ఆదివారం, 13 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionనష్టాల బాటలో నర్సరీలు

1 గంట క్రితం

WhatsApp Image 2026-09-12 at 4.23.56 PM.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 13, 2026, 07:03 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

  • మిర్చి సాగుకు వెనకంజ

  • నారు అమ్ముడు పోక ఆందోళన

ప్రజాశక్తి- మాచర్ల (పల్నాడు జిల్లా) : మిర్చి సాగుకు ఈ ఏడాది ఆదిలోనే కష్టాలు ప్రారంభం అయ్యాయి. వర్షాలు కురిసి సాగు ఊపందుకుంటుందని ఆశించి లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి పెంచిన మిర్చి మొక్కలు నర్సరీల్లోనే మిగిలిపోతున్నాయి. రైతులు పొలాల్లో నాటేందుకు వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో మిర్చి మొక్కలు నిరుపయోగంగా మారాయి. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గ పరిధిలో సుమారు 200 మిర్చి నర్సరీలు ఉండగా, ఒక్క రెంటచింతల మండలంలోనే దాదాపు 80 నర్సరీలు ఉన్నాయి. వీటిలో సుమారు 80 శాతం నర్సరీలను నిర్వాహకులు లీజుకు నిర్వహిస్తున్నారు. ఏడాదికి ఎకరాకు లక్ష రూపాయలు లీజు ఉంటుంది. జూన్ నుండి డిసెంబర్ నెల వరకు మిర్చి నారును 40–45 రోజుల పాటు నర్సరీల్లో పెంచి రైతులకు విక్రయిస్తారు. ఈ ఏడాది వర్షాలు లేకపోవడంతో సాగు ఆలస్యం కావడం నర్సరీలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

​విత్తనం నుంచి మొక్క దాకా

​మిర్చి విత్తనాలను నేరుగా పొలంలో వేయకుండా ముందుగా నర్సరీల్లో పెంచడం తరువాత మొక్కలను అమ్మడం గత కొంతకాలంగా ఆనవాయితీగా వస్తోంది. నియంత్రిత వాతావరణంలో గ్రీన్‌హౌస్, నెట్‌హౌస్‌లలో కోకోపిట్, ఎరువులు, అవసరమైన పురుగుమందులు వినియోగిస్తూ ప్రో-ట్రేలు, నర్సరీ బెడ్లలో నారును పెంచుతారు. సుమారు 40–45 రోజుల తర్వాత ఆరోగ్యంగా, సమాన పరిమాణంలో పెరిగిన మొక్కలను పొలాల్లో నాటుతారు. నర్సరీల్లో పెరిగిన మొక్కల వేర్లు బలంగా తయారవ్వడంతో పొలంలో నాటిన తర్వాత భూమిలోని తేమ, పోషకాలను త్వరగా గ్రహిస్తాయి. తొలిదశలో వైరస్‌లు, తామర పురుగులు, పేనుబంక, వేరుకుళ్లు వంటి సమస్యల నుంచి మొక్కలకు రక్షణ లభిస్తుంది. రైతులకు నారు దశలో కలుపు తీయడం, నీరు పెట్టడం, మందులు పిచికారీ చేయడం వంటి శ్రమ కూడా తగ్గుతుంది.

​ఒక్క మొక్క.. 90 పైసల నుంచి రూ.1.20

​నర్సరీ నిర్వాహకులు పెంచిన మిరప మొక్కలను రకాన్ని బట్టి ఒక్కో మొక్కకు 90 పైసల నుంచి రూ.1.20 వరకు రైతులకు విక్రయిస్తున్నారు. కొంతమంది రైతులు తాము ఎంచుకున్న రకం విత్తనాలను విత్తన దుకాణాల్లో కొనుగోలు చేసి నర్సరీ నిర్వాహకులకు అందిస్తారు. ఆ విత్తనాలతో నారు పెంచేందుకు ముందుగానే కొంత మొత్తాన్ని చెల్లిస్తారు.

ఇలాంటి సందర్భాల్లో ఒక్కో మొక్కకు 40 నుంచి 50 పైసల వరకు నర్సరీ నిర్వాహకులు వసూలు చేస్తారు. కోకోపిట్, ఎరువులు, పురుగుమందులు, ప్రో-ట్రేలు, నీరు, విద్యుత్తు, కూలీల ఖర్చులతో నర్సరీ నిర్వాహకులు భారీగా పెట్టుబడి పెడుతున్నారు. రైతులు సకాలంలో మొక్కలను తీసుకెళ్లకపోతే ఆ పెట్టుబడి మొత్తం నష్టంగా మారుతోంది.

​సగం మొక్కలే అమ్ముడయ్యాయి

​నర్సరీలో 40 నుంచి 45 రోజులు పెరిగిన తర్వాత రైతులు మొక్కలను తీసుకెళ్తారు. ఈ ఏడాది మాత్రం నారు 60, 70 రోజులు దాటినా రైతులు తీసుకెళ్లడం లేదు. కొన్ని నర్సరీల్లో మొక్కలు 70–80 రోజుల వయస్సుకు చేరుకున్నాయి. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే వాటిని తొలగించడం తప్ప మరో మార్గం లేదని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు కురిసి సాగు ఊపందుకుంటేనే రైతులు, నర్సరీ నిర్వాహకులు నష్టం నుండి బయటపడే అవకాశం ఉంది. ఆకాశం వైపు రైతు చూస్తుండగా .. నర్సరీలో పెరిగిన నారు వైపు నిర్వాహకుల చూస్తున్నారు.

గత ఏడాదికి ఈ ఏడాదికి తేడా : హార్టికల్చర్ ఆఫీసర్ శ్రీధర్ రెడ్డి.

​గత ఏడా తో పోలిస్తే ఈ ఎడాది మిర్చి సాగులో వ్యత్యాసం కనబడుతున్నదని హార్టికల్చర్ ఆఫీసర్ శ్రీధర్ రెడ్డి అన్నారు. మాచర్ల హార్టికల్చర్ ఆఫీస్ పరిధిలోని మాచర్ల, వెల్దుర్తి, దుర్గి, మండలాల పరిధిలో గత ఏడాది 16500 ఎకనాలలో మిర్చి సాగు చేయగా, ఏడాది ఇప్పటివరకు సుమారుగా 15 000 ఎకరాలలో మిర్చి సాగు నమోదు అయినదని తెలిపారు.

​​రూ.15–20 లక్షల నష్టం తప్పదేమో! : - గాదె బ్రహ్మారెడ్డి, *నర్సరీ నిర్వాహకుడు, రెంటచింతల

​“ఈ ఏడాది రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు నష్టం వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ముందుగా పెంచిన మొక్కలకు ఇప్పుడు కాయలు కూడా వస్తున్నాయి. అయినా రైతులు వాటిని తీసుకెళ్లేందుకు ముందుకు రావడం లేదు. దీనికి ప్రధాన కారణం వాతావరణ పరిస్థితులే. ఇప్పటికైనా వర్షాలు కురిస్తే పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. లేకపోతే నష్టం మరింత పెరుగుతుంది.”

తొలగించాల్సిన పరిస్థితి : - మల్లెల నరసింహారెడ్డి, *నర్సరీ నిర్వాహకుడు, రెంటచింతల

​ ​“ఆరు ఎకరాల్లో నర్సరీ నిర్వహిస్తున్నాం. ఈ ఏడాది పెంచిన మొక్కల్లో సగం మాత్రమే రైతులు తీసుకెళ్లారు. ప్రతి సంవత్సరం ఈ సమయానికి మొదటి విడత నారు మొత్తం విక్రయమై, రెండో విడత నారు పెంచడం ప్రారంభిస్తాం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మండలంలోని పలు గ్రామాల రైతులు నారు పెంచేందుకు విత్తనాలు ఇచ్చారు. అవి పెరిగి 60–70 రోజులు అవుతున్నా రైతులు తీసుకెళ్లడం లేదు. వాటిని పెంచేందుకు మేమే పెట్టుబడి పెట్టాం. ఇక వయసు దాటిన మొక్కలను తొలగించాల్సిందే. పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.”

వర్షం వస్తుందనే ఆశతో..: ​- రామావత్ పెద్ద సైదా, మల్లవరం

వర్షాలు కురుస్తాయనే నమ్మకంతోనే మిర్చి సాగు చేస్తున్నాం. నెల రోజుల క్రితం ఒక్కో మొక్కకు రూ.1.20 చొప్పున కొనుగోలు చేసి మూడు ఎకరాల్లో నాటాను. అక్కడక్కడా మొక్కలు చనిపోతే వాటి స్థానంలో మళ్లీ నారు కొనుగోలు చేసి నాటుతున్నాను. వర్షాలు పడితే పంట నిలబడుతుందనే ఆశ ఉంది.


​బోరు నీటితో పంటను కాపాడుకుంటున్నాం : - ముత్తిన కోటిరెడ్డి, ముత్యాలంపాడు

మూడు ఎకరాలు సొంతంగా, మరో మూడు ఎకరాలు కౌలుకు తీసుకుని మిర్చి సాగు చేస్తున్నాను. బోరు నీటితో పంటను కాపాడుకుంటున్నాం. ప్రస్తుతం వర్షాలు లేకపోయినా బోర్ల ద్వారా నీరు అందుతోంది. ఇలాగే వర్షాలు లేకపోతే భూగర్భ జలాలు తగ్గి బోర్లు ఎండిపోయే ప్రమాదం ఉంది. అలా జరిగితే పంటను కాపాడుకోవడం కష్టం. రైతుగా పంట పండించడంలో మా ప్రయత్నం మాది.. మిగతాదంతా దైవాధీనమే.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్