ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం.. అధికారంలో ఉన్నప్పుడు నిర్బంధం... ఇదీ ఆంధ్రప్రదేశ్‌లో పాలకవర్గ పార్టీలు అనుసరిస్తున్న నైజం. రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్రలో తొలి ప్రభుత్వం ఏర్పాటు చేసిన టిడిపి ఐదేళ్ల పాలన యావత్తూ ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు, ఉద్యోగుల నిరసనలు, పోరాటాలు, ఆందోళనలపై కత్తికట్టినట్లు వ్యవహరించింది. అనంతరం వచ్చిన వైసిపి.. టిడిపి కంటే నాలుగాకులు ఎక్కువ చదివి ప్రజాందోళనలపై ఉక్కుపాదం మోపింది. తిరిగి కొలువుతీరిన టిడిపి కూటమి సర్కార్ రెండేళ్లల్లోనే నిరంకుశ పోకడలకు పదును పెట్టింది. ప్రభుత్వ నిర్బంధాలకు పారాకాష్ట మొన్న ఆదివారంనాడు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై ప్రయోగించిన ఖాకీ దమనకాండ. పెండింగ్ సమస్యలను పరిష్కరించమని కోరడమే ఉద్యోగులు చేసిన అతిపెద్ద మహాపరాధం. ‘చలో విజయవాడ’ జరగనీకుండా ఊళ్లల్లో అటకాయింపులు, ముందస్తు నిర్బంధాలు, సంఘం నాయకుల సస్పెన్షన్లు, బెదిరింపులు, విజయవాడలో అమానవీయ పోలీస్ లాఠీఛార్జీలు, మహిళా ఉద్యోగులపై అమానుష, దురుసు ప్రవర్తన ప్రభుత్వ అణచివేత చర్యల్లో కొన్ని మాత్రమే. పాలనలో భాగమైన తమ ఉద్యోగులతో కనీస మాత్రపు సంప్రదింపులు లేకుండా 46 మందిపై కేసుల బనాయింపునకు ఉపక్రమణ ప్రభుత్వంలో అసహన స్థాయిని ఆవిష్కరిస్తుంది. చలో విజయవాడకు ఎవరెవరు వెళ్లారు, విజయవాడ ఆందోళనలో పాల్గొన్నవారిని గుర్తించాలని జిల్లా అధికారులను ప్రభుత్వం ఆదేశించినట్లు వార్తలొస్తున్నాయి.
డిఎస్‌సి ఆందోళనలు
2025- మెగా డిఎస్‌సి నియామకాల్లో స్పోర్ట్సు కోటాలో అక్రమాలు జరిగయని, సమగ్ర విచారణ జరిపి నిజా నిజాలు వెలికితీసి అభ్యర్ధులకు జరిగిన అన్యాయాలను సరి చేయాలన్న డిమాండ్‌పై విజయవాడలో వైసిపి, అభ్యర్ధులు నిర్వహించిన ఆందోళన ఉద్రిక్తతలకు కారణమైంది. ఇక్కడా అభ్యర్ధులపై నిర్బంధం, పోలీసుల దాష్టీకాలు, దాడులు అభ్యంతరకరం. పోటీగా అధికారపార్టీ ఆందోళనలు, దాడులు, తమ అనుకూల అభ్యర్ధుల మోహరింపులు ఉద్యోగార్ధులపై ప్రభుత్వం నెరపిన సంగ్రామం తప్ప సమస్య పరిష్కారానికి ఏ విధంగానూ తోడ్పడదు. కర్నూలులోనూ ఇలాంటి పోటీ బలప్రదర్శనలకు అధికారపార్టీ పాల్పడి ఉద్యోగ ఎంపికలో అన్యాయం జరిగిందని మధన పడుతున్న యువకులపై పోలీస్ చర్యలకు కారణమైంది.
కాకినాడలో దారుణం
ప్రభుత్వమే పోలీస్‌శాఖలో 20 వేల ఖాళీలున్నాయని వెల్లడించగా, జాబ్ క్యాలండర్‌లో 1,600 పోస్టులే భర్తీ చేస్తామనగా, అన్ని ఖాళీలూ భర్తీ చేయాలని కాకినాడలో యువత చేపట్టిన ఆందోళనపై పోలీసులు విచక్షణారహితంగా ప్రవర్తించి అణచివేసేందుకు యత్నించడం దుర్మార్గం. ఆందోళనకు మద్దతిచ్చిన సిపిఎం, ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ నేతల ముందస్తు అరెస్టులు, బైండోవర్ సహా అక్రమ కేసులు ప్రభుత్వ ఉక్కుపాదానికి నిదర్శనాలు. కోచింగ్ సెంటర్ నిర్వాహకుడిపై కేసు పెట్టడం దారుణం.
వెలిగొండ నిర్వాసితులపై అమానుషం
వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులు తమకు న్యాయమైన సహాయ, పునరావాసం కల్పించాలని కలెక్టరేట్ వద్ద చేసిన ధర్నాపై పోలీసులు విచక్షణారహితంగా విరుచుకుపడ్డారు. అరెస్టులు, లాఠీలతో ప్రతాపం చూపించారు.
ఆగస్టు 31న ముఖ్యమంత్రి ప్రాజెక్టు ప్రారంభానికి వస్తున్నారంటూ అంతకు ముందురోజుల నుంచే సిపిఎం, ప్రజాసంఘాల నేతలను హౌస్ అరెస్టులతో నిర్బంధించారు. తమకు స్టయిఫండ్ పెంచాలని తిరుపతిలో శాంతియుతంగా ధర్నా చేసి తిరిగి వస్తున్న పారామెడికల్ విద్యార్థినీ విద్యార్థులపై పోలీసులు అమానవీయంగా ప్రవర్తించి దాడి చేసి అరెస్టులు చేశారు. పోరాటానికి మద్దతిచ్చిన ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ, ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టారు. సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ సెంటర్ల పేరిట మారికవలసలో గురుకుల పాఠశాలను ఉన్నపళాన తరలిస్తుండటంతో పాడేరులో నిరసన చేపట్టిన గిరిజన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, గిరిజన సంఘం, కెవిపిఎస్, ప్రజాసంఘాల నాయకులపై పోలీసులు యుద్ధం చేసినంతపని చేశారు. ఏలూరు జిల్లాలో సిపిఎం నాయకులు, కార్యకర్తలపై రౌడీషీట్ పేరిట వేధించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆగస్టు 10న నిర్వహించిన ‘జైల్ భరో’పైనా పోలీసులు దురుసుగా వ్యవహరించారు... గడచిన నెలన్నర వ్యవధిలో ప్రజాందోళనలపై ప్రభుత్వ అణచివేతకు ఈ సంఘటనలు తార్కాణం. ప్రభుత్వం ప్రజాందోళనలను, నిరసనలను, ప్రశ్నించడాన్ని సహించలేకపోతోందని వీటి ద్వారా అర్థమవుతుంది. ర్యాలీలు, సమావేశాల వంటి ప్రజల సామూహిక వ్యవహారాలపై నిషేధం విధించే పోలీస్ యాక్ట్‌లోని సెక్షన్ 30, ఒక నిర్దిష్ట ప్రాంతంలో, అదీ కొంత కాలానికి పరిమితమవుతుంది. కానీ విజయవాడ, రాజధాని అమరావతి, కొన్ని ఇతర ప్రాంతాల్లో సంవత్సరంలో 365 రోజులూ ఆంక్షలు విధించడం గత వైసిపి, నేటి టిడిపి ప్రభుత్వాల్లో ఒక సంప్రదాయంగా మారింది. ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయాలు పలు రూపాల్లో వ్యక్తమవుతూ ఉంటాయి. నిరసనలు, ఆందోళనలు, ప్రభుత్వ విధానాలపై ప్రశ్నలు ఉంటాయి. ఏలికలు వాటన్నింటికీ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మొత్తానికే నిరసన, ఆందోళన, వ్యతిరేక అభిప్రాయం పట్టలేకపోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం. ప్రతిపక్షం ఆందోళనలు చేయకూడదనడం అంటే తామొక్కరమే ఉండాలనుకోవడమే. ఈ ధోరణి అంతిమంగా నిరంకుశానికి దారి తీస్తుంది. గత వైసిపి అయినా ఇప్పటి కూటమి ప్రభుత్వం అయినా ఈ తత్వాన్ని గ్రహించాలి. పాలక పార్టీలను ప్రజాస్వామ్యబద్ధంగా పని చేయించే బాధ్యత ప్రజలదే..!







కామెంట్‌లు (0)