గురువారం, 20 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionన్యాయం వెలి!

6 గంటల క్రితం

WhatsApp Image 2026-08-19 at 22.00.57.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 20, 2026, 03:22 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

• వెలిగొండ నిర్వాసితుల పట్ల సర్కారు తీరు

• 18 ఏళ్లు నిండిన వారికి ఉత్త చేతులే!

• ఒటిఎస్‌ చేసుకున్న వారికి తీరని అన్యాయం

• మౌలిక వసతులు లేకుండానే మెడపై కత్తి

ప్రజాశక్తి - మార్కాపురం : ఆస్తి పంపకాలు చేసుకుంటున్నామనుకోండి. ఇంట్లో మైనర్‌ ‌పిల్లలుంటే ఏం చేస్తాం? వారి గురించి ఆలోచిస్తాం కదా! వారి భవిష్యత్‌‌కు భరోసా ఇచ్చేలా ఏదో ఒకటి చేస్తాం కదా..! అలా చేయాలని ఎవ్వరూ చెప్పరు. కానీ చేసేస్తాం. ఎందుకంటే అది మన సమాజంలో అమలులో ఉన్న సహజ న్యాయం! కానీ మన రాష్ట్ర ప్రభుత్వానికి అదేం పట్టడంలేదు. వెలిగొండ ప్రాజెక్టు కోసం భూమిని సేకరిస్తున్న సమయంలో అప్పటికి మైనర్లుగా ఉన్న వారి గురించి, వారి భవిష్యత్తు గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. అప్పట్లో మైనర్లుగా ఉన్న పిల్లలు ఇప్పుడు పెరిగి పెద్ద వారయ్యారు. వారిలో కొందరికి పెళ్ళిళ్లయ్యాయి. సొంత కుటుంబాలు ఏర్పడ్డాయి. ఏళ్ల తరబడి సాగిన ప్రాజెక్టు పనులు ఇప్పటికి పూర్తికావడంతో నీటి విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. నిర్వాసితులు గ్రామాలు విడిచి వెళ్లాల్సిందేనంటూ డెడ్‌‌లైన్‌ ‌కూడా విధించింది! కానీ ‘మా సంగతేంటి’ అంటూ ఇప్పుడు 18 ఏళ్లు నిండిన మేజర్లు మేజర్లు అడుగుతున్నారు. ‘మేం ఇక్కడే పుట్టాం... ఇక్కడే పెరిగాం.’ అన్నది వారి వాదన! పాలకులకు ఇవేమి పట్టించుకోవడమే లేదు. నీరు ఇచ్చామన్న పేరే వారికి కావాలి! .... ఇది న్యాయమేనా?


​ప్రాజెక్టు కోసం 2019లో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. అప్పటి ధరల ప్రకారం ప్యాకేజిని 12.50 లక్షల రూపాయలుగా నిర్ణయించింది. అయితే, ఆ మొత్తాన్ని అప్పుడియ్యలేదు. ప్రాజెక్టు పనులు పూర్తయిన తరువాత, ఈ సంవత్సరం ఇచ్చింది. అప్పటి ధరలకు, ఇప్పటి ధరలకు పొంతన లేదు. పరిహారం పెంచండన్న నిర్వాసితుల విజ్ఞప్తి సర్కారు చెవికి ఎక్కలేదు. అప్పట్లో ఈ ప్రాంతంలో ఎకరం ధర 3.50 లక్షల నుండి 4 లక్షల రూపాయలు ఉండేది. ప్రస్తుతం 20 నుండి 25 లక్షల రూపాయలకు చేరింది. ఈ వాస్తవాన్ని చూడటానికి ప్రభుత్వం సిద్ధపడటం లేదు ! ... ఇది న్యాయమేనా?


ప్రభుత్వం మీద నమ్మకంతో వన్‌‌టైమ్‌ ‌సెటిల్‌‌మెంట్‌‌కు ఒప్పుకున్న వారు 3,360 మంది ఉన్నారు. వారిలో 2,400 మందికి మాత్రమే పరిహారం అందింది. అది కూడా గత నెలలోనే! 2019 ఒప్పందం ప్రకారం 12.50 లక్షల రూపాయలు మాత్రమే వీరికిచ్చిన ప్రభుత్వం, ఒకేసారి ఇచ్చేశాం కాబట్టి పునరావాస కాలనీల్లో ఇళ్లు కాని, స్థలంగాని ఇచ్చే ప్రసక్తే లేదంటోంది... ఇది న్యాయమేనా?


వెలిగొండ నిర్వాసితుల కోసం విడుదలచేసిన 200 కోట్ల రూపాయల పరిహారాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్వాసితులకు బుధవారం అందచేశారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద పరిహారం అందుకోవాల్సిన నిర్వాసితులు 4,756 మంది ఉన్నారని, వారికోసం రూ.600 కోట్లు కేటాయించామని, విడతల వారీగా వారికీ అందచేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ప్రభుత్వ లెక్క ప్రకారం .మరో రూ.400 కోట్లు ఇవ్వాల్సి ఉంది. కానీ వాస్తవం వేరు! వెలిగొండ నిర్వాసితులకు కొండంత అన్యాయం జరుగుతోంది. అందుకే వారిలో ఆగ్రహం పెల్లుబుకుతోంది. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం భూమికి బదులుగా భూమి... భూమి లేని వారికి ఉద్యోగం, పునరావాస కాలనీలలో పక్కా గృహం, మెరుగైన ప్యాకేజీ వారికి అందడం లేదు. ప్రాజెక్టు పనులు ప్రారంభించే సమయానికి మైనర్లుగా ఉన్న 1600 నుండి 1700 మంది ఇప్పుడు మేజర్లు అయ్యారు. వారిలో సుమారు 600 మందికి పెళ్లిళ్లు అవ్వడంతో పాటు ఎక్కువ మందికి పిల్లలు కూడా ఉన్నారు.

నిర్వాసిత గ్రామాల్లో పెద్దదైన సుంకేశులలోని ఈ తరహా యువతీ యువకులు 450 మంది దాకా ఉన్నారు. వీరిలో సగానికన్నా ఎక్కువ మందికి వివాహం అయ్యింది. మరో గ్రామం తలనూతలలో 18 ఏళ్లు నిండిన వారు 350 మంది దాకా ఉన్నారు. వీరిలో 100 మందికన్నా చాలా మందికి పెళ్లిలయ్యాయి. వీరంతా తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

కనీసం 20 లక్షలు ఇవ్వండి...

తమకు నష్ట పరిహారంగా ప్రస్తుత ధరలను దృష్టిలో ఉంచుకుని కనీసం 20 లక్షల రూపాయలు ఇవ్వాలని నిర్వాసితులు కోరుతున్నారు. 2019లోనే అప్పుడు కుదుర్చుకున్న ప్యాకేజీ ఇచ్చి ఉంటే సాగుభూమి, నివాస స్థలం, ఇల్లు కొనుగోలు చేసుకునేవారమని, ఆ మొత్తానే ఇప్పుడు తీసుకోమంటే ఎలా అని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే పరిహారం తీసుకుంటే నిలువ నీడ లేక, సాగు భూమి లేక రోడ్డునపడతామని, రేపటి జీవన మెట్లాఅని కన్నీటి పర్యంతమవుతున్నారు.

2019 లెక్కల ప్రకారమే ....

వెలిగొండ ప్రాజెక్టు పరిధిలో 7,321 మంది నిర్వాసితులుగా 2019 నాటికి ప్రభుత్వం గుర్తించింది. ఆ సంఖ్య నేటితో పోల్చుకుంటే మరో రెండు వేల వరకు పెరగనుంది. ప్రభుత్వం మాత్రం 2019 లెక్కల ప్రకారం ముందుకు సాగుతోంది. 2,565 కుటుంబాలకు రూ.318 కోట్లు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద బ్యాంకు ఖాతాలో జమ చేసింది. వన్ టైం సెటిల్‌ ‌మెంట్‌ (ఒటిఎస్‌) కింద భూములిచ్చివారి పరిస్థితి పరిస్థితి దయనీయంగా ఉంది. పునరావాస కాలనీల్లో వారికి ఇళ్లు లేకపోగా, ప్రభుత్వం ఇచ్చిన రూ. 12.50 లక్షలతో ఇంటి స్థలమూ కొనే పరిస్థితి లేదు. ఇక భవిష్యత్‌ ఏమిటని వారు ఆవేదన చెందుతున్నారు. సాధారణ ప్యాకేజీ కింద 3,961 మంది ఉన్నారు. వారికి రూ.11.76 లక్షల ప్యాకేజీతోపాటు పునరావాస కాలనీలలో ఐదు సెంట్ల చొప్పున ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం స్థలం కేటాయించింది. పునరావాస కాలనీల్లో ఇప్పటికీ ఇంటి పట్టాలు అత్యధిక మందికి అందలేదు. తాగునీరు, కరెంటు వంటి మౌలిక వసతుల ఏర్పాటూ జరగలేదు.

​ఇప్పటికిప్పుడు వెళ్లలేం : నిర్వాసితులు

తమ సమస్యలు పరిష్కారం కానందున ఇప్పటికిప్పుడు గ్రామాలను ఖాళీ చేయలేమని నిర్వాసితులు తెగేసి చెబుతున్నారు. ఎలాంటి నోటీసూ ఇవ్వకుండా గ్రామాలను ఎలా ఖాళీ చేస్తామని ప్రశ్నిస్తున్నారు. ప్యాకేజీ ఆరు నెలల ముందుగా ఇచ్చి ఉంటే తాము పునరావాసం చూసుకునే వారమని ముంపు గ్రామాల ప్రజలు అంటున్నారు. హడావుడిగా ప్రాజెక్టు ప్రారంభిస్తామనడం, తమను ఉన్నఫలంగా గ్రామాలు ఖాళీ చేయాలని చెప్పడం ఎంతవరకు న్యాయమని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. వెంటనే గ్రామాలను ఖాళీ చేస్తే తాము ప్రస్తుతం సాగు చేస్తున్న పంటలను కూడా నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గొడ్డు, గోదా సగం ధరలకే తెగనమ్ముకోవాల్సి వస్తోందని, అద్దె ఇల్లు కూడా దొరకక ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. ఎక్కడైనా చిన్నపాటి ఇల్లు దొరికినా నెలకు రూ.10 వేలు అద్దె చెల్లించాలని యజమానులు కోరుతున్నారని తెలిపారు. హడావుడి నిర్ణయాలతో తాము కోలుకోలేని విధంగా నష్టపోతున్నామని, ప్రభుత్వం మా మొర ఆలకించాలని, తమ సమస్యలను యుద్ధప్రాతిపదికన తీర్చాలని డిమాండ్‌ ‌చేస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్