శనివారం, 22 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

కరువు రైతుపై బీమా భారం

47 నిమిషాల క్రితం

crop
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 23, 2026, 03:15 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

- ‘ఉచితం’ ఎత్తేశాక ఎన్‌‌రోల్‌‌మెంట్‌‌లో భారీ తగ్గుదల

- ప్రీమియం చెల్లించాలని అన్నదాతపై ఒత్తిడి

- ఇన్సూరెన్స్‌ కవరేజిని పెంచేందుకు స్పెషల్‌ డ్రైవ్‌

- ఎల్‌‌నినో వేళ సర్కారు ప్రీమియం కట్టాలని అన్నదాతల మొర

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : వర్షాభావానికి ఎల్‌‌నినో తోడై తీవ్ర కరువుతో దిక్కు తోచని స్థితిలో ఉన్న ఖరీఫ్‌ ‌రైతుకు పంటల బీమా ప్రీమియం చెల్లింపు గోరుచుట్టుపై రోకలి పోటుగా తయారైంది. రాష్ట్రంలో టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక అప్పటి వరకు ఉన్న ఉచిత పంటల బీమాను రద్దు చేసి రైతులు చెల్లించాల్సిన ప్రీమియాన్ని వారినే చెల్లించుకోమంది. కేంద్ర ప్రభుత్వమేమో పంటల బీమాను రైతులకు స్వచ్ఛందం (ఐచ్ఛికం) చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల డబుల్‌ ఇంజిన్‌ దెబ్బతో బీమా పథకాల్లో రైతుల చేరిక రెండేళ్లల్లో దారుణంగా పడిపోయింది. బీమా కవరేజిలోకొచ్చే రైతులు తగ్గిపోవడంతో పథకాలను అమలు చేస్తున్న ప్రైవేటు ఇన్సూరెన్స్‌ ‌కంపెనీలకు చేకూరే లాభాలు తగ్గాయి. కంపెనీల ఒత్తిడి ఒక వైపు రైతుల సంఖ్య తగ్గిపోతోందన్న విమర్శలు మరోవైపు కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేశాయి. సమస్య నుంచి బయట పడేందుకు ఈ ఖరీఫ్‌ ‌నుంచి ఎన్‌‌రోల్‌‌మెంట్‌‌ను పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ (స్పెషల్‌ ‌డ్రైవ్‌) ‌చేపట్టింది. కరువు నెలకొన్న నేపథ్యంలో రైతులతో ప్రీమియం కట్టించాలని ఎంఎల్‌ఎలకు అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి, వ్యవసాయశాఖ మంత్రి పురమాయించారు. పంటలకు బీమా చేయించుకోవాలంటూ అధికారులు, ప్రజాప్రతినిధులు ఒత్తిడి చేయడంతో అసలే ఖరీఫ్‌ సాగు సాగక ఆర్థిక సంక్షోభంలో ఉన్న రైతన్నలు ‌బీమా ప్రీమియం బారమని ఆవేదన చెందుతున్నారు. ఎల్‌‌నినో ఏడాది వరకైనా రైతుల తరఫున ప్రీమియం చెల్లించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని అభ్యర్ధిస్తున్నారు.

గడువు పెంచినా అంతే...

కేంద్రంతో కలిసి కూటమి ప్రభుత్వం ఫసల్‌ ‌(దిగుబడి ఆధారిత), వాతావరణ ఆధారిత బీమా పథకాలను అమలు చేస్తోంది. 2024 ఖరీఫ్‌ ‌వరకు ఉచిత పంటల బీమా అమలు చేసి, 2024 రబీ నుంచి రైతులను వారి వాటా ప్రీమియాన్ని చెల్లించుకోమంది. ఉచిత పంటల బీమా అమలు చేసిన 2024 ఖరీఫ్‌‌లో 26 జిల్లాల్లో నోటిఫై చేసిన పంటలకు గాను 51.55 లక్షల ఎకరాలకు 24.05 లక్షల మంది రైతులు ఫసల్‌ ‌బీమా చేయించుకున్నారు. ఉచితం ఎత్తేశాక 2025 ఖరీఫ్‌‌లో రైతుల ఎన్‌‌రోల్‌‌మెంట్‌ 4.52 లక్షలకు, విస్తీర్ణం 8.40 లక్షల ఎకరాలకు తగ్గిపోయింది. ఎల్‌‌నినో సంవత్సరం 2026లో బీమా కవరేజికి దాదాపు నెలన్నర గడువు పొడిగించారు. ఈ నెలాఖరు (ఆగస్టు 31)తో గడువు ముగుస్తుంది. కాగా శనివారం నాటికి ఫసల్‌‌లో ఎన్‌‌రోల్‌‌మెంట్‌ 10.57 లక్షలకు, బీమా చేయించుకున్న విస్తీర్ణం 25.65 లక్షలకు చేరింది. వాతావరణ బీమా విషయానికొస్తే ఉచిత బీమా అమలు చేసిన 2024 ఖరీఫ్‌‌లో 21 జిల్లాల్లో 8 లక్షల మంది రైతులు 19.57 లక్షల ఎకరాల్లో పంటలకు బీమా చేయించగా, ఉచితం ఎత్తేశాక 2025 ఖరీఫ్‌‌లో 20 జిల్లాల్లో రైతుల ఎన్‌‌రోల్‌‌మెంట్‌ 3.04 లక్షలకు, విస్తీర్ణం 11.15 లక్షల ఎకరాలకు పడిపోయింది. ఎల్‌‌నినో ఏడాది 2026లో వాతావరణ బీమా ఎన్‌‌రోల్‌‌మెంట్‌ ‌శనివారంనాటికి 4.91 లక్షల రైతులు, విస్తీర్ణం 14.97 లక్షల ఎకరాలు. గడువు ఇంకా వారం రోజులే ఉంది. కరువు పరిస్థితుల్లో వాతావరణ బీమా కీలకం. ఈ పథకంలో ఎన్‌‌రోల్‌‌మెంట్‌ ప్రత్యేక డ్రైవ్‌ ఇచ్చినా అంతంతమాత్రంగానే పెరిగింది.

కంపెనీలకే లాభం

ఫసల్‌ ‌బీమా అమలుకు కేంద్ర ప్రభుత్వరంగానికి చెందిన అగ్రికల్చర్‌ ఇన్సూరెన్స్‌ ‌కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎఐసి)కి పశ్చిమగోదావరి, శ్రీసత్యసాయి, విజయనగరం ఉమ్మడి జిల్లాలను కేటాయించారు. తతిమ్మా జిల్లాలన్నింటికీ ప్రైవేటు జనరల్‌ ఇస్సూరెన్స్‌ (‌గతంలో ఫూచర్‌ ‌గ్రూప్‌), టాటా, ఐసిఐసిఐ లాంబార్డులకు కేటాయించారు. వాతావరణ బీమా అమలును అనంతపురం, పల్నాడు, అల్లూరి, కోనసీమ, నంద్యాల, బాపట్ల, అనకాపల్లి, ప్రకాశం, ఏలూరు జిల్లాలను ప్రభుత్వరంగ సంస్థ ఎఐసికి కేటాయించారు. మిగిలిన జిల్లాలను ప్రైవేటు కంపెనీలైన ఇన్డూసండ్‌ (‌గతంలో రిలయన్స్‌), ఇఫ్‌‌కో టోకియో కంపెనీలకు కేటాయించారు. ఎల్‌‌నినో వేళ వాతావరణ పరంగా హైరిస్క్‌ ఉన్న జిల్లాలను ప్రభుత్వరంగ సంస్థకు కేటాయించడం చర్చనీయాంశంగా మారింది. ఇది ప్రైవేట్‌ ‌కంపెనీలకు లాభం చేకూరుస్తుంది.

ఎకరానికి రూ.వేల భారం

పంటల బీమా అమలుకు ప్రభుత్వం టెండర్లు పిలుస్తోంది. ఏటికేడు కంపెనీలు సమ్‌ ఇన్సూర్డు అమౌంట్‌‌ను, పర్సంటేజిని, నిర్వహణా ఖర్చులను పెంచుతున్నాయి. ఆ భారం రైతులపై, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపైనే పడుతుంది. ఖరీఫ్‌‌లో ఆహార పంటలకు నిర్ణయించిన సమ్‌ ఇన్సూర్డు అమౌంట్‌‌పై 2 శాతం, వాణిజ్య, ఉద్యానవన పంటలపై 5 శాతం వంతున రైతులు తమ జేబులో నుంచి ప్రీమియం చెల్లించాలి. రైతులు రూ. వేల చొప్పున ఎకరానికి తమ వాటా ప్రీమియం కట్టాలి. పత్తి వంటి కమర్షియల్‌ ‌క్రాప్స్‌, తోటలకు ఐదు శాతం చెల్లించాలి. ఉదాహరణకు ఎకరానికి పంటకు సమ్‌ ఇన్సూర్డు అమౌంట్‌ ‌రూ.లక్షగా నిర్ణయిస్తే ఆహార పంటలకు రూ.2 వేలు, వాణిజ్య పంటలకు రూ.ఐదు వేలు రైతులు చెల్లించాలి. అప్పుడు టెండర్లలో నిర్ణయమైన ప్రీమియంలో రైతు వాటా పోను మిగిలిన అమౌంట్‌‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం చెల్లిస్తాయి. అవన్నీ కంపెనీల బొక్కసానికి చేరతాయి. ఎన్‌‌రోల్‌ అయిన రైతుల్లో ఎంత మందికి కంపెనీలు పరిహారం చెల్లిస్తాయో ఎంత చెల్లిస్తాయో పెద్ద పజిల్‌. వాటి నిబంధనలు కఠినంగా ఉంటాయి. ఇది సొంత భూమి కలిగిన రైతులకే. కౌలు రైతులకు అది కూడా లేదు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్