ఖరీఫ్‌కు సాగునీటి కష్టాలు
రెండు సార్లు నాట్లు
పెరిగిన పెట్టుబడి వ్యయం
ప్రజాశక్తి– కృష్ణా ప్రతినిధి : ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనడం, కాలువల ద్వారా సకాలంలో సాగునీరు అందకపోవడంతో కృష్ణా జిల్లాలోని పలు గ్రామాల్లో వేలాది ఎకరాల పంట భూములు బీళ్లుగా మారాయి. మరికొన్ని ప్రాంతాల్లో వర్షాభావం కారణంగా ఒకటికి రెండుసార్లు పంట విత్తడం, నాట్లు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో, ఖరీఫ్ సాగులో రైతుల పెట్టుబడులు భారీగా పెరిగాయి. పంటను కాపాడుకునేందుకు కొందరు రైతులు తమకు చేతనైన మార్గాల్లో భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు. వేసవి ఎండలను తలపించే ఉష్ణోగ్రతలను సైతం లెక్కచేయకుండా ఇంజన్లతో భూగర్భ జలాలను తోడి పైపుల ద్వారా పంట పొలాలకు అందిస్తూ శ్రమిస్తున్నారు.
పెట్టుబడి పెట్టినా... పంట దక్కలేదు
బందరు మండలం హుస్సేన్‌పాలెంకు చెందిన సిహెచ్.పెద వీరరాఘవయ్య తన 6.50 ఎకరాల్లో వరి వెదజల్లారు. ఇందుకోసం నాలుగుసార్లు దుక్కి దున్నారు. వర్షాలకు మొలకెత్తిన పంటలో కలుపు నివారణకు రెండుసార్లు కలుపు మందు పిచికారీ చేశారు. దుక్కికి రూ.3,600, విత్తనాలకు రూ.1,050, కలుపు మందుకు రూ.1,200, గట్లు వేయడానికి రూ.వెయ్యి, విత్తనాలు, మందులు పిచికారీకి రూ.వెయ్యి చొప్పున మొత్తం ఎకరాకు రూ.7,850 ఖర్చు చేశారు. 6.50 ఎకరాలకు మొత్తం రూ.51,025 పెట్టుబడి పెట్టారు. ఇదే గ్రామానికి చెందిన తులాబందుల రమేష్ ఎనిమిది ఎకరాల్లో వెద పద్ధతిలో వరి సాగు చేశారు. వర్షాభావంతో తొలిసారి సాగు చేసిన వరి ఎండిపోవడంతో ఇంజన్ల ద్వారా నీటిని తోడి మూడు ఎకరాల్లో రెండోసారి నాట్లు వేశారు. నారు కొనుగోలు, దమ్ములు, నాట్లు, గట్లు ఏర్పాటు తదితర పనులకు ఎకరాకు అదనంగా రూ.14 వేల వరకు ఖర్చు చేశారు. వెద పద్ధతిలో సాగుకు రూ.62,800, రెండోసారి నాట్లకు రూ.42 వేల చొప్పున మొత్తం రూ.1,04,800 వరకు ఖర్చు చేశారు. ఇంజన్లకు సైతం నీరు అందకపోవడంతో వెద పద్ధతిలో సాగు చేసిన వరితోపాటు రెండోసారి నాట్లు వేసిన పంట కూడా ఎండిపోయిందని రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాభావంతో పాటు రామరాజు కాలువ ద్వారా సాగునీరు అందకపోవడంతో హుస్సేన్‌పాలెం, చిట్టిపాలెం, అరిసేపల్లి గ్రామాల్లో వందలాది ఎకరాల్లో వరి పంట ఎండిపోయింది. దీంతో, పంట భూములు బీళ్లుగా మారాయి.
రెండోసారి నాట్లు.. రెట్టింపు ఖర్చులు
బంటుమిల్లి మండలం ములపర్రు గ్రామానికి చెందిన గౌరిశెట్టి వెంకట్రామ్, ఎలవర్తి శ్రీనివాసరావు, భట్రాజు శ్రీనివాసరావు తదితర రైతులు తొలుత వెద పద్ధతిలో సాగు చేసిన వరి ఎండిపోవడంతో రెండోసారి నాట్లు వేశారు. దీంతో పెట్టుబడి రెట్టింపవుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బంటుమిల్లి, బందరు మండలాలతో పాటు కోడూరు, నాగాయలంక, కృత్తివెన్ను మండలాల్లోనూ పరిస్థితి ఇదే విధంగా ఉందని రైతులు చెబుతున్నారు. ముఖ్యంగా కాలువల శివారు ప్రాంతాల్లో సాగునీరు అందక పొలాలు బీడుబారాయి. కాలువలకు పూర్తి స్థాయిలో నీరు విడుదల కాకపోవడంతో ఆయిల్ ఇంజన్ల ద్వారా నీటిని తోడి పంటలు సాగు చేసేందుకు ఎకరాకు రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు అదనంగా ఖర్చవుతోందని రైతులు వాపోతున్నారు.








కామెంట్‌లు (0)