- శ్రావణం పేరుతో కొనుగోలు ధర తెగ్గోత
- ఇటు వినియోగదారుడిపై తగ్గని భారం
- రైతుకు ఇచ్చేది రూ.120..
- మార్కెట్లో అమ్మేది రూ.240
ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి : శ్రావణమాసంలో పౌల్ట్రీ రైతులు కుదేలు అవుతున్నారు. ఇప్పటికే మేత, నిర్వహణ ఖర్చులు అమాంతం పెరిగిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కోళ్ల పెంపకం రైతులకు శ్రావణంలో డిమాండ్ తగ్గిందన్న సాకుతో కొనుగోలు ధర భారీగా తగ్గించేశారు. కిలోకు రూ.120 మించి ఇవ్వడం లేదు. శ్రావణంలో డిమాండ్ తగ్గినా చికెన్ వినియోగదారులకు మాత్రం భారం ఏమాత్రం తగ్గడం లేదు. కిలో రూ.240 మించి అమ్ముతున్నారు. శ్రావణ మాసంలో చాలామంది మాంసాహారానికి దూరంగా ఉండటం, కొన్ని కుటుంబాల్లో వారాంతపు కొనుగోళ్లు కూడా తగ్గడం చికెన్ మార్కెట్‌పై ప్రభావం చూపుతోంది. డిమాండ్ తగ్గిన సమయంలో ఫారాల్లో సిద్ధంగా ఉన్న కోళ్లను ఎక్కువ రోజులు ఉంచితే మేత ఖర్చు మరింత పెరుగుతుంది. దీంతో రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో తక్కువ ధరలకే కోళ్లను విక్రయించాల్సి వస్తోంది. ఫారం వద్ద లైవ్ బ్రాయిలర్ ధర కేజీకి రూ.120 మించి పలకడం లేదు. దీంతో గిట్టుబాటు ధర లేక పౌల్ట్రీ రైతులు నష్టాలను చవిచూస్తున్నారు. అయితే ఫారం నుంచి బయటకు వచ్చే లైవ్ కోడి ధర కేజీకి రూ.120 లోపే ఉన్నప్పటికీ, వినియోగదారులకు మాత్రం ఆ తగ్గింపు ప్రయోజనం దక్కడం లేదు. మార్కెట్‌లో కొనుగోలు చేసే చికెన్ ధర రూ.240కి చేరింది.
పెట్టుబడి భారీ.. గిట్టుబాటు అనిశ్చితం
దేశంలోనే పౌల్ట్రీ రంగంలో రాష్ర్టానికి ప్రత్యేక స్థానముంది. దేశంలోని గుడ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ వాటా 17.85 శాతంగా నమోదైంది. పౌల్ట్రీ కార్యకలాపాలకు ఉమ్మడి తూర్పు గోదావరి ప్రాంతం ముఖ్యమైన కేంద్రం. ఈ ప్రాతంలో సుమారు 350కి పైగా పౌల్ర్టీ ఫారాలు ఉన్నాయి. కోళ్ల పెంపకంలో పిల్లల కొనుగోలు, దాణా, మందులు, విద్యుత్, షెడ్ నిర్వహణ తదితర ఖర్చులు రైతుపై భారంగా మారాయి. కోడి బరువు పెరిగే కొద్దీ మేత ఖర్చు కూడా పెరుగుతోంది. గత మేలో రాష్ట్రంలో చికెన్ రిటైల్ ధర కేజీకి రూ.350 వరకు విక్రయాలు జరిగాయి. శ్రావణమాసం ముగిసే వరకు డిమాండ్ తక్కువగా ఉండే అవకాశం నేపథ్యంలో రైతులకు నష్టాలను తగ్గించే చర్యలు అవసరమని పౌల్ట్రీ వర్గాలు కోరుతున్నాయి. ఉత్పత్తి అంచనాలు, మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా కోళ్ల పెంపకాన్ని సమన్వయం చేయడం, ధరలపై పారదర్శక సమాచారం అందించడం, మార్కెట్ పరిస్థితులపై ముందస్తు హెచ్చరికలు ఇవ్వడం వంటి చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
ప్రభుత్వం ఆదుకోవాలి
జిల్లాలో పౌల్ర్టీ రంగాన్ని ఆదుకునేందుకు తమిళనాడులోని నమక్కల్ మోడల్‌ను అధ్యయనం చేస్తున్నామని గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చింది. అది ఆచరణలో అమలు చేస్తేనే రైతులకు కొంతైనా ఊరట లభించే అవకాశం ఉంది.
- కెఆర్ చలపతి రావు పౌల్ర్టీ రైతు,* పెరవలి, తూర్పు గోదావరి జిల్లా జిల్లా.







కామెంట్‌లు (0)