శనివారం, 12 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సూపర్ ఎల్ నినో దిశగా తీవ్రమవుతున్న వర్షాభావం

3 గంటల క్రితం

el nino
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 12, 2026, 04:45 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

- ఖరీఫ్ సాగుపై తీవ్ర ప్రభావం

- 5 లక్షల హెక్టార్లు బీడుగా

- రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ప్రభావం

- వ్యయ సామర్ధ్యంపైనా ప్రభావం

- ప్రణాళిక శాఖ తాజా హెచ్చరికలు

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు తీవ్రరూపం దాల్చుతున్నాయి. దీని ప్రభావం అన్ని రంగాలపైనా పడుతుందని ప్రణాళిక శాఖ కూడా హెచ్చరికలు జారీచేస్తోంది. ఇది సూపర్ ఎల్నినో దిశగా మారుతోందని అధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల కారణంగా ఇప్పటికే ఐదు లక్షల హెక్టార్లకు పైగా సాగు భూమి బీడుగా ఉండిపోయిందని లెక్కగట్టారు. ఈ పరిస్థితి గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల దైనందిక జీవనంపైనా ప్రభావం చూపించనున్నట్టు ఆందోళన వ్యక్తమవుతోంది. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోతే మరిన్ని ఇబ్బందులు తప్పవన్న భావాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు.

దేశవ్యాప్తంగా ఈ ఏడాది నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షపాతం అసమానంగా నమోదవుతోంది. భారత ప్రభుత్వ అంచనాల ప్రకారం జూన్ ఒకటి నుంచి దేశంలో వాస్తవ వర్షపాతంతో పోలిస్తే 13 శాతం తక్కువగా నమోదైంది. తూర్పు, ఈశాన్య భారతంలో 30 శాతం, దక్షిణ ద్వీపకల్పంలో 23 శాతం, వాయువ్య భారతంలో 12 శాతం లోటు నమోదుకాగా.. మధ్య భారతంలో మాత్రం 4 శాతం అధిక వర్షపాతం నమోదైంది. ఆగస్టు 19 నాటికీ దేశవ్యాప్తంగా వర్షపాతం లోటు 13 శాతంగానే కొనసాగింది. అయితే సీజన్ ప్రారంభంలో ఉన్న భారీ లోటుతో పోలిస్తే పరిస్థితి కొంత మెరుగుపడింది.

ఆంధ్రప్రదేశ్‌లోనూ 2026 నైరుతి రుతుపవన సీజన్‌లో గణనీయమైన వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. జూన్ నుంచి ఆగస్టు వరకు రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 424.1 మిల్లీమీటర్లు ఉండాల్సి ఉండగా.. వాస్తవంగా 197.6 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. దీంతో 53.4 శాతం వర్షపాతం లోటు ఏర్పడింది.​

నెలల వారీగా చూస్తే జూన్‌లో వర్షపాతం లోటు 25.2 శాతంగా ఉండగా, జూలైలో పరిస్థితి మరింత తీవ్రంగా మారి 67.9 శాతానికి చేరింది. ఆగస్టులో కొంత మెరుగుదల కనిపించినప్పటికీ 55.9 శాతం లోటు కొనసాగింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ లోటు విస్తృతంగా కనిపించగా, రాయలసీమలోని చాలా జిల్లాలతో పాటు దక్షిణ కోస్తా ఆంధ్రలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఉత్తర కోస్తా ఆంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా ఉత్తర జిల్లాల్లో, ఇతర ప్రాంతాలతో పోలిస్తే కొంత మెరుగైన వర్షపాతం నమోదైంది.

20.4 లక్షల హెక్టార్లకే ఖరీఫ్ సాగు

వర్షాభావ ప్రభావం ఖరీఫ్ సాగుపైనా స్పష్టంగా కనిపిస్తోంది. ఆగస్టు 26 నాటికి రాష్ట్రంలో సాధారణంగా 25.6 లక్షల హెక్టార్లలో సాగు జరగాల్సి ఉండగా, వాస్తవంగా 20.4 లక్షల హెక్టార్లలో మాత్రమే పంటలు సాగయ్యాయి. అంటే సాధారణ సాగు విస్తీర్ణంలో దాదాపు 80 శాతం మాత్రమే పూర్తయింది. జూన్‌లో సాగు ఆశాజనకంగా సాగినప్పటికీ జూలైలో వర్షాలు బలహీనపడటంతో సాగు పురోగతి మందగించింది. జూలై నాటికి సాధారణ సాగుతో పోలిస్తే 3.0 లక్షల హెక్టార్ల లోటు ఏర్పడగా.. ఆగస్టు నాటికి ఈ లోటు 5.3 లక్షల హెక్టార్లకు పెరిగింది. ప్రధానంగా వర్షాధార ప్రాంతాల్లో నేలలో తేమ తగ్గిపోవడంతో సాగు కార్యకలాపాలపై ఒత్తిడి పెరిగినట్లు భావిస్తున్నారు. వర్షపాతం పరిస్థితులు మెరుగుపడకపోతే పంటల ఎదుగుదల, దిగుబడులు, మొత్తంగా ఖరీఫ్ ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది.

​తాగునీటికి స్వల్ప భద్రత

కృష్ణా వ్యవస్థలోని ప్రధాన రిజర్వాయర్లు కొంతవరకు మెరుగైన స్థితిలో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. శ్రీశైలం రిజర్వాయర్స్లో 61 శాతం, నాగార్జునసాగర్స్లో 57 శాతం నిల్వలు ఉన్నాయి. రాష్ట్రం వెలుపలి ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి వచ్చిన వరదలు ఈ నిల్వలకు కొంత మేర అండగా నిలిచినట్టు చెబుతున్నారు. దీంతో కృష్ణా డెల్టాలో సాగు, తాగునీటి అవసరాలకు కొంత భద్రత ఏర్పడింది.

కృష్ణా పరివాహక వ్యవస్థతో పోలిస్తే రాయలసీమ, దక్షిణ కోస్తా ఆంధ్రకు సేవలందించే పెన్నా పరివాహక ప్రాంతంలోని రిజర్వాయర్ల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. సోమశిల రిజర్వాయర్‌లో సుమారు 22 శాతం, కండలేరు రిజర్వాయర్‌లో సుమారు 27 శాతం సామర్థ్యం మేర మాత్రమే నీటి నిల్వలు ఉన్నాయి. ఈ ప్రాంతాలపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అధికారులు చెబుతున్నారు.

ఆర్థిక వ్యవస్థపై ప్రభావం

దీర్ఘకాలంగా కొనసాగుతున్న వర్షపాతం లోటు ప్రజల జీవనంపై కూడా పడుతుందన్న హెచ్చరికలు వస్తున్నాయి. ప్రధానంగా వ్యవసాయ ఉత్పత్తి, రిజర్వాయర్లు, భూగర్భ జలాల రీఛార్జ్, గ్రామీణ ఆదాయాలు, వినియోగ డిమాండ్‌పై ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు. వ్యవసాయ ఉత్పత్తి తగ్గితే రైతుల ఆదాయాలు తగ్గి, వినియోగ వస్తువులు, వ్యవసాయ ఇన్‌పుట్లు, సేవలపై గ్రామీణ ప్రాంతాల్లో ఖర్చు చేసే సామర్థ్యం కూడా బలహీనపడే అవకాశం ఉంది. ఖరీఫ్ సీజన్‌లో కీలకమైన సమయంలో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా కొనసాగడం వ్యవసాయ కార్యకలాపాలతో పాటు గ్రామీణ జీవనోపాధులపైనా ప్రభావం చూపే ప్రమాదం ఉందని, ప్రధానంగా వ్యవసాయంపై ఆధార పడే వారికి సమస్యగా మారుతుందని అంచనా వేస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్