- ఫీచర్స్ అండ్ పాలిటిక్స్
‘సప్తధార (ఏడు ప్రవాహాలు)’ ద్వారా 2047 నాటికి భారతదేశం వికసిస్తుందని 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని చెప్పారు. ఇలా గత 13 సంవత్సరాలుగా ఎదో ఒక కొత్త పదాన్ని ఆకర్షణీయంగా చెబుతూనే వున్నారు. ఆయన అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరం 2014లో ‘స్వచ్ఛ భారత్ అభియాన్’ (పరిశుభ్రత), జన్-ధన్ ‘మేక్ ఇన్ ఇండియా’ అన్నారు. 2015లో ‘స్టార్టప్ ఇండియా - స్టాండప్ ఇండియా’, 2016లో అవినీతి, పేదరికం, అజ్ఞానంపై పోరాటం` సామాజిక ఐక్యత, 2017లో ‘న్యూ ఇండియా’, 2018లో మహిళా సాధికారత, ఆయుష్మాన్ భారత్, 2019లో జల్ జీవన్ మిషన్, 2020లో ‘ఆత్మనిర్భర్ భారత’, 2021 పీఎం గతిశక్తి, 2022లో ‘పంచ ప్రణ’ (ఐదు ప్రతిజ్ఞలు), 2023లో అవినీతి రాజకీయాలకు వ్యతిరేక పోరాటం, 2024 ‘ఒక దేశం - ఒక ఎన్నిక’ మేడ్ ఇన్ ఇండియా, 2025లో సముద్ర మంథన్ (శక్తి స్వావలంబన), ఇప్పుడు ‘సప్తధార’.
ఈ సంవత్సరం ప్రధాని ప్రకటించిన ఏడు రంగాలు (ప్రవాహాలు) దేశాభివృద్ధికి కీలకమైనవే. అవి తయారీ శక్తి, వ్యవసాయం, ఆహార ఉత్పత్తి, సాంకేతికత` ఆవిష్కరణ, రవాణాశక్తి, రక్షణ శక్తి, హరిత ఆర్థిక వ్యవస్థ` సముద్ర ఆర్థిక వ్యవస్థ, భారతదేశ సంస్కృతి. ఈ సప్త నదులు దేశం నలుమూలల ప్రవహించి అభివృద్ధి వికసిస్తుందని జాతీయోద్యమం నాడే మన నేతలు గుర్తించారు. అందుకే స్వాతంత్య్రానంతరం ఈ రంగాలను ప్రభుత్వమే నిర్వహించాలని నిర్ణయించారు. అయితే 1990 తర్వాత కాంగ్రెసు, బిజెపి ప్రభుత్వాలు వీటిని ప్రైవేటీకరించడం కోసం పోటీ పడ్డాయి. ముఖ్యంగా మోడీ పరిపాలనా కాలంలో ఈ వేగం మరింత తీవ్రమైంది.
తయారీ రంగం గురించి మోడీ అధికారంలోకి వచ్చిన 2014 సెప్టెంబర్‌లో ‘మెక్ ఇన్ ఇండియా’ ప్రకటించి, 2024 నాటికి దేశ జీడీపీలో ఈ రంగం వాటాను 25 శాతానికి పెంచుతామన్నారు. కానీ నేషనల్ అకౌంట్స్ స్టాటిస్టిక్స్ (ఎనఎఎస్) ప్రకారం తయారీ రంగం వాటా 2014 - 15లో వున్న 11.4 శాతానికి మించి ఒక్క అంగుళం కూడా ముందుకు వెళ్ళలేదు. చిన్న, మధ్యతరహా తయారీ రంగం మీద కోట్ల మంది ఆధారపడి వున్నారు. వాస్తవ అభివృద్ధి రేటు 2014 - 15 నుండి 2012 - 23 నాటికి 5.5 శాతానికి తగ్గాయి. ఈ రంగంలో ఉద్యోగ అవకాశాలు 2011 - 12లో 12.6 శాతం వుంటే 2022 - 23 నాటికి 11.4 శాతానికి పడిపోయింది. ఈ రంగం ఇంతగా ఒట్టిపోవడానికి కారణం ఎవరు?
వ్యవసాయదారుల ఆదాయాన్ని రెండింతలు పెంచకపోగా మన దేశీయ వ్యవసాయాన్ని నిలువున ముంచే ఒప్పందాలను అమెరికా, యూరప్ దేశాలతో చేసుకున్నారు. అమెరికా ప్రభుత్వం అక్కడున్న రైతులకు వివిధ రకాల పేర్లతో సగటున సంవత్సరానికి రూ. 26,908.72 పైసలు సబ్సిడీలు ఇస్తుంది. రైతు వెన్నెముక అని చెప్పే మన ప్రభుత్వాలు కేవలం రూ. 21,56,000లు మాత్రమే సబ్సిడీలు ఇస్తున్నాయి. అమెరికా రైతుల తలసరి ఉత్పత్తి మన రైతుల కంటే 460 రెట్లు ఎక్కువ. ఇలాంటి బలమైన అమెరికా వ్యవసాయ ఉత్పత్తులను సంవత్సరానికి 100 బిలియన్ డాలర్ల (రూ.9,56,000 కోట్లు) చొప్పున ఐదు సంవత్స రాలు దిగుమతి చేసుకోవడానికి మోడీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుని వ్యవసాయన్ని మరింతగా ఎండబెట్టి ‘భారతీయ సంప్రదాయ ఆహారాలు, చిరుధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు, పండ్లు, పూలను అంతర్జాతీయ బ్రాండ్‌లుగా తీర్చిదిద్దాలని’ ప్రధాని ఇచ్చిన పిలుపునకు విలువేముంటుంది?
సాంకేతికత, ఆవిష్కరణలో భాగంగా ఏఐ, క్వాంటం, అంతరిక్షం, రోబోటిక్స్, డేటా సెంటర్లు లాంటి అభివృద్ధి చెందుతున్న రంగాల గురించి ప్రధాని మాట్లాడారు. ఈ రంగాల్లో మన పక్కనున్న చైనాతో పాటు అనేక వర్ధమాన దేశాలు వేగంగా అభివృద్ధి సాధిస్తున్నాయి. మన దేశం కూడా అలాంటి పురోగతి సాధించాలని ప్రతి భారతీయుడు కోరుకుంటాడు. కానీ ఈ ఆధునిక సాంకేతికరం గాలను ప్రభుత్వం నిర్వహిస్తుందా, విదేశీ, స్వదేశీ కార్పొరేట్ కంపెనీలా అన్నదే అసలు ప్రశ్న. భూమి, నీరు, మానవశ్రమ తేలికగా ఈ కంపెనీలకు అందించడం ద్వారా కొందరు వ్యక్తులు (బిలియనర్స్) బలపడుతూ దేశంలో ఎన్నడూ లేని ఆర్థిక అసమానతలు పెరిగిపోయాయి.
రవాణా నాగరికతకు చిహ్నం. నగరాలను కలిపే హైస్పీడ్ రైళ్లు, ఆధునిక జాతీయ రహదారులు, అంతర్గత జలమార్గాలు, విమానాశ్రయాలు, బహుళ రవాణా వ్యవస్థల పేరుతో లక్షల కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం, 47 శాతం ప్రజలున్న గ్రామీణ రవాణా దుస్థితిని పట్టించుకోవడంలేదు. రైల్వేలో అత్యధికమంది ప్రయాణించే జనరల్ బోగీలతో పాటు, స్లీపర్ కోచ్‌ల పరిస్థితి కడుదయనీయంగా వుంది.
రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ఈ రంగంలోకి విదేశీ పెట్టుబడులకు ద్వారాలు బార్లా తెరచి స్వయంవృద్ధి ఎలా సాధించగలం? ఇజ్రాయిల్, అమెరికా లతో మోడీ ప్రభుత్వ సైనిక స్నేహం పొరుగుదేశాలతో పాటు ప్రపంచంలో మనం ఒంటరికావడానికి కారణమవుతుంది. సైనిక రంగం ఎదుర్కొంటున్న నిజమైన సమస్యలను మన దేశ మాజీ సైనిక ఉన్నత అధికారులు వివిధ సందర్భాల్లో ప్రభుత్వం దృష్టికి తెస్తూనేవున్నారు. వాటి గురించి పట్టించకోకపోగా, సైన్యంలో కూడా అగ్నిపథ్, అగ్నివీర్ లాంటి కాంట్రాక్టు విధానాన్ని అమలులోకి తెచ్చింది మోడీ ప్రభుత్వమే కదా?
హరిత ఆర్థిక వ్యవస్థ, సముద్ర ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి కావాలని ప్రధాని ఆకాంక్షించారు. మన దేశానికి ఉన్న సుదీర్ఘ తీర ప్రాంతం, సహజమైన అడవులు అభివృద్ధికి పెద్ద అవకాశాలు. అయితే వీటిని కార్పొరేట్ కంపెనీలకు అప్పగించేందుకు చట్టాలను మార్చివేస్తున్నారు. మన దేశానికి చుట్టుపక్కల దేశాల మధ్య 15,160 కి.మీ సరిహద్దు రేఖ ఉంది. సరిహద్దు రేఖ నుండి 100 కి.మీ లోపలి ప్రాంతాన్ని ఎకో టూరిజం పేరుతో కార్పొరేట్ కంపెనీలకు అప్పగించేందుకు అటవీ రక్షణ చట్టానికి సవరణలు చేసింది ఎవరు? నికోబార్ దీవుల్లో, అబుస్‌మడ్ అటవీ ప్రాంతంలో లక్షల చెట్లను నరికి వేయడానికి అవకాశం ఇచ్చి పర్యావరణాన్ని ప్రమాదంలో వేసింది ఎవరు?
భారతదేశం ఐక్యంగా నిలబడడానికి కీలకమైంది బహుళత్వం. విభిన్న ఆచారాలు, సాంప్రదాయాలు, మతాలు, భాషలు కలిసి సహజీవనం చేయడం మన దేశ సంస్కృతి అంతటి గొప్ప సంస్కృతికి పాలకులు వారి అనుచర గణం నుండే కదా తీవ్ర సవాళ్ళు ఎదరవుతున్నది. ‘మన సాంస్కృతిక విశిష్టతలను ప్రపంచానికి చాటిచెప్పాల’ని ప్రధాని ఇచ్చిన పిలుపు అమలు కావాలంటే వారిని కదా నిరోధించాల్సింది. యోగా, ఆయుర్వేద రంగాల్లో మన దేశానికి ఉన్న ప్రత్యేకతను సంకుచితమైన రాజకీయ, మత ప్రయోజనాలకు వాడుకోవడం ఆపకుండా వీటి ప్రత్యేకతలను కాపాడుకోలేము.
మంచి అంటే ?
మంచి అబ్బాయిలూ, మంచి అమ్మాయిలుగా ఉండమని నవతరానికి ప్రధాని పిలపునిచ్చారు. శాస్త్రీయ విజ్ఞానంతో తర్కించుకుని నిజాన్ని మాట్లాడడం, అన్యాయాన్ని ఎదిరించడం, తమకు కావలసింది ఏమిటో సూటిగా ప్రకటించడమే మంచి అయితే ఆ పనే కదా నేటి యువతరం చేస్తుంది. అదికాకుండా అంధవిశ్వాసాలకు, మూఢనమ్మకాలకు తలొగ్గడం, తరాల నాటి వివక్షను కొనసాగించడమ ‘మంచి’ అయితే ఈ తరం దానిని ఖచ్చితంగా తిరస్కరిస్తుంది. 12 ఏళ్ళ పాలన ముగిసిన తర్వాత కూడా అచ్చేదిన్ ఎక్కడుందో వెతుక్కుంటున్న యువతను ‘వికసిత్ భారత్`2047’ ఎండమావులు సంతృప్తి పరచవని పాలకులు గుర్తించాలి.






కామెంట్‌లు (0)