శనివారం, 08 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎన్నాళ్లకెన్నాళ్లకు...!

5 గంటల క్రితం

rss chief
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 08, 2026, 05:30 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

- వి.రాంభూపాల్‌


ఢిల్లీ విద్యార్థి ఉద్యమం ఎట్టకేలకు దేశ పాలకులను, వారి గురువులను కదిలించింది. అణచివేతను విద్యార్థులు ఎదుర్కొన్నతీరు, మధ్యతరగతి కుటుంబాల నుండి వ్యక్తమయిన నిరసన ప్రధానమంత్రితో పాటు ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేతను మాట్లాడేలా చేసింది. వివిధ ప్రశ్నాపత్రాలు వరుసగా లీక్ అవుతుండడం, వాటిని నివారించడంలో, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి యువతరంలో అసంతృప్తిని పెంచింది. జంతర్ మంతర్‌లో ప్రారంభమైన విద్యార్థి ఉద్యమాన్ని చర్చల ద్వారా, సరైన చర్యల ద్వారా పరిష్కరించాల్సిన ప్రభుత్వం తమ సహజసిద్ధమైన వైఖరితో ఎదుర్కోవాలని చూసింది. దీంతో విద్యార్థుల్లో ఆగ్రహం పెరిగి దేశవ్యాపిత ఉద్యమంగా మారింది. ఈతరం ఓటర్లలో మోడీ, షా లపై పెరిగిన వ్యతిరేకతను పాలకులు ఆలస్యంగా గుర్తించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాతోనే ఈ వ్యతిరేకతను సంతృప్తి పరచలేమన్న తత్వం బోధపడినట్లు ఉంది. అందుకే స్వయాన ప్రధాని, ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత రంగంలోకి దిగారు. ప్రధాని విడుదల చేసిన మూడు నిమిషాల వీడియో ఎన్నడూ లేనివిధంగా ట్రోలింగ్‌కు గురైంది. ఇప్పుడు ఏకంగా ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్ భగవత్ జెన్ జెడ్ ఉద్యమాన్ని పూర్తిగా బలపరచి, విద్యార్ధులను కీర్తిస్తున్నారు. ఉద్యమం సాగిన ఆ రెండు నెలల్లో ఎందుకు మౌనంగా వున్నారనే విద్యార్థుల ప్రశ్నలో న్యాయం ఉంది. సినిమా డైలాగ్‌ను గుర్తుతెచ్చేలా... లాఠీ దెబ్బలకు తలలు, కాళ్లు, చేతులు విరిగినప్పుడు ‘లేవని నోళ్ళన్నీ ఇప్పుడు లేస్తున్నాయేం?’ అన్నట్లు వీరంతా మొసలితో పోటీపడి కన్నీరు కార్చడం నిజమైన పశ్చాత్తాపమా? లేక ఓటర్లను మభ్యపెట్టే మరో మాయాజాలమా? అనే సందేహం కలగడం సహజం.

తనను విమర్శించిన పిల్లలను క్షమించాను అని ప్రధాని చెప్పిన కొద్ది రోజులకే ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత తాను ‘జెన్ జెడ్‌ను గుడ్డిగా నమ్ముతానని’ ప్రకటించారు. అంతేకాదు, నిరసనల్లో పాల్గొంటున్న విద్యార్థులను దేశద్రోహులుగా ముద్ర వేయకూడదన్నారు. గురువారం ముంబైలో జరిగిన ఇండియాస్ ఇంటర్నేషనల్ మూవ్‌‌మెం టు యునైటెడ్ నేషన్స్ 15వ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ, ‘అధికారాన్ని ప్రశ్నించినందుకు యువతరాన్ని విమర్శించడం కాకుండా, వారి అభిప్రాయాలను సంభాషణల ద్వారా వినాలని’ భగవత్ ‘మంచిమాట’ అన్నారు. వినాల్సింది పాలకులే కదా! పరీక్ష పత్రం లీకేజితో ఆత్మహత్య చేసుకున్న 22 మంది విద్యార్థుల కుటుంబాల్లో ఒక్కరినైనా కేంద్ర మంత్రులు పరామర్శించలేదు. మా గోడు వినమనే కదా విద్యార్థులు నెలరోజులకు పైగా అన్ని రకాల నిందలు, నిర్బంధాలను ఎదుర్కొని శాంతియుతంగా ఆందోళన చేసింది. ఇప్పుడు చెబుతున్న ఈ సూక్తిముక్తావళి అప్పుడే తమ పాలక శిష్యబృందానికి చెప్పివుంటే యువరక్తం ఇంతగా రోడ్లపై చిందివుండేది కాదు, ఇన్ని తలలు, కాళ్లు, చేతులు విరిగేవి కావు కదా?

‘నేను ఒక విషయం స్పష్టం చేయాలనుకుంటున్నాను, ఒకవేళ జెన్ జెడ్ ఏదైనా ఆందోళనలో పాల్గొంటే, వారు దేశద్రోహులు కారు. వారు మనవారే; వారు మన తర్వాతి తరం అని గుర్తించి, గౌరవించుకోవాలి’ అన్న భగవత్ ఈ తరాన్ని కీర్తించారు. మరి ఈ పిల్లలమీద నిందలు వేసింది ఎవరు? దేశద్రోహులు, విచ్ఛిన్నకరశక్తులు, విదేశీ నిధులతో నడుస్తున్న ఉద్యమం అని నిత్యం విమర్శలు చేసింది కాషాయ బృందమేకదా! ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక ‘ఆర్గనైజర్‌’లో విద్యార్థి నేతల ఫోటోలు వేసి వీరిని ఎందుకు అరెస్టు చేయలేదంటూ పోలీసులను ప్రశ్నించిన విషయం భగవత్‌కు తెలియదు అనుకోగలమా? ‘విద్యార్థులను కాల్చిపారేయండని’ అన్న కేరళ బిజెపి సోషల్ మీడియా బాధ్యుడు టి.జి మోహన్‌దాస్‌ను, ఉద్యమం ప్రారంభం నుండి నిందలు, నీచ ప్రచారాలను చేసిన బిజెపి ఎంపీ, ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రోను నాగపూర్ గురువులు ఆపివుంటే ఎంత బాగుండేది! ఢిల్లీ విద్యార్థులను సంఘ విద్రోహ శక్తులు అంటూ విమర్శించిన కేంద్రమంత్రి బండి సంజయ్ ని, జంతర్ మంతర్ నిరసనల్లో పంక్చర్లు వేసేవారు, తాళాలు చేసేవారే ఎక్కువ అన్న బిజెపి మాజీ ఎంపీ రమేష్ బిధూరి ని, అమెరికాలో అయితే కాల్చిచంపేసేవారు అన్న తెలంగాణ బిజెపి ఎంపీ విశ్వేశ్వరరెడ్డి ని భగవత్ ఒక్కమాట కూడా మాట్లాడకపోవడం ఏ ధర్మం? ఆర్‌ఎస్‌ఎస్‌ ఆశిస్సులు లేకుండానే వీరంతా అటు ప్రభుత్వంలో, ఇటు బిజెపిలో వివిధ హోదాల్లో వున్నారని అనుకోగలమా?

‘నేటి యువతరం, అంటే జెన్ జెడ్ మరియు జెన్ ఆల్ఫా, ప్రస్తుత తరం కంటే ఎక్కువ నిజాయితీపరులని నేను నమ్ముతున్నాను ఈ తరానికి దేశం పట్ల నిజాయితీ, దేశభక్తి స్ఫూర్తి, సేవ పట్ల నిబద్ధత ఉండాలి’ అని భగవత్ చెప్పారు. విద్యార్థులు నిజాయితీపరులు కాబట్టే ప్రశ్నాపత్రాల లీకేజికి పాలకులు బాధ్యత వహించాలని కోరారు. వారిలో దేశభక్తి వుంది కాబట్టే జాతీయ జెండాను చేతబూని ఉద్యమించారు. పోలీసులు విచక్షణారహితంగా కొడుతున్నా, టియర్ గ్యాస్ పేలుస్తున్నా, పెల్లెట్స్ శరీరంలోకి దూసుకుపోతున్నా చెక్కుచెదరకుండా నిలిచి నాటి జాతీయోద్యమ వీరోచిత ఘట్టాలను స్ఫురణకు తెచ్చారు. ‘సేవ’ అనేది ముసుగుకాదు, నిస్వార్థమైనదని చాటేలా గాయపడిన విద్యార్థులకు వైద్య సేవలు అందించిన మెడికోలు, అలసిన బిడ్డలకు రొట్టెలు, అన్నం, నీళ్లు ఇచ్చిన దాతలు, నిరసన ప్రాంగణాన్ని రోజూ శుభ్రం చేసిన శ్రామికులు, ఇలా ఎందరో సేవ పరమార్థాన్ని అచరించి చూపారు కదా!. ‘పోలీసులకు, నిరసనకారులకు మధ్య జరిగిన ఘర్షణ వెనుక ఉన్న పూర్తి వాస్తవాలు తనకు తెలియవన్న’ ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్ మాట దెబ్బలుతిన్న విద్యార్థులకు ఉపశమనం కలిగిస్తుందా?

విద్యార్థుల పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరించిన వైఖరి మధ్యతరగతి కుటుంబాల్లో వ్యతిరేకతను పెంచింది. మోడీకి అత్యధికంగా ఓటు వేసిన యువతరం ఓటర్ల నుండే ఈ వ్యతిరేకత రావడాన్ని గుర్తించిన బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లు వారి సహజసిద్ధమైన మాటల గారడీ ద్వారా నష్టనివారణ చర్యలు మొదలుపెట్టాయి. కానీ వారితో జతకట్టి అడ్డంగా విద్యార్థి ఉద్యమాన్ని కించపరచిన మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లెక్కతప్పిందా లేదా దారేతప్పిందా?

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్