గురువారం, 30 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionపరిహారం ఇవ్వకుండా... ప్రారంభోత్సవమా..?

1 గంట క్రితం

appalanarsayya
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 30, 2026, 04:45 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

  • భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్వాసితుల ఆవేదన

​ప్రజాశక్తి– విజయనగరం ప్రతినిధి : 'ఏం చెప్తాం బాబూ! .నాకున్న 2.10 ఎకరాల భూమిని ఎలాంటి సమాచారమూ ఇవ్వకుండా లాగేసుకున్నారు. నిద్రలో ఉన్నప్పడు లేపి మరీ గుడిసె కూల్చేశారు. రేపే పరిహారం ఇస్తామన్నారు. కానీ, ఈ రోజు వరకూ చిల్లిగవ్వ కూడా చేతికి రాలేదు. పోనీ, ఎంత ఇస్తారు? ఎప్పుడు ఇస్తారు? అనేది చెప్పే నాథుడే లేడు. ఇప్పుడు విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి వస్తున్నారని చెబుతున్నారు. మాకు పరిహారం ఇవ్వకుండా ప్రారంభోత్సవం ఎల చేస్తారు?’

`- ఇది బైరెడ్డిపాలెం గ్రామానికి చెందిన నిర్వాసితుడు బైరెడ్డి అప్పలనర్సయ్య ప్రశ్న!

ఇది ఆయన ఒక్కరి ఆవేదన మాత్రమే కాదు. భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం కోసం భూములు, ఇళ్లు, ఊళ్లు కోల్పోయిన వందలాది కుటుంబాలు ఇదే రకమైన బాధను వ్యక్తం చేస్తున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఆగస్టు ఒకటవ తేదిన ఈ ఏయిర్‌‌పోర్టును ప్రారంభించనున్న నేపథ్యంలో నిర్వాసిత గ్రామాల్లో ప్రజాశక్తి పర్యటించింది. స్థానికులతో మాట్లాడింది.తమ గ్రామంలో సుమారు 250 ఎకరాల భూమి తీసుకున్నారని, దానిలోనే

రెండు స్మశానాలు కూడా ఉన్నాయని రెడ్డిక కంచేరుకు చెందిన శీరాపు వంశీ చెప్పారు. వాటికి ప్రత్యామ్నాయంగా స్థలం ఇస్తామని 2015లో ఇచ్చిన నోటిఫికేషన్ సమయంలో చెప్పారని, ఇప్పటి వరకు ఆ ఊసే లేదని ఆయన అన్నారు. ‘ జీవనోపాధి పోయింది... చివరకు చనిపోయాక పూడ్చుకునే చోటు కూడా లేకుండా చేశారు. ఇప్పుడు విమానంలో ఎక్కిస్తామంటున్నారు. ఒక్కసారి విమానం ఎక్కితే మా జీవితాలు మారిపోతాయా? ’ అని ఆయన ప్రశ్నించారు. విమానాశ్రయంలో ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

నాలుగు గ్రామాలు కనుమరుగు

భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం కోసం మొత్తం 2,830.08 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించింది. ఇందులో ప్రధాన విమానాశ్రయానికి 2,750.15 ఎకరాలు, ట్రంపెట్ కనెక్టివిటీకి 60.08 ఎకరాలు, అప్రోచ్ రోడ్డుకు 19.85 ఎకరాలు స్వాధీనం చేసుకుంది. ప్రభుత్వ భూములతో పాటు జిరాయితీ, డి-పట్టా, అసైన్‌మెంట్ భూములు కూడా ఇందులో ఉన్నాయి. మొదట దాదాపు పది వేల ఎకరాలు సేకరిస్తామని ప్రకటించిన ప్రభుత్వం సిపిఎం ఆధ్వర్యాన నిర్వాసితులు చేసిన పోరాటంతో తొలుత5,311.88 ఎకరాలకు, చివరకు 2,750.15 ఎకరాలకు తగ్గించింది. అయినా, నాలుగు గ్రామాలు పూర్తిగా కనుమరుగయ్యాయి. సవిరివిల్లి, ఎ.రావివలస, గూడెపువలస, కంచేరు,కవులవాడ, రావాడ, ముంజేరు గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున భూములు కోల్పోగా, బొల్లెంకులపాలెం, ముడసర్లపేట, మరడపాలెం, రెల్లిపేట గ్రామాలు చరిత్రలో కలిసిపోయాయి.

పరిహారం అందలేదు...

2015లో జారీ చేసిన నోటిఫికేషన్ ప్రారంభ దశలో జిరాయితీ భూములకు ఎకరాకు రూ.28 లక్షల నుంచి రూ.34 లక్షలు, అసైన్‌మెంట్ భూములకు రూ.12.50 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిర్వాసితుల పోరాటం, న్యాయస్థానాల జోక్యంతో అసైన్‌మెంట్ భూములకు కూడా జిరాయితీతో సమాన పరిహారం ఇవ్వాల్సి వచ్చింది. అయితే, ఇప్పటికీ సుమారు 400 ఎకరాలకు సంబంధించిన వంద మందికిపైగా రైతులకు పరిహారం అందలేదని నాటి నిర్వాసిత పోరాటంలో కలిసొచ్చిన స్థానిక నాయకులు చెబుతున్నారు. కొందరి పరిహారం కోర్టుల్లో జమ చేయగా, మరికొందరికి పత్రాల పరిశీలన, సాంకేతిక కారణాలు వంటి సాకులతో చెల్లింపులు నిలిపివేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. రాష్ర్ట ఎంఎస్ఎంఇ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్... ఎయిర్ పోర్టు నిర్వాసితులకు సంబంధించి విశాఖ ట్రిబ్యునల్ కోర్టులో సుమారు 20 కేసులు, హైకోర్టులో 50 కేసులు పెండింగ్ లో ఉన్నట్టు ప్రకటించడాన్ని బట్టి సమస్య తీవ్రత అర్థమవుతోంది.

కటాఫ్‌ ‌తేది వివాదం

నిర్వాసిత యువతకు ప్యాకేజీని నోటిఫికేషన్ జారీ చేసిన తేదీని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. 2021లో అధికారులు ఊళ్లను ఖాళీ చేయించారు. నోటిఫికేషన్ తేదీని కాకుండా, ఊళ్లను ఖాళీ చేయించిన తేదీని కటాఫ్ గా తీసుకోవాలని అర్హత కలిగిన మరో వంద మంది యువతకు కూడా ప్యాకేజీ ఇవ్వాలని నిర్వాసితులు డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగాలు, ఉపాధి, అభివృద్ధి అంటూ భూములు తీసుకునే వరకు ఎన్నో హామీలు ఇచ్చిన ప్రభుత్వం, భూములు స్వాధీనం చేసుకున్న తర్వాత తమను పూర్తిగా విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను ఇప్పటికైనా పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

​నిషేద జాబితాలో నిర్వాసిత కాలనీ

మరడపాలెం నిర్వాసిత కాలనీ ఏర్పాటై ఏళ్లు గడిచినా ఇప్పటికీ ప్రభుత్వం '22-ఎ' నిషేధ జాబితా నుంచి తొలగించలేదని మాజీ ఎంపిటిసి సభ్యులు కోరాడ రాము చెప్పారు. ‘ దీంతో, ఇళ్లకు రిజిస్ట్రేషన్ జరగడం లేదు. బ్యాంకు రుణాలు రావడం లేదు. అనారోగ్య సమయాల్లోనూ, పెళ్లిల సందర్భంలోనూ చివరికి ఎలాంటి ఆపద, అత్యవసర పరిస్థితి వచ్చినా అమ్ముకోలేకపోతున్నాం. భూములు, ఊళ్లూ ఎలాగూ లాగేసుకున్నారు. చివరకు ఇళ్లు రిజిస్ర్టేషన్ చేసుకునేందుకు కూడా అవకాశం లేకుండా చేశారు. దీంతో బంధువుల వద్ద కూడా పరపతి లేకుండా పోయింది. ప్రభుత్వం ఇచ్చిన స్థలంలోనే ఉంటున్నాం. కానీ, యాజమాన్య హక్కు లేదు. ఇలాంటి ఇళ్లు ఇచ్చి మమ్మలను అభివృద్ధి చేశామని ఎలా చెబుతారు?` అని ఆయన ప్రశ్నించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్