- వి ఆర్
కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయాలని కాకినాడలో ఆందోళన చేసిన నిరుద్యోగులు, వారికి మద్దతుగా పాల్గొన్న యువజన, విద్యార్థి సంఘాల నాయకులపై ఏడు సెక్షన్ల కింద పోలీసులు కేసులు పెట్టారు. ‘మనం చేసే ప్రతి పనిని జెన్ జెడ్ తరం జాగ్రత్తగా గమనిస్తుంటారు, ప్రశ్నిస్తుంటారు వారు లేవనెత్తుతున్న అంశాలను పట్టించుకోవాలి’ అని కొద్ది రోజుల క్రితం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా జెన్ జెడ్ ఆందోళన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నష్టనివారణ చర్యల్లో భాగంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ వాఖ్యలు చేశారు. అయితే మాటల్లో చెప్పినదానికి భిన్నంగా పాత పద్ధతుల్లోనే నిర్భంధ విధానాన్ని కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో సుమారు 20 వేల కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేస్తామని రాష్ట్ర హోంశాఖ మంత్రి పదే పదే ప్రకటించారు. 11,639 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపినట్లు, వాటికి అనుమతులు వచ్చినట్లు లీకులొచ్చాయి. దీంతో నోటిఫికేషన్ త్వరలో వస్తుందన్న ఆశ నిరుద్యోగుల్లో చిగురించింది. వేలాది మంది అందుకు సన్నద్ధం అవుతున్నారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు వున్నా ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో కోచింగ్ సెంటర్లలో శిక్షణ పొందుతున్నారు. అయితే కేవలం 1600 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ రావడంతో నిరుద్యోగుల్లో ఆగ్రహం పెరిగింది. ఖాళీలన్నింటికి నోటిఫికేషన్ కోరుతూ వివిధ జిల్లాల్లో ఆందోళనలు చేశారు. ఈ క్రమంలోనే కాకినాడలోనూ పెద్ద సంఖ్యలో రోడ్డుపైకి వచ్చి తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తేవడానికి ప్రయత్నించారు. ఈ ఆందోళనల్లో ఎక్కడ హింసాత్మక సంఘటనలు జరగలేదు. శాంతియుత నిరసనను కూడా ప్రభుత్వం సహించలేక ఆందోళనల్లో పాల్గొన్న నిరుద్యోగులతో పాటు, వారికి మద్దతు ఇచ్చినందుకు డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించింది. ముఖ్యమంత్రి మాటల్లో..జన్ జెడ్ తరాన్ని అర్థం చేసుకోవడం అంటే ఇదేనా? యువతపై అణచివేత చర్యలు దేనికి సంకేతం? శ్యామ్ కోచింగ్ సెంటర్ నిర్వహకుడిపై కూడా కేసు పెట్టిన తీరు నిరుద్యోగుల గొంతులను నొక్కడంలోని మరో పార్శ్వాన్ని స్పష్టం చేస్తుంది. నిరుద్యోగులను, కోచింగ్ సెంటర్ల నిర్వాహకులను భయపెట్టడం కోసం తనిఖీల పేరుతో శ్యామ్ కోచింగ్ సెంటర్ లో పోలీసులు చేసిన హంగామా అంతాఇంతా కాదు. ఇంతటి నిర్బంధం, అణిచివేత చర్యలు ప్రభుత్వ ఆదేశాలతో జరిగాయా? లేక పాలకుల మెప్పు కోసం పోలీసులే ఇలా వ్యవహరించారో ప్రభుత్వం స్పష్టం చేయాలి. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ‘అగ్నివీర్’ విధానానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో జరిగిన ఆందోళనల సందర్భంగా గత వైసిపి ప్రభుత్వమూ ఇలాగే కేసులు పెట్టింది. అప్పట్లో జరిగిన అనేక ఉద్యమాలపై నిర్భంధాలను ప్రయోగించింది. ఈ విధానాలను ఆనాడు వ్యతిరేకించన వారే.. నేడు అదే రీతిలో అణిచివేత చర్యలను అమలు చేయడం మారని పాలనతీరుకు నిదర్శనం. ఇలాంటి నిర్భంధాలు, అణచివేతలు సాగవని జెన్ జెడ్, జెన్ అల్ఫా తరం కేంద్రంతో సహా అనేక రాష్ట్ర ప్రభుత్వాలకు నేర్పిన గుణపాఠాలను మన రాష్ట్ర పాలకులు గుర్తించకపోతే ఎలా?
డిఎస్సీ ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా నియమాకాలపైనా అనేక సందేహాలు, విమర్శలు వస్తున్నాయి. స్పోర్ట్స్ కోటా ద్వారా నిజమైన అర్హులను పక్కనబెట్టి అక్రమాలకు పాల్పడ్డారనే విమర్శకు ప్రభుత్వం చెబుతున్న సమాధానాలు మరిన్ని కొంత అనుమానాలను పెంచింది. అక్రమ నియమాకాలపై నిరుద్యోగులు చేస్తున్న ఆందోళనకు పోటీగా పాలక పెద్దల ప్రోత్సాహంతో అనేక ప్రాంతాల్లో ప్రదర్శనలు, సభలు జరిగాయి. అంతమాత్రాన అక్రమాలు సక్రమమై పోవు కదా! తన నిర్ధోషిత్వాన్ని నిరూపించుకోవలసిన బాధ్యత ప్రభుత్వానిది. అందుకు భిన్నంగా ఉద్యమంలో పాల్గొన్న నిరుద్యోగులను బెదరించడం, సోషల్ మీడియా ద్వారా వేధించడం ఏ న్యాయం? ఈ అక్రమాలను ప్రశ్నిస్తూ నిర్వహించిన ఆందోళనలో విద్యార్థులు పాల్గొన్నారనే పేరుతో విద్యాసంస్థల యాజమాన్యాలను అధికార పార్టీల నేతలు అనేక జిల్లాల్లో బెదిరించారు.
ఇదేదో గొప్ప కార్యమైనట్లు కొందరు నేతలు తమ స్వంత సోషల్ మీడియా టీంలను వెంటబెట్టుకుని మరీ ఈ తరహా బెదరింపులకు పాల్పడి, వీడియోలను విడుదల చేశారు. దీని వల్ల పార్టీ పెద్దలతో మెప్పు పొందుతారామో కానీ ఈ తరం మెప్పును పొందరని గుర్తించాలి.
విద్యాలయాల్లోకి, హాస్టల్స్‌లోకి ‘బయటివారు’ రాకూడదని కూటమి ప్రభుత్వం జివో ఆర్‌సి నెంబర్ 30/67/2025, ఆర్‌సి నెంబర్ 234 ఇచ్చింది. ఎవరు ఈ బయటివారు. విద్యార్థి సంఘాల వారు అన్నది స్పష్టం. టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది కొరత, ల్యాబ్‌లు, ఆటస్థలాలు, మరుగుదొడ్లు లాంటి అనేక సమస్యలును విద్యార్థులు ఎదుర్కొంటువుంటారు. విద్యార్థి సంఘాలు వాటిని వెలుగులోకి తెచ్చి పరిష్కారానికి ఒత్తిడి తెస్తాయి.
ప్రస్తుత ముఖ్యమంత్రితో మొదలు అనేకమంది ప్రజాప్రతినిధులు గతంలో విద్యార్థి నాయకులుగా పనిచేసినవారే. తమ గతాన్ని గుర్తించకుండా ఈ తరం విద్యార్థుల కనీస ప్రజాస్వామిక హక్కును కూడా కాలరాస్తే ఎలా? విద్యార్థి సంఘాలను అడ్డుకుంటున్న ప్రభుత్వం మరోవైపు మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ (పిటిఎం) పేరుతో ప్రతి సంవత్సరం విద్యాలయాల్లో రాజకీయ జాతరలు జరుపుతుంది. ప్రభుత్వ కార్యక్రమాల కోసం ప్రధాని మెప్పు కోసం, గిన్నిస్ రికార్డు కోసం విద్యార్థులను తరలిస్తూనే వున్నారు
భావితరాల్లో ప్రజాస్వామిక స్ఫూర్తిని కలిగించడానికి, నాయకత్వ లక్షణాలు అభివృద్ధి కావడానికి విద్యాలయాల్లో జరిగే ఎన్నికలు తోడ్పడేవి. వీటిని గతంలో టిడిపి ప్రభుత్వం రద్దు చేసింది. దీనివల్ల విద్యాలయాల్లో కుల, మత సంస్థలతో పాటు అరాచకశక్తులు పెరిగిపోతున్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలి. పాలకులు మ్రాతమే మారి పాలనాతీరు మారకపోతే మార్పుకు అర్థం ఏముంది?







కామెంట్‌లు (0)