- జలాశయాల్లో తగ్గిన నీటి నిల్వలు
- రబీ సాగుపై సందిగ్ధం
- ప్రత్యామ్నాయ పంటలే మేలు
ప్రజాశక్తి - కొడవలూరు (నెల్లూరు జిల్లా):
ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తున్న రైతులకు వరుణుడు నిరాశే మిగులుస్తున్నాడు. ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో నెల్లూరు జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గిపోవడంతో సాగునీటి సరఫరాపై అనిశ్చితి నెలకొంది. దీంతో, రబీ సాగు చేయాలా? వద్దా? అన్న సందిగ్ధంలో అన్నదాతలు కొట్టుమిట్టాడుతున్నారు. ముఖ్యంగా వరి సాగుపై ఆధారపడిన రైతులకు నీటి సమస్య పెద్ద సవాలుగా మారింది.
కోవూరు, బుచ్చిరెడ్డిపాలెం, సూళ్లూరుపేట, గూడూరు, నాయుడుపేట, వెంకటాచలం, మనుబోలు మండలాల్లో పరిస్థితి మరింత విషమంగా ఉంది. వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం జిల్లాలో 29,936.82 ఎకరాల్లో పంటలు దెబ్బతినగా 43,548 మంది రైతులు నష్టపోయారు. రూ.47 కోట్ల మేర పంట నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. భూగర్భ జలమట్టం 120 అడుగుల నుంచి 280 అడుగులకు పడిపోవడంతో 60 శాతం బోరుబావులు విఫలమయ్యాయి.
లోటు వర్షపాతంతో కష్టాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ గణాంకాల ప్రకారం 2026 జూన్ 1 నుంచి నవంబరు 10 వరకు నెల్లూరు జిల్లాలో 417.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణంగా ఈ కాలంలో 705.3 మిల్లీమీటర్లు వర్షం నమోదు కావాల్సి ఉండగా, 287.7 మిల్లీమీటర్లు తక్కువగా నమోదైంది. అంటే ఏకంగా 40.8 శాతం లోటు వర్షపాతం ఉంది. రాష్ట్ర సగటు లోటు 24.8 శాతంగా ఉండగా, నెల్లూరు జిల్లాలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. సక్రమంగా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసినా, మరికొన్ని మండలాల్లో చినుకు జాడ లేకపోవడంతో భూమిలో తేమశాతం తగ్గుతోంది. వర్షాధార పంటలు సాగుచేసే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
జలాశయాల్లో తగ్గిన నీటి నిల్వలు
జిల్లా సాగునీటి అవసరాలకు కీలకమైన సోమశిల, కండలేరు జలాశయాల్లో నీటి నిల్వలు ఆశాజనకంగా లేవు. అక్టోబరు 6 నాటి గణాంకాల ప్రకారం 78 టిఎంసిల సామర్థ్యం ఉన్న సోమశిలలో 19.361 టిఎంసిల నీరు మాత్రమే ఉంది. 68.03 టిఎంసిల సామర్థ్యం కలిగిన కండలేరులో 17.077 టిఎంసిల నీరు నిల్వ ఉంది. ఈ పరిస్థితుల్లో కొత్తగా రబీ పంటలకు నీరు విడుదల చేయడం అధికారులకు సవాలుగా మారింది. జిల్లా యంత్రాంగం అందుబాటులో ఉన్న నీటిని ప్రధానంగా తాగునీటి అవసరాలు, అత్యవసర సాగునీటి అవసరాలకు కేటాయించాలని నిర్ణయించింది. కాలువల ద్వారా నీటి సరఫరాను కూడా వరాబందీ పద్ధతిలో నియంత్రించాలని భావిస్తోంది.
వరి వేయొద్దు
ప్రస్తుతం సోమశిల జలాశయంలో నీరు డెడ్ స్టోరేజ్‌లో ఉన్నాయి. రైతులు పంటలు వేస్తే నష్ట పోతారు. ఎల్‌నినో ప్రభావం వల్ల జిల్లాలో సకాలంలో వర్షాలు కురవలేదు. రైతులు సమస్యను అర్థం చేసుకొని ప్రత్యామ్నాయ పంటలనే వేయాలి.
- దేశినాయక్, ఎస్ ఈ, ఇరిగేషన్, నెల్లూరు
వర్షం పడకుంటే నష్టం
నాకు పాతిక ఎకరాలు పొలం ఉంది. వరి పంటలు వేద్దామంటే సోమశిలలో చుక్క నీరు లేకపోయే, బోరు ఉన్నా ఒకటి రెండు ఎకరాల మాత్రమే సరిపోతుంది. పంట వేయకుంటే అప్పులు ఎలా తీర్చాలో తెలియడం లేదు.
- కోటంరెడ్డి అమరేంద్ర రెడ్డి రైతు, కొడవలూరు









కామెంట్లు (0)