అంతరాష్ట్ర నదీ జల వివాదాలపై ఉదాసీనత
బిజెపి పెద్దలతో కూటమి ప్రభుత్వ కీలక చర్చలు?
ఒడిశా దౌర్జన్యాలపై మౌనం వెనుక ఆంతర్యమిదేనా?
ప్రజాశక్తి - పార్వతీపురం : ఆంధ్ర, ఒడిశా సరిహద్దు గ్రామాలైన కొటియాలో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు క్విడ్ ప్రో కో పద్ధతిని అవలంభిస్తున్నాయని తెలుస్తోంది. సుప్రీంకోర్టు స్టేటస్ కో (యథాతథ స్థితి) ఉత్తర్వులు అమలులో ఉన్నప్పటికీ, 90 ఏళ్లుగా వివాదాస్పదంగా ఉన్న కొటియా గ్రామాలలో ఒడిశా ఎన్ని దౌర్జన్యాలకు పాల్పడినా రాష్ర్ట ప్రభుత్వం మౌనం వహిస్తోంది. దీని వెనుక ఒక ఒప్పందం కుదుర్చుకునేందుకు కూటమి ప్రభుత్వంలోని ఓ కీలక నేత చొరవ చూపుతున్నట్లు సమాచారం. అంతరాష్ట్ర నదీ జల వివాదంలో ఉన్న జంఝావతి, పోలవరం ప్రాజెక్టుల విషయంలో ఒడిశా ఉదాసీనంగా వ్యవహరించేందుకు, ప్రతిఫలంగా కొటియా గ్రామాలను ఒడిశాకు అప్పగించే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే గత కొన్నేళ్లగా ఒడిశా ప్రజాప్రతినిధులు, అధికారులు కొటియా గ్రామాలపై పట్టు పెంచుకునేందుకు దూకుడు పెంచారు. అయినా ఆయా గ్రామాల గిరిజనులపై కొరాపుట్ జిల్లా అధికారులు ఎన్ని బెదిరింపులకు పాల్పడుతున్నా, రాష్ర్ట ఉద్యోగులను, అధికారులను గ్రామాల్లోకి రాకుండా అడ్డుకుంటున్నా టిడిపి కూటమి ప్రభుత్వం నుంచి చలనం లేదు. ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలూ లేకపోవడంతో మన్యం జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు మౌనం దాల్చాల్సి వస్తోంది.
ఒడిశాతో ముడిపడి ఉన్న పోలవరం, జంఝావతి ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో అనేక సంవత్సరాలుగా ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి రాష్ర్ట ప్రభుత్వం ముందుకెళ్ళాలంటే ఒడిశా అనుమతులు మంజూరు చేయాల్సి ఉంది. ఆ రెండు ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఒడిశా అనుమతి ఇవ్వడానికి బదులుగా వివాదాస్పద 21 కొటియా గ్రామాలను తమకు వదిలేయాలని ఒడిశా ప్రభుత్వం ప్రతిపాదనలు చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలోని ఓ కీలకనేత చొరవ చూపుతున్నట్లు తెలిసింది.
మన్యం జిల్లా అధికారుల నోటికి తాళం
ఒడిశాతో ఇచ్చిపుచ్చుకునే రహస్య ఒప్పందంలో భాగంగానే మన్యం జిల్లా అధికారుల నుంచి ఎటువంటి ఆదేశాలూ లేకపోవడంతో ఒడిశా ఎన్ని దుశ్చర్యలకు పాల్పడినా మన్యం జిల్లా అధికారులు చర్యలు తీసుకోలేని పరిస్థితి నెలకుంటోంది. ఇటీవల కొటియా గ్రామాలలో స్థానిక ఎన్నికల నిర్వహణను అడ్డుకునేందుకు ఒడిశా అన్ని రకాల ప్రయత్నాలు చేసింది. ఈ గ్రామాలకు చెందిన ఓటర్లు పోలింగ్‌కు రాకుండా ఉండేందుకు నాలుగు చోట్ల ఒడిశా ప్రభుత్వం పోలీసు అవుట్ పోస్టులు ఏర్పాటు చేసింది. ప్రధానంగా గంజాయిబద్ర పంచాయతీకి చెందిన ఓటర్లు నేరెళ్ళవలసలో పోలింగ్ కేంద్రానికి రాకుండా పెద్ద ఎత్తున పోలీసులను మొహరించింది. కొరాపుట్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే లు, ఎంపిలు, అఖిలపక్ష నాయకులు నేరేళ్ళవలసలో మకాం వేశారు. నెల్కో ఆర్థిక సహకారంతో ఇతర ప్రాంతాల నుంచి కిరాయి మనుషులను రప్పించి దౌర్జన్యానికి పాల్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మన్యం జిల్లా అధికారులు సంయమనం పాటించారు. జెసి వైశాలి కొరాపుట్ జిల్లా సబ్ కలెక్టర్, ఎమ్మెల్యేలతో చర్చలు జరపడానికి వెళ్లి వారి డిమాండ్ కు తలొగ్గిన పరిస్థితి కనిపించింది. అనేక ఏళ్లుగా ఉన్న నేరెళ్ళవలస పోలింగ్ కేంద్రాన్ని కిలోమీటరు దూరంలో వున్న సారిక గ్రామానికి తరలించారు. కొటియా గ్రామాల గిరిజనులు ఎన్ని ఒత్తిడులకు గురవుతున్నా మన్యం జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు నిస్సహాయ స్థితిలో ఉండిపోవాల్సిన పరిస్థితి వస్తోంది. గొడవలు జరుగుతున్న ప్రతిసారీ పోలీసులు సైతం తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు.
పంచాయతీ ఎన్నికలనూ ఒడిశా అడ్డుకునే అవకాశం
కొటియా గ్రామ పంచాయతీలలో ఎపి ప్రభుత్వం ఈ నెలలో నిర్వహించనున్న పంచాయతీ ఎన్నికలను కూడా ఒడిశా అడ్డుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈనెల 16 నుంచి జిల్లాలో రెండు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరుగనున్నాయి. రెండో విడతలో ఈనెల 29న పార్వతీపురం డివిజన్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇంత వరకు పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ కేంద్రాలు ఐదు కొటియా పంచాయతీ కేంద్రాలలోనే ఎపి ప్రభుత్వం నిర్వహించింది. పట్టు చెన్నూరు, పగుల చెన్నూరు పంచాయతీలకు పోలింగ్ ఆ గ్రామాలలో, గంజాయిబద్ర పోలింగ్ నేరెళ్ళవలస లో నిర్వహించేది. కానీ ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు. ఆ మూడు పంచాయతీలపై పట్టు బిగించిన ఒడిశా అక్కడ పోలింగ్ నిర్వహణకు అంగీకరించే అవకాశం లేదు. అలాంటి పరిస్థితి తలెత్తితే మన్యం జిల్లా అధికారులు ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తారనేది వేచి చూడాల్సిందే.








కామెంట్లు (0)