్రత్యేక చరిత్ర, పాలనా నిర్మాణం, ఆర్థిక విధానం, అంతర్జాతీయ సంబంధాలున్నాయి. కానీ ఒక ఉమ్మడి అంశం మాత్రం కనిపిస్తోంది. అమెరికా ఆధిపత్యానికి పూర్తిగా లోబడకుండా తమదైన జాతీయ అభివృద్ధి మార్గాలను అన్వేషించడం. ఇది ప్రపంచ రాజకీయాల్లో బహుళధృవ వ్యవస్థపై చర్చను పెంచుతోంది.
చైనా - సాంకేతిక శక్తిగా ఎదుగుతూ: చైనా సోషలిస్టు రాజకీయ వ్యవస్థను కొనసాగిస్తూనే మార్కెట్ వ్యవస్థలోని కొన్ని అంశాలను తన ఆర్థిక అభివృద్ధికి వినియోగించుకుంది. విద్యుత్ వాహనాలు, బ్యాటరీలు, సౌర విద్యుత్, కృత్రిమ మేధస్సు, టెలికమ్యూనికేషన్లు, అంతరిక్ష పరిశోధన వంటి రంగాల్లో నేడు ప్రపంచ శక్తిగా ఎదుగుతోంది. అమెరికా, చైనా మధ్య చిప్‌ల తయారీ, కృత్రిమ మేధస్సు (ఎఐ) వంటి వ్యూహాత్మక సాంకేతిక పరిజ్ఞానాల్లో సాగుతున్న పోటీ భవిష్యత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయనుంది. అయితే దేశీయ వినియోగాన్ని పెంచడం, ఆస్తి రంగంలో ఒత్తిళ్లను తగ్గించడం వంటి సవాళ్లు చైనాకూ ఉన్నాయి. ఈ నమూనాలోని విజయాలు, సమస్యలు రెండింటినీ అధ్యయనం చేయాల్సి ఉంటుంది.
క్యూబా - ఆంక్షల మధ్య సంస్కరణలు: దశాబ్దాలుగా అమెరికా ఆర్థిక ఆంక్షలను ఎదుర్కొంటున్న క్యూబా, ఆర్థిక సంక్షోభం, ఇంధన కొరత, విద్యుత్ సమస్యలతో పోరాడుతోంది. అయినప్పటికీ తన సామాజిక రంగాల్లో సాధించిన పురోగతిని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తోంది. 2026లో క్యూబా ప్రభుత్వం విదేశీ పెట్టుబడులు, పర్యాటకం, ప్రైవేటు వ్యాపారాలకు సంబంధించిన పలు సంస్కరణలను చేపట్టింది. సోషలిస్టు వ్యవస్థను కాపాడుకునేందుకు ప్రపంచ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా
నూతన సంస్కరణలకు నాంది పలికింది. అమెరికా ఆంక్షలతో చిన్న పిల్లలకు మందులు కూడా అందటం లేదని, ఆహార కొరత వేధిస్తుందని, సామాన్య ప్రజల జీవనం అస్తవ్యస్తంగా మారిపోతుందని క్యూబన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా అహంకారాన్ని ప్రపంచ దేశాలు వ్యతిరేకించాలని వారు కోరుతున్నారు.
వియత్నాం - ప్రపంచంతో సంబంధాలు : వియత్నాం సోషలిస్టు రాజకీయ వ్యవస్థను కొనసాగిస్తూనే ప్రపంచ మార్కెట్‌తో బలమైన అనుసంధానం సాధించింది. అమెరికాతోనూ, చైనాతోనూ, రష్యాతోనూ, యూరప్‌తోనూ సంబంధాలను కొనసాగిస్తోంది. ఒక దేశంతన రాజకీయ వ్యవస్థను కొనసాగించుకుంటూనే ప్రపంచంలోని విభిన్న శక్తి కేంద్రాలతో సంబంధాలు పెట్టుకోవచ్చన్నదే ఇక్కడి దౌత్యపాఠం. ఎవరితో స్నేహం చేయాలో ఒక అగ్రరాజ్యం నిర్ణయించే పరిస్థితి కాకుండా, ప్రతి దేశం తన జాతీయ ప్రయోజనాల ఆధారంగా విదేశాంగ విధానాన్ని నిర్ణయించుకునే ప్రపంచం అవసరమన్న వాదనకు వియత్నాం విధానం బలం ఇస్తోంది.

లావోస్ - చిన్న దేశం, పెద్ద సవాళ్లు: ఆర్థికంగా చిన్న దేశమైన లావోస్ రుణభారం, ద్రవ్యోల్బణం, విదేశీ మారక సమస్యలు, ఇంధన ధరలు వంటి సవాళ్లను ఎదుర్కొంటోంది. ప్రపంచ ఆర్థికవ్యవస్థలో చిన్న దేశాలకు స్వతంత్ర అభివృద్ధి మార్గాన్ని కొనసాగించడం అంత సులభం కాదన్నదే దీని అనుభవం చెప్పే వాస్తవం. విదేశీ పెట్టుబడులు, రుణాలు అవసరమే. కానీ అదే రుణభారం దేశ భవిష్యత్ ఆర్థిక విధానాలపై ఒత్తిడి తెస్తుంది. అందువల్ల ప్రపంచ శాంతి చర్చలో ఆర్థిక న్యాయం కూడా భాగం కావాలి.
ఉత్తర కొరియా - భద్రతా రాజకీయాల మధ్య: అణ్వాయుధాలు, క్షిపణి కార్యక్రమాలు, అమెరికా, దక్షిణ కొరియా, జపాన్ భద్రతా సహకారం కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతను కొనసాగిస్తున్నాయి. ఇటీవలి కాలంలో చైనా, రష్యాలతో ఉత్తర కొరియా సంబంధాలు కూడా బలపడుతున్నాయి.
ఇక్కడ ఒక విషయం స్పష్టం చేయాలి. అమెరికాకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి దేశాన్ని సోషలిస్టు దేశంగా పరిగణించలేం. ప్రస్తుతం రష్యా అమెరికా ఆధిపత్యాన్ని సవాలు చేస్తుంది. అమెరికా- ఇజ్రాయిల్ యుద్ధోన్మాదాన్ని ఇరాన్ ప్రతిఘటించింది. చైనా, క్యూబా, వియత్నాం, లావోస్, ఉత్తర కొరియాలు ఒకే విదేశాంగ విధానంతో పనిచేస్తున్నాయని చెప్పలేం. కానీ, ప్రపంచ వ్యవస్థలో ఒకే కేంద్రీకృత ఆధిపత్యానికి ప్రత్యామ్నాయ కేంద్రాలు పెరుగుతున్నాయి అన్నది మాత్రం గమనించాల్సిన పరిణామం.
శాంతి, సామరస్యం, సౌభ్రాతృత్వం
ఐరాస 2026 శాంతి దినోత్సవం ఇచ్చిన సందేశాన్ని కేవలం నినాదంగా కాకుండా విధానంగా మార్చుకోవాలి. ఆయుధాల బడ్జెట్‌లో కొంతభాగాన్ని విద్యకు మళ్లించాలి. యుద్ధ వ్యయాన్ని ఆరోగ్యానికి మళ్లించాలి. సైనిక పోటీకి బదులుగా వాతావరణ పరిరక్షణకు పెట్టుబడి పెట్టాలి. ఆహార భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి. యువతకు ఉపాధి కల్పించాలి. ప్రపంచ పేదరికాన్ని తగ్గించాలి. ప్రపంచంలోని ఒక చిన్నారికి పాఠశాల అందించడం, ఒక యుద్ధ విమానం తయారుచేయడం కంటే మానవాళికి ఎక్కువ భద్రతను ఇవ్వవచ్చు. ఒక గ్రామానికి ఆసుపత్రి నిర్మించడం, ఒక క్షిపణి కొనుగోలు చేయడం కంటే ప్రజల భవిష్యత్తుకు ఎక్కువ విలువైనది. ఒక దేశానికి నీటి వనరు కల్పించడం, ఒక కొత్త సైనిక స్థావరం నిర్మించడం కంటే మానవత్వానికి ఉపయోగకరం. ఇదే శాంతిలో పెట్టుబడి. అలాగే, శాంతి రాజకీయాలు ప్రభుత్వాలతోనే ఆగిపోవు. పాఠశాలల్లో పిల్లలకు ఇతరులను గౌరవించడం నేర్పాలి. కులం, మతం, భాష, ప్రాంతం ఆధారంగా ద్వేషాన్ని పెంచే భావజాలానికి బదులుగా సహజీవనాన్ని నేర్పాలి. వివాదాన్ని కొట్టుకోవడం ద్వారా కాదు, చర్చ ద్వారా పరిష్కరించుకోవడం నేర్పాలి. భిన్నాభిప్రాయం శత్రుత్వం కాదని చెప్పాలి. ప్రజాస్వామ్యంలో విభిన్న అభిప్రాయాలు సహజమని పిల్లలకు అర్థమయ్యేలా చేయాలి. ఎందుకంటే శాంతి సంస్కృతి తరగతి గదిలోనే మొదలవుతుంది.
బహుళధ్రువ ప్రపంచం: కొత్త ఆశా?
బహుళధృవ ప్రపంచం అంటే ప్రపంచంలో అనేక శక్తి కేంద్రాలు ఉండటం. అమెరికా ఒక శక్తి కేంద్రం. చైనా మరో శక్తి కేంద్రం. రష్యా తన సైనిక, ఇంధన ప్రభావంతో మరో శక్తి. భారత స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరిస్తుంది. యూరప్ తన ఆర్థిక, రాజకీయ ప్రభావాన్ని కొనసాగిస్తోంది. గ్లోబల్ సౌత్ దేశాలు తమ సామూహిక ప్రయోజనాలను ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ మార్పు ఒక అవకాశాన్ని కూడా అందిస్తోంది. అగ్ర దేశం పేరుతో ప్రపంచానికి ఆదేశాలు ఇచ్చే పరిస్థితి తగ్గవచ్చు. చిన్న, అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఎక్కువ దౌత్య అవకాశాలు రావచ్చు. వాణిజ్య సంబంధాలు విస్తరించవచ్చు. ప్రత్యామ్నాయ ఆర్థిక సంస్థలు, ప్రాంతీయ సహకార వ్యవస్థలు బలపడవచ్చు. అయితే, బహుళధృవ ప్రపంచం ఆటోమేటిక్‌గా శాంతి ప్రపంచం కాదు. శక్తి కేంద్రాలు పెరిగితే వాటి మధ్య పోటీ కూడా పెరగవచ్చు. ఆయుధ పోటీ మరింత తీవ్రమయ్యే ప్రమాదమూ లేకపోలేదు. అందుకే బహుళధృవ ప్రపంచం బహుళ సైనిక శిబిరాల ప్రపంచంగా కాకుండా, బహుళ సహకార కేంద్రాల ప్రపంచంగా మారాల్సిన అవసరం ఉంది.
ఆర్థిక విధానాలూ ఆయుధాలే..
నేటి ప్రపంచంలో యుద్ధం అంటే కేవలం సైనిక దాడి కాదు. ఆర్థిక ఆంక్షలు కూడా ఒక దేశంపై తీవ్రమైన ప్రభావం చూపగలవు. బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి వాణిజ్యం వరకు, ఇంధనం నుంచి సాంకేతిక పరిజ్ఞానం వరకు ఒక దేశాన్ని అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ నుంచి వేరుచేసే చర్యలు ప్రజల జీవితాలపై ప్రభావం చూపుతాయి. ఆంక్షలు ఎవరిపై విధించినా, వాటి దుష్ప్రభావం సామాన్య ప్రజలపై పడే ప్రమాదం ఉంది. అందుకే అంతర్జాతీయ శాంతి చర్చలో ఆర్థిక ఆంక్షల మానవతా ప్రభావం కూడా చర్చల్లో రావాలి.

ప్రజలే బాధితులు...
యుద్ధాన్ని నిర్ణయించేది సాధారణ ప్రజలు కాదు. రాజకీయ నాయకులు నిర్ణయాలు తీసుకుంటారు. సైనికాధికారులు వ్యూహాలు రచిస్తారు. ఆయుధ కంపెనీలు లాభాలు పొందుతాయి. కానీ యుద్ధం జరిగితే సర్వం కోల్పోయేది సాధారణ కుటుంబాలే. బాంబు పడేది సాధారణ మనిషి ఇంటిపైనే. పాఠశాలలు మూసుకుపోతాయి. పిల్లల చదువులు నిలిచిపోతాయి. ఆసుపత్రులు సామాన్యులతో నిండిపోతాయి. అలాగే, ఉపాధి కోల్పోయేది కార్మికులే. వలస వెళ్లేది రైతు కుటుంబాలే. అందుకే యుద్ధ వ్యతిరేక పోరాటం అంటే కేవలం రాజకీయ నినాదం కాదు. అది ప్రజల జీవన హక్కుల కోసం పోరాటం.
ప్రపంచ ప్రజల ముందున్న ఎంపిక
నేటి ప్రపంచం ఒక కీలక మలుపులో ఉంది. ఒకవైపు యుద్ధాలు, మరోవైపు శాంతి పిలుపులు. ఒకవైపు ఆయుధ వ్యయం, మరోవైపు ఆకలి. ఒకవైపు సైనిక కూటములు, మరోవైపు దౌత్య చర్చలు. ఒకవైపు ఆంక్షలు, మరోవైపు అంతర్జాతీయ సహకారం. ఒకవైపు ఆధిపత్య రాజకీయాలు, మరోవైపు సమానత్వం కోసం ప్రపంచ దేశాల ఆకాంక్ష. ఈ వైరుధ్యాల మధ్యే 2026 అంతర్జాతీయ శాంతి దినోత్సవం మన ముందుకు వచ్చింది. శాంతి గంట మోగాలి. బాంబుల మోత కాదు. శాంతి కోసం స్టేట్‌మెంట్‌లు ఇవ్వడం సులభం. కానీ యుద్ధానికి దారితీసే విధానాలను మార్చడం కష్టం. అయినా మార్పు తప్పదు. ప్రపంచ దేశాలు పరస్పరం చర్చించాలి. సైనిక ఉద్రిక్తతలను తగ్గించాలి. ఆయుధ నియంత్రణపై ఒప్పందాలను బలోపేతం చేయాలి. అణ్వాయుధాల ముప్పును తగ్గించాలి. సార్వభౌమత్వాన్ని గౌరవించాలి. ఆర్థిక ఆంక్షల మానవతా ప్రభావాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఐరాసను బలోపేతం చేయాలి. ప్రపంచ నాయకులు నిజంగా శాంతిలో పెట్టుబడి పెట్టాలంటే, ముందుగా యుద్ధం ద్వారా లాభపడే రాజకీయ, ఆర్థికవ్యవస్థలను ప్రశ్నించాలి. ఎందుకంటే యుద్ధం కొందరికి వ్యాపారం కావచ్చు. కానీ ప్రజలకు అది విషాదం.
శాంతియుత ప్రపంచం సాధ్యమే..
శాంతి ఒక కల కాదు. ప్రపంచ చరిత్రలో యుద్ధాలు జరిగినట్లే, శాంతి ఒప్పందాలు కూడా జరిగాయి. శత్రువులుగా ఉన్న దేశాలు స్నేహితులుగా మారిన సందర్భాలు ఉన్నాయి. ఎన్నో యుద్ధాలు చర్చలతో ముగిశాయి. ఎన్నో ప్రజా ఉద్యమాలు యుద్ధాలను అడ్డుకున్నాయి. అందుకే నేటి ప్రపంచం కూడా మరో మార్గాన్ని ఎంచుకోవచ్చు. అది ఆధిపత్య, ఆయుధాల, ఆంక్షల మార్గం కాదు. అది సైనిక జోక్యాల మార్గం అంతకన్నా కాదు. అది శాంతి మార్గం. సహకార మార్గం. సమానత్వ మార్గం. ప్రజల అభివృద్ధి మార్గం. అందుకే, 2026 అంతర్జాతీయ శాంతి దినోత్సవం ఇచ్చే సందేశం అందుకే మరింత లోతైనది.
ప్రపంచాన్ని యుద్ధాల నుంచి రక్షించేది మరిన్ని క్షిపణులు కాదు - ప్రజల మధ్య విశ్వాసం.
దేశాలను సురక్షితంగా ఉంచేది మరిన్ని సైనిక స్థావరాలు కాదు - పరస్పర గౌరవం.
భవిష్యత్తును కాపాడేది మరిన్ని అణ్వాయుధాలు కాదు- శాంతి, సహకారం, మానవత్వం.
ప్రపంచ ప్రజల చేతుల్లో ఇకపై ఆయుధాల బదులు పుస్తకాలు ఉండాలి. భయాల బదులు భరోసా ఉండాలి. సరిహద్దుల్లో కాల్పుల బదులు చర్చలు ఉండాలి. దేశాల మధ్య ఆధిపత్యం బదులు సమానత్వం ఉండాలి. అప్పుడే సెప్టెంబర్ 21 క్యాలెండర్‌లోని ఒక రోజు కాకుండా, ప్రపంచ ప్రజల భవిష్యత్తుకు ఒక కొత్త ప్రమాణంగా నిలుస్తుంది.
-వై.రాము
9490098544








కామెంట్‌లు (0)