-మంచినీళ్లనూ ముట్టుకోనీయని అధికారులు
-ఒడిశాలో కలవబోమని తెగేసి చెప్పినందుకు శిక్ష
-సరిహద్దు గ్రామాల్లో గిరిజనుల దుస్థితి
ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి : శ్రీకాకుళం జిల్లా మందస మండలంలోని పలు ఒడిశా సరిహద్దు గ్రామాల ప్రజలకు ఒడిశా ప్రభుత్వం, అధికారులు చుక్కలు చూపుతున్నారు. సాబకోట పంచాయతీ పరిధిలోని మాణిక్యపట్నం గిరిజనులు ఒడిశా అధికారులు, పోలీసుల వేధింపులకు గురవుతున్న సంగతి తెలిసిందే. ఇదే పంచాయతీ పరిధిలోని మధ్యకొల గ్రామస్తులు అంతకంటే తీవ్రమైన పరిస్థితులనే ఎదుర్కొంటున్నారు. రెవెన్యూ రికార్డుల్లో సాబకోట పంచాయతీ పరిధిలోని మధ్యకొల గ్రామం ఎపి సరిహద్దులో ఉన్నట్టు చూపుతున్నా అధికారులు ఇక్కడి ప్రజలను ఒడిశాలో కలవాలని నిరంతరం ఒత్తిడి చేస్తున్నట్టు తెలిసింది. గ్రామంలో సుమారు 15 గిరిజన కుటుంబాలు ఉన్నాయి. 2018 వరకు ఈ గ్రామాలు ఎపిలోనే ఉన్నాయి. అప్పట్లో గజపతి జిల్లా కలెక్టర్ గ్రామాన్ని సందర్శించి ఒడిశాలో ఉండాలని, ప్రభుత్వపరంగా అన్ని రకాలు సాయం అందిస్తామంటూ హామీ ఇచ్చినట్టు తెలిసింది. ఆ తర్వాత అక్కడకి వెళ్లిన తర్వాత కొందరు రెవెన్యూ అధికారులు వచ్చి బెదిరింపులకు పాల్పడంతో ఇందులో తొమ్మిది కుటుంబాలు ఒడిశాతో ఉండటానికి అంగీకరించాయి. వారి కోసం అక్కడ అంగన్వాడీ కేంద్రం, మంచినీటి బోరు తవ్వించింది. ఒడిశాతో ఉండటానికి అంగీకరించని మరో ఆరు కుటుంబాలకు అక్కడి నీటిని వాడుకోవడానికీ వీల్లేదంటూ ఆంక్షలు విధించింది. దీనిపై ఇక్కడి అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులను గిరిజనులు కలిసి అనేకసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో వారే తమ సొంత ఖర్చుతో ఊట బావి తవ్వుకుని నీటిని వాడుకుంటున్నారు. మధ్యకొలలోని అంగన్వాడీ కేంద్రానికి చిన్నారులను రానీయకపోవడంతో రెండు కిలోమీటర్ల పరిధిలోని సాబకోటకు పంపుతున్నారు.
పోటాపోటీగా రోడ్ల నిర్మాణాలు
మందస మండలంలోని ఎపి పరిధిలోకి వచ్చే పలు గ్రామాల్లో ఎపి ప్రభుత్వం రోడ్లు నిర్మిస్తుంటే అక్కడ గెడ్డలపై ఒడిశా కల్వర్టులను నిర్మిస్తోంది. బుడార్శింగి పంచాయతీ పరిధిలోని గుడ్డికోల గిరిజన గ్రామంలో 40 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఎపి ప్రభుత్వం మందస నుంచి ఈ ప్రాంతానికి 2023లో రోడ్డును నిర్మించింది. ఇదే గ్రామం నుంచి ఒడిశాలోని బిల్లుగ గ్రామం వరకు ఐదు కిలోమీటర్ల మేర రోడ్డును ఒడిశా ప్రభుత్వం ఈ ఏడాది సెప్టెంబరులో రోడ్డు వేసింది. దీంతోపాటు గ్రామ సమీపంలోని ఓ గెడ్డపై ఒడిశా ప్రభుత్వం వంతెన నిర్మించింది.
ఎపిలో ఎన్నికలు వస్తే వాలిపోతున్న ఒడిశా పోలీసులు
ఎపిలో ఏ ఎన్నికలు వచ్చినా ఒడిశా పోలీసులు వచ్చి వాలిపోతున్నారు. ఇటీవల ఎపిలో నిర్వహించిన పరిషత్ ఎన్నికల్లో ఓటేయడానికి వెళ్లొద్దంటూ అధికారులు, పోలీసులు ఈ గ్రామానికి వచ్చి హెచ్చరించినట్టు అక్కడి గిరిజనులు చెప్తున్నారు. దీంతోపాటు ప్రతి కుటుంబానికీ 50 కేజీల బియ్యం, రూ.2,500 ఇచ్చినట్టు తెలిసింది. బుడర్శింగి గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి వెళ్లే దారిలో పోలీసులు కాపాలాకాయడంతో కొందరు వేరేదారిలో వెళ్లి ఓటు వేశారు. పోలీసుల బెదిరింపులతో ఓటువేయడం సాధ్యం కాలేదని మరికొందరు గిరిజనులు చెప్తున్నారు. అటు సాబకోట పంచాయతీ మధ్యకొల గ్రామ గిరిజనులకూ అదే పరిస్థితి ఎదురైంది. మరికొద్ది రోజుల్లో సర్పంచ్ ఎన్నికలు జరుగుతుండటంతో ఏ క్షణంలో పోలీసులు వస్తారోనని గిరిజనులు ఆందోళన చెందుతున్నారు.
మంచినీళ్లు వాడొద్దని ఆంక్షలు
మా గ్రామానికి తరచూ ఒడిశా అధికారులు వస్తున్నారు. ఒడిశాతో ఉండాలని చెప్తున్నారు. రేషన్ కార్డులు, ఆధార్, ఓటరు కార్డు అన్నీ ఎపిలో ఉన్నాయి. మేం ఆంధ్రాలోనే ఉంటామని చెప్పాం. దీంతో, మా గ్రామంలో ఒడిశా ప్రభుత్వం ఏర్పాటు చేసిన బోరు నీటిని వొడొద్దని ఆంక్షలు పెట్టింది. మేం సొంత డబ్బులతో ఊట బావిని తవ్వుకుని నీటిని వాడుకుంటున్నాం.
- సవర మల్లేసు, మధ్యకొల గ్రామం
నెల రోజుల కిందట సర్వే చేశారు
మా గ్రామానికి నెల రోజుల కిందట ఒడిశా అధికారులు వచ్చి సర్వే చేశారు. పోలీసులు మాత్రం ఎపిలో ఎన్నికలయినప్పుడల్లా మా గ్రామానికి వచ్చేస్తున్నారు. ఎపిలో ఓటేయడానికి వెళ్లొద్దంటూ చెప్తున్నారు. పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు వస్తుండటంతో ఏ క్షణంలో వస్తారోనన్న భయంగా ఉంది.
- సవర బికారి, మధ్యకొల గ్రామం











కామెంట్లు (0)