ఉపాధ్యాయురాలుకి సిసిఎల్ మంజూరు చేయని అధికారులు
శిశువు కన్నుమూత !
రాంచి : అధికారుల లంచగొండితనం కారణంగా భూమ్మీద పడకుండానే ఒక శిశువు కన్నుమూసింది. పిల్లల సంరక్షణా శెలవు (సిసిఎల్) కావాలంటూ లేఖలు రాసి, అధికారులు, ఆఫీసుల చుట్టూ తిరిగి అలసిపోయిన ఒక ప్రభుత్వ ఉపాధ్యాయురాలు శెలవు రాకుండానే, కడుపులోనే చనిపోయిన శిశువును ప్రసవించిన ఘటన జార్ఖండ్‌లోని చెయిన్‌పూర్‌లో చోటు చేసుకుంది. తర్హాసిలో ప్లస్ టూ హైస్కూల్ టీచర్ భారతి పాండే డిప్యూటేషన్‌పై చెయిన్‌పూర్‌లోని కస్తూర్బా గాంధీ సిఎం ఎక్స్‌లెన్స్ స్కూల్లో పనిచేస్తున్నారు. జులై 3న ఆమె సిసిఎల్ కోసం దరఖాస్తు చేసుకోగా, 20వ తేదీ వరకు మంజూరు కాలేదు. పైగా శెలవు మంజూరు చేయాలంటే రూ.50వేలు లంచం కావాలని జిల్లా విద్యా శాఖ కార్యాలయంలో సిబ్బంది డిమాండ్ చేశారు. దీంతో తన భార్య చివరి వారం వరకు అటూ ఇటూ తిరగాల్సి వచ్చిందని, ఫలితంగా తమ బిడ్డను పోగొట్టుకున్నామని ఆమె భర్త, హజారీబాగ్‌లో పోలీసు అధికారి అయిన ముకేష్ కుమార్ తివారీ వాపోయారు. చివరగా ఈ నెల 25న ఆమెకు అకస్మాత్తుగా కడుపులో నొప్పి విపరీతంగా రావడంతో ఆస్పత్రికి వెళ్ళగా కడుపులోనే శిశువు చనిపోయిందని డాక్టర్లు తెలిపారు. తమకు అప్పటికే ఇద్దరు పిల్లలు వున్నారని, అందువల్ల ప్రసూతీ శెలవు వర్తించదని, అందుకే సిసిఎల్ కోసం దరఖాస్తు చేసుకున్నామని చెప్పారు. దాన్ని మంజూరు చేయడానికి బదులుగా లంచాలు అడుగుతూ ఒక అధికారి నుండి మరొకరి వద్దకు తిప్పారని ఆయన మీడియాతో మాట్లాడుతూ విమర్శించారు. విశ్రాంతి అవసరమని డాక్టర్లు చెబుతూనే వున్నా చివర వరకు తన భార్యకు శలవు మంజూరు చేయలేదన్నారు. దాంతో చివరకు డాక్టర్లు ఎలాగోలా పెద్ద ప్రాణాన్ని కాపాడగలిగారు కానీ బిడ్డను కాపాడలేకపోయారని అన్నారు. ఈ విషయమై పెద్ద వివారం రేగడంతో అకస్మాత్తుగా 25వ తేదీ నుండి ఆరు మాసాల శలవును అధికారులు మంజూరు చేశారు. కాగా దీనిపై అధికార యంత్రాంగాన్ని ప్రశ్నించగా అవసరమైన పత్రాలు అందచేయలేదని, 20వ తేదీన మాత్రమే సరైన పత్రాలు అందాయని, 25న శలవు మంజూరు చేశామని వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. అయితే జాప్యానికి కారకులైన ఇద్దరు గుమస్తాలను సస్పెండ్ చేశారు. కానీ ఎలాంటి ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదు.








కామెంట్‌లు (0)