శనివారం, 01 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionజాతీయ క్రీడకు రాజకీయ రంగు?

18 గంటల క్రితం

dilip tirkey.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 01, 2026, 07:42 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • హాకీ జెర్సీపై వివాదం

  • వివరణ ఇవ్వండి: హాకీ అధ్యక్షులు దిలీప్‌ ‌టిర్కే

భారతదేశంలో విద్య, చరిత్ర, సంస్కృతి వంటి అనేక రంగాలను కాషాయమయం చేసిన, చేస్తున్న బిజెపి ప్రభుత్వం ఇప్పుడు జాతీయ క్రీడ హాకీని కూడా అదే వివాదంలోకి లాగింది. దశాబ్దాలుగా భారత హాకీ జట్టుకు గుర్తింపుగా నిలిచిన నీలం జెర్సీని పక్కనబెట్టి, 2026 హాకీ ప్రపంచకప్ కోసం కాషాయాన్ని ప్రధాన రంగుగా ఎంచుకోవడం తీవ్ర చర్చకు దారితీసింది. దీనిపై భారత మాజీ కెప్టెన్‌, ఒలింపియన్ వీరెన్ రస్క్విన్హా బహిరంగంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. "భారత హాకీ వారసత్వం నీలం జెర్సీతో ముడిపడి ఉంది. అభిమానులు కూడా భారత జట్టును అదే రంగులో చూడాలనుకుంటున్నారు. మరి కాషాయం ఎందుకు?" అని ఆయన ప్రశ్నించారు. భారత హాకీ చారిత్రక గుర్తింపును కాపాడాలనే ఉద్దేశంతోనే ఈ వ్యాఖ్యలు చేశానని స్పష్టం చేశారు. "ఫుట్‌బాల్‌లో అర్జెంటీనాకు ఆకాశ నీలం-తెలుపు జెర్సీ ఎంత గుర్తింపో, భారత హాకీకి నీలం రంగు కూడా అంతే" అని పేర్కొన్నారు. ఆయన అభిప్రాయానికి పలువురు మాజీ క్రీడాకారులు, అభిమానులు కూడా మద్దతు తెలిపారు. హాకీ ఇండియా మాత్రం తన నిర్ణయాన్ని సమర్థించుకుంటోంది. కాషాయం ధైర్యం, త్యాగం, విజయానికి ప్రతీక అని, జాతీయ పతాకం, ఉదయించే సూర్యుడి స్ఫూర్తితో ఈ రంగును ఎంపిక చేశామని తెలిపింది. అయితే ఈ వివరణలు విమర్శలను చల్లార్చలేకపోయాయి. జాతీయ జట్టు గుర్తింపు కేవలం డిజైన్ లేదా మార్కెటింగ్ అంశం కాదని, దశాబ్దాల విజయాలు, ఆటగాళ్ల శ్రమ, అభిమానుల భావోద్వేగాలు కలిసే ఒక వారసత్వమని క్రీడా విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. 2019 క్రికెట్ ప్రపంచకప్‌లో భారత జట్టు ధరించిన కాషాయ ప్రత్యామ్నాయ జెర్సీ చుట్టూ కూడా ఇలాంటి వివాదమే నెలకొంది. ఇప్పుడు అదే చర్చ హాకీకి విస్తరించిందని వారు అంటున్నారు. ఆగస్టు 14 నుంచి 30 వరకు నెదర్లాండ్స్‌, బెల్జియంలో జరిగే ప్రపంచకప్‌లో భారత పురుషుల, మహిళల జట్లు ఈ కొత్త జెర్సీలతో బరిలోకి దిగనున్నాయి. ఇలాంటి సమయంలో ఆట కంటే జెర్సీ రంగే చర్చకు కేంద్రంగా మారడం భారత హాకీకి ఏమాత్రం మేలు చేసే విషయం కాదు. ఆటకు కావాల్సింది సరైన దిశ, నిధులు, మౌలిక వసతులు, ప్రతిభను ప్రోత్సహించే వ్యవస్థ; జెర్సీ రంగు మార్చడం కాదు అని క్రీడా పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

జెర్సీ రంగు మార్చడంపై వివరణ ఇవ్వాలంటూ అధ్యక్షుడు దిలీప్‌ ‌టిర్కే హాకీ ఇండియా(హెచ్‌ఐ)ను కోరారు. జెర్సీ మార్పుపై సామాజిక మాధ్యమాల్లో తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆయన పైవిధంగా స్పందించారు. జెర్సీ రంగు మార్పుపై తొలుత అనుకూలంగా స్పందించిన టిర్కీ.. తాజాగా దీనిపై వివరణ ఇవ్వాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. ‘జట్టు జెర్సీ రంగు విషయంలో జరిగిన మార్పు విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఎగ్జిక్యూటివ్‌ బోర్డు ముందు చర్చకు ఉంచకుండా, ముందస్తు సమాచారం లేకుండానే ఈ నిర్ణయం ఎలా తీసుకుంటారు. కాషాయ రంగును ఎంచుకోవడంపై ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ, కీలకమైన నిర్ణయం తీసుకొనేముందు పాలక మండలి, కార్యనిర్వాహక మండలితో చర్చించి ఉండాల్సింది. జట్టు ఎంపిక, సన్నాహాలపైనే ఉండేలా జెర్సీ మార్పు పూర్తిగా క్రీడాపరమైన నిర్ణయమని బహిరంగంగా చెప్పా. అయితే, ఈ అంశంపై వివరణ ఇవ్వాలని ఒడిశా ప్రభుత్వం కోరింది. అందుకే, ఈ నిర్ణయానికి గల కారణాలు, ప్రాతిపదిక, అనుసరించిన విధానం, దారితీసిన పరిస్థితులను వివరిస్తూ లిఖితపూర్వక వివరణను అందించాలని అధికారులను ఆదేశిస్తున్నా’ అని వెల్లడించారు.

- ఫీచర్‌ అండ్‌ ‌పాలిటిక్స్‌


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్