గురువారం, 20 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionప్రభుత్వంపై నమ్మకం సన్నగిల్లుతోంది..!

58 నిమిషాల క్రితం

veligonda
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 21, 2026, 03:13 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • ఆందోళనలో వెలిగొండ నిర్వాసితులు !!

​ప్రజాశక్తి-మార్కాపురం : పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు కోసం త్యాగం చేసి... సర్వం కోల్పోయిన నిర్వాసితులను ప్రభుత్వమే భయభ్రాంతులకు గురిచేస్తోంది. ప్యాకేజీతో పాటు ఎన్నో సమస్యలు పెండింగ్‌ ‌లో ఉంచి... వెలిగొండ ప్రాజెక్టు పూర్తయిందని, నీటిని విడుదల చేస్తామని, గ్రామాలు ఖాళీ చేయాలని ప్రభుత్వం ఒత్తిడి చేయడం దుర్మార్గమని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వెలిగొండ ప్రాజెక్టు పరిధిలో 11 ముంపు గ్రామాలలో 2026 ఆగస్టు చివరి నాటికి పదివేల కుటుంబాలు ప్యాకేజీకి అర్హత కలిగి ఉన్నాయి. వారందరికీ పునరావాసం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉంది. 2019 కటాఫ్ తేదీ అంటూ అప్పటి వరకు గుర్తించిన 7321 మంది నిర్వాసితులకు మాత్రమే రూ. 900.56 కోట్లు ఇస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటి వరకూ రూ. 518 కోట్లు ప్యాకేజీ కింద అందజేయడం జరిగింది. మిగిలిన ప్యాకేజీ మొత్తాన్ని ఈ వారంలో ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. 2019 నుంచి 2026 ఆగస్టు నాటికి 18 ఏళ్ళు నిండిన యువత 1500 సంఖ్య దాటనుంది. 11 ముంపు గ్రామాలలో అర్హత ఉండి ఆర్అండ్ఆర్ ప్యాకేజీలో పేర్లు లేని వారు, పేర్లు తప్పుల తడకగా ఉన్నవారు మరో పన్నెండు వందల పై చిలుకు నిర్వాసితులు ఉన్నారు. మిస్సయిన వారిలో అత్యధికంగా కలనూతల ముంపు గ్రామంలో ఉన్నట్లు తెలిసింది. ఆ ఒక్క గ్రామంలోనే మిస్సయిన వారి సంఖ్య 250 కి పైగా ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా నేటికీ కొందరు భూములకు పరిహారం అందలేదు. చుక్కలు అంటూ... అసైన్డ్ అంటూ... సాగు భూమికి అధికారులు కొర్రీలు వేయడంతో పరిహారం అందుకొని వారు అధికమందే ఉన్నారు. దీంతోపాటు కొందరు గృహాలకు కూడా పరిహారం అందలేదు. ఓ వైపు ప్రాజెక్టు నీటిని విడుదల చేస్తామని చెబుతూనే... మరోవైపు గ్రామాలు ఖాళీ చేయాలని మౌఖిక ఆదేశాలు ఇవ్వడం నిర్వాసితులను భయాందోళనలకు గురిచేస్తోంది. ఆర్థికపరమైన అనేక సమస్యలు పరిష్కరించకుండా తమను గ్రామాలు ఖాళీ చేయాలంటే కుదిరే పని కాదని నిర్వాసితులు తెగేసి చెబుతున్నారు. 18 ఏళ్ల నిండిన యువతి, యువకుల సంగతి నేటికీ తేల్చనేలేదు. ఇలాంటి సమస్యలను ఎప్పుడో పరిష్కరించాల్సిన ప్రభుత్వం మూడు దశాబ్దాలుగా నానబెట్టింది. గ్రామాలు ఖాళీ చేసి బయటకు వచ్చిన తర్వాత సమస్యలు పరిష్కారమవుతాయనే నమ్మకం తమకు లేదని నిర్వాసితులు వాపోతున్నారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని తాము స్వాగతిస్తున్నా మని.. ఇదే క్రమంలో తమ సమస్యలు కూడా పరిష్కరించాలని ప్రభుత్వానికి విన్నవించు కుంటున్న పట్టించుకునే వారు మాత్రం లేరని వాపోతున్నారు. ప్రభుత్వం ఇలాగే మొండిగా వ్యవహరిస్తే తాము కూడా ఇంతకంటే రెట్టింపుగా మొండిగా వ్యవహరించక తప్పదని గ్రామాలలోని నిర్వాసితులు హెచ్చరిస్తున్నారు.

veligonda

​పొలానికి పరిహారం ఇచ్చారు.. ఇంటికి పరిహారం ఇవ్వలేదు

ముంపు గ్రామమైన గొట్టిపడియలో దూదేకుల పీరయ్య పొలానికి పరిహారం ఇవ్వడం జరిగింది. ఆయన ఉంటున్న నివాస గృహానికి మాత్రం నేటికీ పరిహారం అందలేదు. తన పరిహారం అందకుండా గ్రామం ఖాళీ చేయడం సాధ్యం కాదని చెబుతున్నారు. ప్రాజెక్టు నీటిని వదిలిన తర్వాత తన సమస్య పరిష్కారం అవుతుందని నమ్మకం లేదని వాపోతున్నారు.

ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో పేర్లు లేవు

గొట్టిపడే ముంపు గ్రామంలో చల్ల వెంకటేశ్వర్లు తన కుటుంబీకులతో అక్కడే నివాసం ఉంటున్నారు. ఆయన పుట్టి పెరిగిన ఊరు కూడా అదే. తన ఇంటికి పరిహారం రాలేదు. అన్ని అర్హతలు ఉన్నాయి. అన్ని పత్రాలు ఉన్నాయి. ప్యాకేజీ జాబితాలో మాత్రం ఆయన పేరు లేకపోవడం వింతగా ఉంది. ప్యాకేజీ తీసుకోకుండా గ్రామం ఖాళీ చేసి వచ్చి తన కుటుంబ సభ్యులతో జీవనం ఎలా సాగించాలో ప్రభుత్వమే ఆలోచించాలని కోరుతున్నారు.


సంబంధిత వార్తలు

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్