గురువారం, 20 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

నమ్మకం...

1 గంట క్రితం

katha 20.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 21, 2026, 03:39 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

బుక్కపట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో ఆదిత్య చదువుతున్నాడు. చాలా తెలివైన పిల్లవాడు. కానీ తన మీద తనకు నమ్మకం తక్కువగా ఉండేది. ఎప్పుడైనా పాఠశాల కార్యక్రమంలో వేదిక మీద మాట్లాడాలంటే చాలా భయపడిపోయేవాడు. పరీక్షల్లో కూడా తనకు తెలిసిన ప్రశ్నలు వచ్చినా సమాధానాలు రాయలేకపోయేవాడు. ఆదిత్యను బాగా గమనిస్తున్న తెలుగు ఉపాధ్యాయుడు ఒకసారి ఒక చిన్న విత్తనం తీసుకుని తరగతికి వచ్చారు. ‘పిల్లలూ! ఇది ఏమిటి?’ అని మాస్టారు అడిగారు. ‘విత్తనం సార్!’ అని విద్యార్థులంతా ముక్తకంఠంతో చెప్పారు. ‘ఈ చిన్న విత్తనంలో ఏముందో మీకు కనిపిస్తుందా?’ అని మాస్టారు మళ్లీ అడిగారు. ‘ఏమీ కనిపించడం లేదు సార్!’ అన్నారు పిల్లలు. ‘నాకు మాత్రం ఒక మహావృక్షం కనిపిస్తోంది’ అన్నారు మాస్టారు. ‘ఈ విత్తనం తనలో దాగిన వృక్షాన్ని బయటకు తీసుకురావాలంటే నేలలో పడాలి. చీకటిని భరించాలి. నీటిని స్వీకరించాలి. ఎండను తట్టుకోవాలి. కాలంతో పోరాడాలి. అప్పుడు మాత్రమే మహావృక్షమవుతుంది. మనిషి జీవితం కూడా అంతే. మనలోని శక్తిని మనం నమ్మినప్పుడు మాత్రమే అది విజయంగా మొలకెత్తుతుంది’ అని మాస్టారు ఆదిత్య వైపు చూస్తూ చెప్పారు.

ఆ మాటలు ఆదిత్య మనసులో బలంగా నాటుకున్నాయి. కొన్ని రోజుల తర్వాత పాఠశాలలో వక్తృత్వ పోటీ ప్రకటించారు. తెలుగు మాస్టారు ఆదిత్య పేరు ఇచ్చారు. పోటీ రోజు వేదిక మీద ఆదిత్య మైకు పట్టుకుని నిలబడ్డాడు. చేతులు వణికాయి. గుండె వేగంగా కొట్టుకుంది. వేదిక ముందు తెలుగు మాస్టారు మాట్లాడమని తల ఊపారు. ఆదిత్యకు ఎక్కడ లేని ధైర్యం వచ్చింది. మొదట నెమ్మదిగా మొదలైన తన ప్రసంగం చివరికి నదీ ప్రవాహంలా సాగింది. మాటల్లో స్పష్టత, స్వరంలో ఆత్మవిశ్వాసం, భావంలో నిజాయితీ కనిపించాయి. ప్రసంగం ముగిసింది. చప్పట్లు మార్మోగాయి. ఆదిత్యకు మొదటి బహుమతి రాలేదు. అయినా అతని ముఖంలో ఓటమి బాధ కనిపించలేదు. మాస్టారు దగ్గరికి వెళ్లి ‘సార్! మీరు నన్ను ఎంతో ప్రోత్సహించారు. అయినా నేను గెలవలేదు’ అన్నాడు. అప్పుడు మాస్టారు ‘ఎవరు చెప్పారు నువ్వు గెలవలేదని? నిన్నటి భయపడే ఆదిత్యను ఈరోజు నువ్వు ఓడించావు. నీకు బహుమతి ఈరోజు రాకపోవచ్చు. కానీ ఈ పోటీలో పాల్గొని నీ మీద నువ్వు విజయం సాధించావు. ఈ విజయం జీవితాంతం నీకు గొప్ప నమ్మకాన్ని కలిగిస్తుంది’ అని చెప్పారు. ఆ మాటలకు ఆదిత్య కళ్లలో నీళ్లు ఉబికాయి. అవి బాధతో వచ్చినవి కావు.


- డా. సారిపల్లి నాగరాజు,

ప్రభుత్వ తెలుగు ఉపాధ్యాయుడు,

80083 70326.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్