ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ముంచేసిన తుపానులు

13 నవంబర్, 2026

crop
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 14, 2026, 04:00 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

  • 4.71 లక్షల హెక్టార్లలో పంట నష్టం

  • రోడ్డునపడ్డ 7.22 లక్షల రైతులు

​ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : అర్నబ్‌, మురసు తుపాన్ల కారణంగా రాష్ట్ర వ్యవసాయ రంగానికి తీవ్ర నష్టం వాటిల్లింది. తుపాన్ల ప్రభావంతో వేలాది హెక్టార్లలో పంటలు దెబ్బతినగా, లక్షలాది మంది రైతులు నష్టపోయారు. ప్రణాళిక శాఖ ఇచ్చిన తాజా నివేదిక మేరకు 4.71 లక్షల హెక్టార్లలో పంట నష్టం జరగ్గా... 7.22 లక్షలమంది రైతులు నష్టపోయినట్టు గుర్తించారు. ఇంకా వేల గ్రామాల్లో సర్వే నిర్వహించాల్సి ఉందని, అది కూడా పూర్తయితే నష్టం మరింత పెరిగే అవకాశాలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. అర్నబ్‌ తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని 294 మండలాల పరిధిలోని 7,877 గ్రామాల్లో వ్యవసాయ పంటలు దెబ్బతిన్నాయి. మొత్తం 5.27 లక్షల మంది రైతులకు చెందిన 3.29 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పంట నష్టం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఇప్పటివరకు 180 మండలాలు, 1,809 గ్రామాల్లో పంట నష్టాల ఎన్యుమరేషన్ పూర్తి కాగా, ఇందులో 3.04 లక్షల మంది రైతులకు చెందిన 1.96 లక్షల హెక్టార్లలో పంట నష్టాన్ని గుర్తించారు. ఇంకా 114 మండలాలు, 6,068 గ్రామాల్లో ఎన్యుమరేషన్ పెండింగ్‌లో ఉంది. ఈ ప్రాంతాల్లో 2.23 లక్షల మంది రైతులకు చెందిన సుమారు 1.33 లక్షల హెక్టార్లలో పంట నష్టాన్ని అంచనా వేయాల్సి ఉంది.

తాజా నివేదిక మేరకు కృష్ణా జిల్లాలో 26,328 హెక్టార్లు, శ్రీకాకుళం జిల్లాలో 25,605 హెక్టార్లు, కాకినాడ జిల్లా 18,782 హెక్టార్లు, తూర్పుగోదావరి జిల్లాలో 14,157 హెక్టార్లు నష్టపోయినట్టు తేల్చారు. మొత్తం నష్టాల గణన పూర్తయితే రైతులకు జరిగిన వాస్తవ పంట నష్టం, ఆదాయంపై ప్రభావం, అవసరమైన పరిహార సాయం తదితర అంశాలపై స్పష్టత రానుందని అధికారులు అంటున్నారు.

మురసు నష్టం రూ.874.89 కోట్లు

మురసు తుపాను కారణంగా ప్రస్తుత పంట సీజన్‌లో వ్యవసాయ రంగానికి గణనీయమైన నష్టం వాటిల్లింది. మురసు తుపాను వల్ల జరిగిన మొత్తం ఆర్థిక నష్టాన్ని రూ.874.89 కోట్లుగా అంచనా వేశారు. రాష్ట్రంలో సాగు చేసిన మొత్తం 5.64 లక్షల హెక్టార్లలో 1.42 లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. అంటే మొత్తం సాగు విస్తీర్ణంలో సుమారు 25.3 శాతం పంట నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. ఈ తుపాను ప్రభావంతో 1.95 లక్షల మంది రైతులు నష్టాలను ఎదుర్కొన్నారు. మొత్తం 3.63 లక్షల మెట్రిక్ టన్నుల వ్యవసాయ ఉత్పత్తి నష్టం జరిగినట్లు ప్రాధమికంగా అంచనా వేశారు. దీనివల్ల వ్యవసాయ దిగుబడులు తగ్గడంతో పాటు రైతుల ఆదాయంపైనా ప్రభావం పడనుందని నివేదికలో చెప్పడం విశేషం. నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ కింద నిబంధనల ప్రకారం రూ.344.37 కోట్ల సహాయం ఇవ్వాల్సిఉంటుందని కూడా అంచనా వేశారు. తదుపరి పంట సీజన్‌లో తిరిగి సాగు చేపట్టేందుకు ఈ సాయం ఉపయోగపడనుందని పేర్కొన్నారు.

అర్నబ్ తుపానుకు సంబంధించి మిగిలిన ప్రాంతాల్లో ఎన్యూమరేషన్‌ను త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు, మురసు తుపాను బాధిత రైతులకు అంచనా వేసిన ఇన్‌పుట్ సబ్సిడీని సకాలంలో అందించడం కీలకంగా మారింది. పంట నష్టాల నుంచి రైతులు కోలుకునేందుకు, తదుపరి సీజన్‌లో సాగు కార్యకలాపాలను పునరుద్ధరించేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా అధికారులు చెబుతున్నారు.


కళ్లముందే కుళ్లిన కష్టం

చేసేది లేక ట్రాక్టర్‌తో దున్నేసిన రైతు

ప్రజాశక్తి - ముమ్మిడివరం(డాక్టర్ బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా) : ఆరుగాలం కష్టించి పండించిన పంట చేతికందే సమయంలో తుపాను రూపంలో వచ్చిన ప్రకృతి వైపరీత్యం అన్నదాతను కోలుకోలేని దెబ్బతీసింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు 15 ఎకరాల్లోని వరి పంట పూర్తిగా నేలవాలి, నీట మునిగి కుళ్లిపోయింది. దిక్కుతోచని స్థితిలో ఓ రైతు తన పంటను తానే ట్రాక్టర్‌తో దమ్ము చేసి దున్నేశాడు. డాక్టర్ బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలోని బొండాయి కోడుతూము ప్రాంతానికి చెందిన రైతు గొరింట రాంబాబు రాజు వ్యవసాయమే ఆధారంగా జీవనం సాగిస్తున్నారు. ఈ ఏడాది తన సొంత భూమి ఐదు ఎకరాలతో పాటు మరో పది ఎకరాలు కౌలుకు తీసుకున్నారు. మొత్తం 15 ఎకరాల్లో వరి పంట సాగు చేశారు. ఇటీవల ఆర్నబ్, మురసు తుపానుల ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు వరి పంట పూర్తిగా నేలవాలింది. నీరు బయటకు వెళ్లేందుకు మార్గం లేకపోవడంతో పంట మొత్తం కుళ్లిపోయే పరిస్థితి ఏర్పడింది. పంటను కాపాడుకునే మార్గం లేక విధిలేని పరిస్థితుల్లో శుక్రవారం ట్రాక్టర్‌ తో పంటను దమ్ము చేసేశారు. ఈ ఘటన పలువురిని కంట తడి పెట్టించింది. తుపాను కారణంగా సుమారు రూ.తొమ్మిది లక్షల వరకు పంట నష్టం వాటిల్లిందని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు వచ్చి పంట నష్టాన్ని నమోదు చేసుకుని వెళ్లారని, ప్రభుత్వం తక్షణమే స్పందించి పంట నష్ట పరిహారం అందించాలని కోరుతున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్