సోమవారం, 17 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

స్థానిక చరిత్రకు అక్షర మకుటం

1 గంట క్రితం

book review
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 17, 2026, 05:00 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

స్వాతంత్ర్యోద్యమం ఒక మహోద్యమం. అది ఒక ప్రాంతానికో, ఒక కులానికో, ఒక మతానికో, ఒక జెండర్‌కో పరిమితమైనది కాదు. ఆసేతు హిమాచలాన్ని కదిలించి భారతీయులందరినీ ఒకే త్రాటిపై నడిపించిన ఒక ఝంఝామారుతం. ఎందరో మహనీయుల పోరాట ఫలంగా అది భారతీయులకు దక్కింది. అయితే జాతీయస్థాయిలో ప్రసిద్ధి చెందిన ఉద్యమాలు, నాయకుల గురించి మనకు తెలిసినంతగా చిన్న పట్టణాలు, గ్రామాల్లో జరిగిన పోరాటాల గురించి తెలియదు. అనేక ప్రాంతీయ చరిత్రలు ఇంకా చరిత్ర పుటల్లోకి ఎక్కించాల్సిన అవసరం ఉంది. ఆ అవసరాన్ని గుర్తించిన వంగలపూడి శివకృష్ణ ఇంతకు ముందు "చారిత్రక పెద్దాపురం కథలు-గాథలు" అనే విలువైన గ్రంథాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు సామర్లకోట, పెద్దాపురం ప్రాంతాల స్వాతంత్ర్యోద్యమ చరిత్రకు అక్షరరూపం ఇచ్చారు. ఈ గ్రంథం ఒక ప్రాంత చరిత్రను నమోదు చేయడమే కాదు, స్థానిక చరిత్రను వెలికితీసే అవసరాన్ని కూడా గుర్తు చేస్తుంది.

వాస్కోడిగామా భారతదేశానికి సముద్రమార్గం కనుగొన్న తరువాత వాణిజ్యం కోసం వచ్చిన పాశ్చాత్యులు క్రమంగా రాజకీయ ఆధిపత్యాన్ని సాధించి బ్రిటిష్ పాలనకు దారితీశారు. పెద్దాపురం, సామర్లకోట ప్రాంతాలపై నియంత్రణ సాధించిన బ్రిటిష్ వారు సామర్లకోటను కీలక సైనిక స్థావరంగా అభివృద్ధి చేశారు. ఈ ప్రాంత చరిత్రను వెలికి తీయడానికి శివకృష్ణ అప్పటి ఆంగ్ల వార్తాపత్రికలు, లేఖలు, మద్రాసు ఆర్మీ రికార్డులు, చర్చి రిజిస్టర్లు, సైనిక గెజెట్లు, అధికారిక ఉత్తర్వులు వంటి అనేక ఆధారాలను పరిశీలించారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా బ్రిటిష్ అధికారులే తిరుగుబాటు చేసిన సంఘటన కూడా ఈ ప్రాంత చరిత్రలో ఉంది. నాటి మద్రాస్ గవర్నర్ సర్ జార్జ్ బార్లో వ్యయ నియంత్రణ చర్యలకు వ్యతిరేకంగా జరిగిన ఆ తిరుగుబాటు కెప్టెన్ జేమ్స్ ప్యాటర్సన్ నేతృత్వంలో సామర్లకోటలోనూ జరిగింది. అలాగే గంజాయి, నల్లమందు వంటి మత్తు పదార్థాల వ్యతిరేకంగా సామర్లకోట వేదికగా సామాజిక సంస్కర్తలు, మిషనరీలు నిర్వహించిన మహాసభల వివరాలు కూడా ఈ గ్రంథంలో ఉన్నాయి. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఈ ప్రాంతం నుంచి తొలి సవాళ్లు విసిరిన వారిలో తోటపల్లి ఎస్టేట్ పాలకుడు జగ్గప్పదొర ఒకరు. బ్రిటిష్ అధికారి ఆదేశాన్ని ధైర్యంగా తిరస్కరించిన ఆయన గురించి చాలామందికి తెలియదు. అలాగే 1879 రంప పోరాటంలో బ్రిటిష్ పాలనకు సవాల్ విసిరిన ద్వారబంధాల చంద్రయ్య గురించి కూడా ఈ గ్రంథం కొత్త సమాచారాన్ని అందిస్తుంది. ​

సామర్లకోటకు చెందిన ప్రతివాది భయంకర వెంకటాచారి స్వాతంత్ర్యోద్యమంలో విప్లవ మార్గాన్ని ఎంచుకొని అండమాన్ సెల్యులార్ జైలులో శిక్ష అనుభవించిన అరుదైన తెలుగు స్వాతంత్ర్య సమరయోధుడు. 1933 బాంబు కేసులో ఆయనతో పాటు పలువురు సామర్లకోట యువకులు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడారు. వారి వివరాలను కూడా శివకృష్ణ పరిశోధించి నమోదు చేశారు. సామర్లకోట, పెద్దాపురం, ఉప్పాడ, లింగంపర్తి, ర్యాలి తదితర ప్రాంతాలకు చెందిన అనేకమంది స్వాతంత్ర్య సమరయోధుల వివరాలు కూడా ఈ గ్రంథంలో ఉన్నాయి. 1924 మే 13న సామర్లకోటలో చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 150 మంది మహిళలతో జరిగిన సమావేశం, దువ్వూరి సుబ్బమ్మ, ఉప్పెర్ల బుల్లెమ్మ తదితరుల భాగస్వామ్యం, వేదాంతం కమలాదేవి వంటి మహిళల పోరాటం ఈ ప్రాంత మహిళల్లో స్వదేశీ చైతన్యం ఎంతగా వ్యాపించిందో తెలియజేస్తాయి.

మహాత్మాగాంధీ 1921 నుంచి 1946 వరకు అనేక పర్యాయాలు సామర్లకోట, పెద్దాపురం వచ్చారు. పెద్దాపురంలో ముప్పన సోమరాజు, వీర్రాజు సోదరుల బంగాళాలో బస చేసి, మరునాడు జరిగిన సభలో ప్రసంగించారు. గాంధీజీతో పాటు నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్, బాబూ రాజేంద్రప్రసాద్, సరోజినీనాయుడు వంటి అనేకమంది జాతీయ నాయకులు సామర్లకోటకు వచ్చిన వివరాలను కూడా శివకృష్ణ పత్రాధారాలతో నమోదు చేశారు. ఎవరు ఎప్పుడు వచ్చారు, ఎక్కడ బస చేశారు, ఎక్కడ ప్రసంగించారు వంటి వివరాలు ఈ గ్రంథంలో ఉన్నాయి. అల్లూరి సీతారామరాజుతో పెద్దాపురానికి ఉన్న సంబంధాన్ని కూడా శివకృష్ణ ఆధారాలతో వివరించారు. అల్లూరికి తుపాకీ శిక్షణ ఇచ్చిన షేక్ మదీనా పెద్దాపురం వాసి కావడం, అల్లూరి మిత్రులు, అనుచరుల్లో ఈ ప్రాంతానికి చెందినవారు ఉండటం వంటి అంశాలు ఈ సంబంధాన్ని తెలియజేస్తాయి. దేవులపల్లి కృష్ణశాస్త్రి పెద్దాపురం లూథరన్ హైస్కూలులో పనిచేసిన కాలం, ఆయన రచించిన "జయజయజయ ప్రియభారత జనయిత్రీ దివ్యధాత్రి" గేయం ఈ ప్రాంత చరిత్రకు సాహిత్య సంబంధాన్ని కూడా చూపిస్తాయి. బ్రిటిష్ పాలనలో దేశభక్తి కార్యక్రమాల్లో పాల్గొన్న నాయకులు, విద్యార్థులు, న్యాయవాదులపై రాజద్రోహం కేసులు పెట్టడం, పెద్దాపురం న్యాయవాదులు స్వదేశీ దీక్ష చేపట్టి ఖద్దరు దుస్తులతో కోర్టులకు హాజరుకావాలని నిర్ణయించుకోవడం వంటి వివరాలూ ఇందులో ఉన్నాయి.

శివకృష్ణ ఎన్నో గ్రంథాలను పరిశీలించి, పెద్దలను, అనుభవజ్ఞులను కలిసి, వారితో చర్చించి ఈ గ్రంథాన్ని రూపొందించారు. సామర్లకోట, పెద్దాపురం ప్రాంతాల స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో మరుగునపడిన అనేక అంశాలను ఒకచోట చేర్చి భవిష్యత్తరానికి అందించడం ఈ గ్రంథం ప్రధానమైన విలువ. స్థానిక చరిత్ర కూడా జాతీయ చరిత్రలో అంతర్భాగమేనని ఈ పుస్తకం చాటి చెబుతుంది.

​- డాక్టర్ జోస్యుల కృష్ణబాబు

98664 54340​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్