ఆదివారం, 20 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionమెదడు ఆరోగ్యంపై మేల్కొలుపు అవసరం

1 గంట క్రితం

alzeemers 9.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 20, 2026, 07:08 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

సెప్టెంబర్‌ 21 ప్రపంచ అల్జీమర్స్‌ దినోత్సవం

జ్ఞాపకాలు మనిషి జీవితానికి చిరునామాలు. నిన్నటి అనుభవాలకు అవి సాక్ష్యాలు.. నేటి నిర్ణయాలకు అవి ఆధారాలు.. రేపటి జీవితానికి అవి మార్గదర్శకాలు.. అలాంటి జ్ఞాపకాలు క్రమంగా మసకబారితే.. మనిషి మాత్రమే కాదు.. అతని చుట్టూ ఉన్న కుటుంబ ప్రపంచం కూడా మారిపోతుంది. అందుకే మతిమరుపును నిర్లక్ష్యం చేయకండి.. ముందే గుర్తించండి.. ముందే వైద్య సలహా తీసుకోండి. ముందే సంరక్షణకు సిద్ధమవ్వండి.

ప్రపంచ వ్యాప్తంగా అల్జీమర్స్ (Alzheimer's Disease), చిత్తవైకల్యం (Dementia) కేసులు అత్యంత వేగంగా విస్తరిస్తున్న తీవ్రమైన ఆరోగ్య సమస్య. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ), అల్జీమర్స్‌ డిసీజ్‌ ఇంటర్నేషనల్‌ (ఎడిఐ) నివేదికల ప్రకారం ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 5.5 కోట్లకు పైగా ప్రజలు చిత్తవైకల్యంతో జీవిస్తున్నారు. ఇందులో 60 నుంచి 70 శాతం వరకు కేసులు కేవలం అల్జీమర్స్ వ్యాధికి సంబంధించినవే ఉన్నాయని డబ్ల్యుహెచ్‌ఒ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు ఒక కోటి కొత్త కేసులు నమోదవుతున్నాయి. అంటే ప్రతి 3.2 సెకన్లకు ఒక కొత్త వ్యక్తి ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా వృద్ధుల జనాభా పెరుగుతుండటం వల్ల ఈ వ్యాధి తీవ్రత రాబోయే రోజుల్లో మరింత పెరగనుంది. 2030 నాటికి 7.8 కోట్లు, 2050 నాటికి ఈ సంఖ్య భారీగా పెరిగి 13.9 కోట్లు దాటొచ్చునని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.

alzeermers 10.jpg

జ్ఞాపకశక్తి ప్రాధాన్యం..

మనిషి జీవితంలో జ్ఞాపకశక్తికి ఉన్న ప్రాధాన్యం అపారమైనది. చిన్నతనంలో నేర్చుకున్న అక్షరాల నుంచి జీవితంలో ఎదురైన అనుభవాల వరకు ప్రతిదీ మన మెదడులో జ్ఞాపకంగా నిలుస్తుంది. మన కుటుంబాన్ని, స్నేహితులను, మనకు ఇష్టమైన వ్యక్తులను గుర్తించేది కూడా జ్ఞాపకశక్తే. అలాంటి జ్ఞాపకశక్తి క్రమంగా తగ్గిపోతే ఆ వ్యక్తి రోజువారీ జీవితంపైనే కాకుండా అతనికోసం కష్టపడుతున్నఒకుటుంబసభ్యులపైనా తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఇలాంటి సమయంలో కుటుంబమంతా అండగా నిలవాలి. అందరూ తనకు అండగా నిలుస్తున్నారనే భావనలోకి వస్తే కొంతమేర ఒత్తిడి తగ్గుతుంది. కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి ఉండటానికి ప్రయత్నిస్తారు. తద్వారా ఒంటరి తనం తగ్గుతుంది.

అల్జీమర్స్‌ వ్యాధి అలాంటి పరిస్థితుల్లో ఒకటి. అల్జీమర్స్‌ను చాలామంది సాధారణ మతిమరుపుగా భావిస్తారు. వయసు పెరిగినప్పుడు ఎవరికైనా కొన్ని విషయాలు మర్చిపోవడం సహజమేనని అనుకుంటారు. నిజానికి వయసుతో కొన్ని స్వల్ప జ్ఞాపక మార్పులు రావొచ్చు. అయితే ఒక వ్యక్తి తరచూ ఇటీవల జరిగిన విషయాలను మర్చిపోవడం, ఒకే ప్రశ్నను పదేపదే అడగడం, వస్తువులను ఎక్కడ పెట్టారో గుర్తించ లేకపోవడం, పరిచితమైన వ్యక్తుల పేర్లు గుర్తుకు రాకపోవడం, గతంలో సులభంగా చేసిన పనులు చేయడంలో ఇబ్బందిపడటం వంటి మార్పులు కనిపిస్తే, దాన్ని సాధారణ వృద్ధాప్య లక్షణంగా భావించకూడదు. అల్జీమర్స్‌ అనేది కేవలం మతిమరుపు కాదు. మెదడు పనితీరు క్రమంగా దెబ్బతింటూ జ్ఞాపకశక్తి, ఆలోచన, భాష, నిర్ణయం తీసుకునే సామర్థ్యం, రోజువారీ కార్యకలాపాలను నిర్వహించే సామర్థ్యం ప్రభావితమయ్యే వ్యాధి. డిమెన్షియాకు అనేక కారణాలు ఉన్నప్పటికీ అల్జీమర్స్‌ వాటిలో అత్యంత సాధారణ కారణాల్లో ఒకటి.

నిర్ధారణ ముఖ్యం..

ప్రపంచ అల్జీమర్స్‌ దినోత్సవం 2026 ప్రధాన సందేశం ‘The Earlier You Know, The More You Can Do: A Dementia Diagnosis Matters.’ అంటే ‘ఎంత త్వరగా తెలుసుకుంటే.. అంత ఎక్కువ చేయగలం. డిమెన్షియా నిర్ధారణ ముఖ్యం.’ ఈ సందేశం వెనుక ఎంతో ముఖ్యమైన వైద్యపరమైన, మానవీయమైన ఉద్దేశం ఉంది. వ్యాధిని ముందుగానే గుర్తించడం అంటే భయపడటం కాదు. పరిస్థితిని అర్థం చేసుకోవడం. అందుబాటులో ఉన్న వైద్య సేవలు, చికిత్స, సంరక్షణ గురించి తెలుసుకోవడం. భవిష్యత్తు అవసరాలకు కుటుంబాన్ని సిద్ధం చేసుకోవడం. బాధిత వ్యక్తి తనకు సంబంధించిన నిర్ణయాల్లో సాధ్యమైనంత వరకు భాగస్వామి కావడానికి అవకాశం కల్పించడం. ముందస్తు నిర్ధారణతో కుటుంబ సభ్యులు వ్యాధి స్వభావాన్ని అర్థం చేసుకుని, తగిన వైద్య సలహా తీసుకోవచ్చు. వ్యక్తి జీవనశైలిలో అవసరమైన మార్పులు చేయొచ్చు. భవిష్యత్తు సంరక్షణ, ఆర్థిక వ్యవహారాలు, కుటుంబ బాధ్యతల గురించి ముందుగానే ప్రణాళిక చేసుకోవచ్చు. తగిన సందర్భాల్లో కొత్త చికిత్సలు, పరిశోధనలు, క్లినికల్‌ ట్రయల్స్‌ గురించి కూడా వైద్యులతో చర్చించే అవకాశం ఉంటుంది. అందువల్ల నిర్ధారణ అనేది ముగింపు కాదు.. తదుపరి ప్రయాణానికి ప్రారంభం.

గుర్తుపెట్టుకోకపోవడమే సంకేతం..

అల్జీమర్స్‌ ప్రారంభ దశలో అత్యంత సాధారణంగా కనిపించే లక్షణం.. ఇటీవలి విషయాలను గుర్తుపెట్టుకోలేకపోవడం. ఉదాహరణకు కొద్దిసేపటి క్రితం జరిగిన సంభాషణను మర్చిపోవడం, ఇటీవల జరిగిన సంఘటనను గుర్తు చేసుకోలేకపోవడం, ఒకే విషయాన్ని పదేపదే అడగడం వంటివి కనిపించొచ్చు. వస్తువులను తరచూ తప్పు ప్రదేశాల్లో పెట్టడం కూడా ఒక సంకేతం కావొచ్చు. తాళాలు, కళ్లద్దాలు, ఫోన్‌ వంటి వస్తువులను ఎక్కడ పెట్టారో గుర్తించలేకపోవడం సాధారణంగా అందరికీ అప్పుడప్పుడు జరుగుతుంది. కానీ అది తరచుగా జరిగి, వస్తువులను అసాధారణ ప్రదేశాల్లో పెట్టి, మళ్లీ వాటిని వెతకడం అలవాటుగా మారితే వైద్య సలహా అవసరం. పరిచితమైన ప్రదేశాల్లో దారి తప్పడం, సమయం, తేదీ విషయంలో గందరగోళం.. డబ్బు లెక్కలు నిర్వహించడంలో ఇబ్బంది, బిల్లులు చెల్లించడం మర్చిపోవడం, వంట చేయడం వంటి గతంలో అలవాటైన పనుల్లో ఇబ్బందులు ఎదురవడమూ గమనించాల్సిన అంశాలే. మాట్లాడేటప్పుడు సరైన పదం గుర్తుకు రాకపోవడం, ఒక విషయాన్ని చెప్పడానికి ఎక్కువ సమయం తీసుకోవడం, సంభాషణను కొనసాగించలేకపోవడం వంటి భాషాపరమైన మార్పులూ కొంతమందిలో కనిపించొచ్చు. కొన్ని సందర్భాల్లో వ్యక్తిత్వంలో మార్పులు వస్తాయి. అనుమానం, చిరాకు, ఆందోళన, నిరాసక్తత లేదా సామాజిక కార్యకలాపాల నుంచి దూరంగా ఉండటం వంటి మార్పులు కనిపించొచ్చు. అయితే ఈ లక్షణాల్లో ఒకటి లేదా రెండు కనిపించినంత మాత్రాన అల్జీమర్స్‌ అని నిర్ణయించకూడదు. మతిమరుపుకు ఇతర వైద్య కారణాలూ ఉండొచ్చు. అందుకే నిపుణుడైన వైద్యుడి సలహా తీసుకోవడం అవసరం.

alzeemers 7.jpg

గుర్తుంచుకోవాల్సినవి

  • అల్జీమర్స్‌ ఒక మెదడు సంబంధిత ప్రగతిశీల వ్యాధి.

  • సాధారణ వయోభార మతిమరుపుతో దీన్ని సమానంగా చూడకూడదు.

  • డిమెన్షియాకు అనేక కారణాలు ఉంటాయి.

  • ముందస్తు నిర్ధారణతో చికిత్స, సంరక్షణ, భవిష్యత్తు ప్రణాళికకు అవకాశం పెరుగుతుంది.

  • బాధితుడి గౌరవాన్ని కాపాడుతూ కుటుంబ సహకారం అందించడం అత్యంత ముఖ్యం.

  • ప్రతి మతిమరుపూ అల్జీమర్స్‌ కాదు. సరైన వైద్య మూల్యాంకనం అవసరం.

కుటుంబమే తొలి అండ

అల్జీమర్స్‌ బాధితుడి జీవితంలో కుటుంబ సభ్యుల పాత్ర అత్యంత కీలకం. జ్ఞాపకశక్తి తగ్గుతున్న వ్యక్తి ఒక విషయాన్ని పదేపదే అడిగినప్పుడు ‘ఇప్పుడే చెప్పాను కదా!’ అంటూ కోపగించుకోవడం సహజమైన ప్రతిస్పందనగా కనిపించొచ్చు. కానీ అలాంటి స్పందన బాధితుడిలో భయం, ఆందోళనను పెంచుతుంది. వారితో ఓపికగా మాట్లాడాలి.

  • చిన్నపిల్లల్లా చూడకూడదు.

  • వారి గౌరవాన్ని కాపాడాలి.

  • సాధ్యమైనంత వరకు రోజువారీ నిర్ణయాల్లో వారిని భాగస్వామ్యం చేయాలి.

  • ఇంట్లో జారిపడే ప్రమాదాలు లేకుండా చూడాలి.

  • అవసరమైన మందులను సురక్షితంగా నిర్వహించాలి.

  • బయటకు వెళ్లే సందర్భాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

  • రోజువారీ కార్యక్రమాలకు ఒక క్రమాన్ని ఏర్పరచడం.

  • పాత ఫొటోలు చూడటం, ఇష్టమైన పాటలు వినడం.

  • కుటుంబ సభ్యులతో మాట్లాడటం వంటి పరిచితమైన కార్యకలాపాలు వారికి భావోద్వేగ భరోసాను కల్గించొచ్చు.

మందులు మాత్రమే కాదు..

అల్జీమర్స్‌ చికిత్సలో మందులకు ఒక స్థానం ఉన్నప్పటికీ సంరక్షణా అంతే ముఖ్యం. వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని బట్టి వైద్యులు తగిన చికిత్సను సూచిస్తారు. కొన్ని చికిత్సలు, లక్షణాల నిర్వహణకు ఉపయోగపడొచ్చు. కొన్ని కొత్త చికిత్సా విధానాలూ అభివృద్ధి చెందుతున్నాయి. అయితే మందులతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలి అవసరం.

  • క్రమం తప్పకుండా శారీరకంగా చురుకుగా ఉండటం.

  • సమతుల ఆహారం తీసుకోవడం.

  • తగినంత నిద్రపోవడం.

  • రక్తపోటు, మధుమేహం నియంత్రణలో ఉంచడం.

  • పొగతాగడం మానేయడం వంటి చర్యలు మొత్తం మెదడు ఆరోగ్యానికి తోడ్పడతాయి.

  • మెదడును చురుకుగా ఉంచేవి...

  • పుస్తకాలు చదవడం.

  • కొత్త విషయాలు నేర్చుకోవడం.

2026 ప్రపంచ అల్జీమర్స్‌ దినోత్సవం

మనకు చెబుతున్న సందేశం ఒక్కటే

‘ఎంత త్వరగా తెలుసుకుంటే.. అంత ఎక్కువ చేయగలం’ముందే తెలుసుకుందాం..ముందే స్పందిద్దాం.. ముందే సంరక్షణకు సిద్ధమవుదాం..జ్ఞాపకాలు మసకబారినా.. మానవత్వం మాత్రం మసకబారనివ్వకండి.

డాక్టర్_ మీనా కుమారి మేడికొండ.jpg

డాక్టర్‌ మీనాకుమారి మేడికొండ
మానసిక వైద్య నిపుణురాలు

9030503555

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్