కమ్యూనిస్టుల పోరాటాలతోనే వెలుగులోకి
30 ఏళ్లుగా నాన్చిన పాలక పార్టీలు
అప్పుడు ప్రాజెక్టు కోసం... ఇప్పుడు నిర్వాసితుల కోసం*సిపిఎం అలుపెరగని పోరాటాలు
ప్రజాశక్తి ఒంగోలుబ్యూరో, మార్కాపురం విలేకరి : వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభానికి రంగం సిద్ధం కావడంతో ఆ ఘనతను తమ ఖాతాలో వేసుకునేందుకు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం, ప్రతిపక్ష వైసిపిలు పోటీ పడుతున్నాయి. ఈ నెల 31న ప్రారంభానికి ముహర్తం ఖరారు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ దిశలో విస్తృతంగా ప్రచారం ప్రారంభించారు. దీనికి తగ్గట్లే వైసిపి కూడా తమ హయంలోనే ప్రాజెక్టు పూర్తయిందని చెప్పుకుంటోంది. ఈ పోటాపోటీ ప్రచారం ఎలా ఉన్నప్పటికీ, స్థానిక ప్రజలు మాత్రం ఆ ప్రాజెక్టు సాధన కోసం జరిగిన పోరాటాలను, చేసిన త్యాగాలను గుర్తు చేసుకుంటున్నారు. పోరాడి సాధించిన తరువాత కూడా నిధులు కేటాయించకుండా నీరుగార్చిన తీరును చెప్పుకుంటున్నారు. నిజానికి ఈ ప్రాజెక్టు తొలుత ప్రస్తావనలో కూడా లేదు. 1960 ప్రాంతంలో ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలో ఉన్న సీనియర్ నేతలు అప్పట్లో నల్లమల ప్రాంతంలో అధ్యయనం చేసి కృష్ణా జలాలను పశ్చిమ ప్రాంతానికి తరలించడం ద్వారా ఈ ప్రాంత సాగు, తాగునీటి అవసరాలను తీర్చవచ్చని పాలకుల ముందుంచారు. మార్కాపురం సమీపంలో కొండల్లో రిజర్వాయర్ ఏర్పాటు, సొరంగాల ద్వారా కృష్ణా నది మిగులు జలాల తరలింపు వంటి అంశాలను ఆనాడే కమ్యూనిస్టు నేతలు అధ్యయనం చేసి, గణాంకాలతో సహా అసెంబ్లీలోనూ ప్రస్తావించారు. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలో ఉన్న పూలసుబ్బయ్య, సూరా పాపిరెడ్డి, గోను పాపిరెడ్డి వంటి నేతలు ఈ ప్రాజెక్టు సాథనకోసం విస్తృతంగా ప్రచారం చేశారు. రైతులతోనూ సమావేశాలు పెట్టారు. ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు.
మార్కాపురం ఎమ్మెల్యేగా ఉన్న పూలసుబ్బయ్య అసెంబ్లీలోనూ ప్రస్తావించారు. కనిగిరి నుంచి గెలిచిన సూరా పాపిరెడ్డి కూడా దీనిపై ప్రభుత్వానికి లేఖలు రాశారు.
1980 తర్వాత దీనికోసం సిపిఐ, సిపిఎంలు ప్రాజెక్టు సాధనకోసం పోరాటాలు చేశారు. ఎన్‌టి రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న 1984లో జీవో నెంబర్ 306 ను అప్పటి భారత కమ్యూనిస్టు పార్టీ ఎమ్మెల్యే పూల సుబ్బయ్య పేరుతో విడుదల చేశారు. కంభం కేంద్రంగా వెలిగొండ ప్రాజెక్టు కోసం ఇన్వెస్ట్ గేషన్ డివిజన్ ను ఏర్పాటు చేయడం జరిగింది. పూల సుబ్బయ్య నల్లమల్ల ప్రాంతంలోని గిరిజనులను వెంటబెట్టుకుని కొల్లంవాగు నుండి కంభం చెరువు వరకు నల్లమల అటవీ ప్రాంతాన్ని జల్లెడ పట్టేలా పర్యటించారు. అల్లం వాగు నుండి కంభం చెరువు, సహజ సిద్ధంగా ఏర్పడిన కొండలను కలుపుకొని మూడు గ్యాప్ లను సిమెంట్ కాంక్రీట్ తో పూర్చగలిగితే వెలిగొండ ప్రాజెక్టు రూపాంతరం చెందుతుందని సమగ్ర నివేదికను అందచేశారు. దీంతో పశ్చిమ ప్రకాశం ప్రాంతానికి వెలుగొండ ప్రాజెక్టు అంశం కీలక ఎజండాగా మారింది. ఎన్నికల్లో అంశమైంది. నాగార్జున సాగర్ కాలువలు పశ్చిమ ప్రాంతానికి దూరంగా ఉన్నాయి. దీంతో మార్కాపురం డివిజన్ అంతా కరువు పీడిత ప్రాంతంగానే ఉంది.కనిగిరి ప్రాంతంలో ఫ్లోరిన్‌పీడిత సమస్యకూ వెలుగొండ జలాలే ప్రత్యామ్నాయంగా తేల్చారు. వెలిగొండతోనే కనిగిరి ప్రాంతంలో కరువు పోతుందని కమ్యూనిస్టుపార్టీలు గట్టిగా చెప్పి పోరాటాలు సాగించాయి. ఫలితంగా రూ. 684 కోట్ల అంచనాతో వెలిగొండ ప్రాజెక్టుకు తొలుత బీజం పడింది.
1996లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న ప్రస్తుత సిఎం చంద్రబాబు ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. అప్పట్లో రూ.950 కోట్లు దీని నిర్మాణ వ్యయంగా తేల్చారు. 9 ఏళ్ల పాటు అధికారంలో కొనసాగినప్పటికీ పనులు చేపట్టలేదు. దీంతో 1996 మళ్లీ రైతు సంఘాలు, కమ్యూనిస్టు పార్టీలు ఆందోళనలకు దిగాయి. ఆ సమయంలో ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ ప్రాజెక్టును సందర్శించారు. శిలా ఫలకం చుట్టూ మొక్కలు నాటారు. తాను అధికారంలోకి వచ్చాక దీని పనులు చేపడతామని హామీ ఇచ్చారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడంతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన వెలిగొండ పనులను వేగవంతం చేశారు. ఆయన హయంలోనే సుంకేసుల, గొట్టిపడియ, కాకర్ల గ్యాపులు పూర్తి చేశారు. రెండు సొరంగాలకు శంకుస్థాపన చేసి పనులు వేగవంతం చేశారు. ఆయన ఆకస్మిక మరణం తరువాత పనులు మళ్లీ మందగించాయి. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ కూడా దీన్ని పూర్తి చేయలేకపోయారు. ఎన్నికలకు ముందు నిర్వాసితులను పట్టించుకోకుండా సొరంగాలను ప్రారంభించారు. మళ్లీ అధికారంలోకి వచ్చాక ప్యాకేజీలు ఇస్తామని చెప్పినప్పటికీ ఆ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలైన సంగతి తెలిసిందే.
సిపిఎం నిరంతర పోరాటాలు
వెలి గొండకు శంకుస్థాపన చేశాక దీన్ని పూర్తి చేయాలని 1996 నుంచి సిపిఎం పెద్ద ఎత్తున పోరాటాలు చేసింది. ఇప్పుడు నిర్వాసితులకు న్యాయం చేయాలంటూ గట్టిగా పోరాటం చేస్తున్నది కూడా ఆ పార్టీనే! సూరా పాపిరెడ్డి తదితర సీనియర్ నేతలు ఈ ప్రాజెక్టు సాధన కోసం దశాబ్దాల క్రితమే పోరాటాలు చేశారు. మార్కాపురం కేంద్రంగా ఎన్నో ఉద్యమాలు జరిగాయి. పాదయాత్రలు, సైకిలు యాత్రలు నిర్వహించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శులుగా పనిచేసిన కొరటాల సత్యనారాయణ, బీవీ రాఘవులు, పి మధు, ప్రస్తుతం కార్యదర్శిగా ఉన్న వి.శ్రీనివాసరావు ఈ ఉద్యమాల్లో పాల్గొన్నారు. రైతుసంఘం కూడా దీనికోసం ఉద్యమాలు చేపట్టింది. సొరంగాల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల నీటి లభ్యత తగ్గుతుందని భావించిన అప్పటి సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న బీవీ రాఘవులు పామూరు నుంచి దోర్నాల వరకూ యాత్ర చేపట్టారు. రెండో సొరంగం సిపిఎం పోరాట ఫలితంగానే వచ్చింది.
ఇపుడు నిర్వాసితులకు అండగా...
7,230 మంది నిర్వాసితులు ఈ ప్రాజెక్టు కింద సర్వం కోల్పోతున్నారు. ఇళ్లూవాకిళ్లూ వదిలి బయటకు రావాల్సి వస్తోంది. నిర్వాసితులు ఈ ప్రాంతానికి ప్రాజెక్టు రావడాన్ని తొలి నుంచీ స్వాగతించారు. పరిహారం వెంటనే ఇవ్వాలని కోరారు. ప్రాజె క్టు పనులు ఆగుతూసాగుతూ వస్తున్నందున నిర్వాసితులు అక్కడే ఉన్నారు. అదే భూములను సాగుచేసుకుంటూ జీవనం సాగించారు. అయితే ఉన్నపళంగా ఇప్పటికిప్పుడే ఖాళీ చేయాలని, ఈ నెలాఖరులో నీటిని విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు నిర్వాసితులకు పూర్తిగా నష్టపరిహారం అందలేదు. కొందరి పేర్లు జాబితాలో మిస్ అయ్యాయి. ప్రాజెక్టు పనుల్లో జాప్యం కావడంతో ఈ లోగా 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారికి పరిహారం చెల్లించే విషయమై ప్రభుత్వమేమి తేల్చలేదు. గ్రామాలు ఖాళీ చేయడానికి మరికొంత సమయం కావాలని నిర్వాసితులు కోరుతున్నారు. అయితే, వీరి కన్నీటిగాథలు ఎవరికీ పట్టడం లేదు. ఎవరైనా వారి తరపున అడిగితే ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నారనే ప్రచారం చేస్తున్నారు. కానీ, సిపిఎం వారి వైపు నిలబడింది. వారి సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తోంది.







కామెంట్‌లు (0)