- ఇప్పటికే 1.10 లక్షల ఎకరాలు గుర్తింపు
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : పెట్టుబడిదారులకు భూములు అప్పనంగా అప్పగించేందుకు ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. దీనికోసం ల్యాండ్ బ్యాంకు పాలసీ తీసుకురావాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే ఎక్కడ ఏ భూమి ఎంత అందుబాటులో ఉంది తెలుసుకునేందుకు స్ట్రక్చర్డ్ ల్యాండ్ బ్యాంక్ పోర్టల్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తరువాత గత పదేళ్లలో సేకరించనంత భూమిని ఈ రెండేళ్లలో కూటమి ప్రభుత్వం సేకరించింది. అయితే భూమి సేకరించే అన్నిచోట్లా ఖాళీగా ఉన్న మిగులు భూములు కాకుండా పంటలు పండే చోట్లే ఈ పారిశ్రామిక క్లస్టర్లు ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ మొత్తం ఎక్కువ భాగం సారవంతమైన పంటలు పండే, నీటి లభ్యత ఉండే భూముల పరిధిలోనే ఉన్న సంగతి తెలిసిందే. భూ కేటాయింపులు, అందుబాటులో ఉన్న భూముల వివరాలకు సంబంధించిన అంశాలతో ఇటీవల ప్రభుత్వం నివేదిక విడుదల చేసింది. దీనిలో అనేక కీలక విషయాలు వెల్లడించింది. గతంలో కేటాయించిన భూములు కాకుండా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఎపిఐఐసి కింద 28 జిల్లాల్లో 1,10,892 ఎకరాల పారిశ్రామిక ల్యాండ్ బ్యాంక్ ఉన్నట్లు తెలిపింది. ఇందులో 45,664 ఎకరాలు కేటాయింపునకు సిద్ధంగా ఉండగా, 65,228 ఎకరాలు అభివృద్ధి దశలో ఉన్నాయి. అనకాపల్లి, తిరుపతి, శ్రీకాకుళం, శ్రీ సత్యసాయి కర్నూలుతోపాటు మొత్తం పది జిల్లాల్లోనే 96,918 ఎకరాల భూములు ఉన్నట్లు పేర్కొంది. ఇప్పటికే విశాఖ-చెన్నై ఇండస్ర్టియల్ కారిడార్, చెన్నై-బెంగళూరు ఇండస్ర్టియల్ కారిడార్ పరిధిలో పరిశ్రమల కోసం భూములు కేటాయించిన సంగతి తెలిసిందే. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జూన్ 2024లో ప్రారంభించిన భూసేకరణ కార్యక్రమం కింద 88,955 ఎకరాలకు రిక్విజిషన్ ఇవ్వగా, 14,796 ఎకరాల ప్రభుత్వ భూమితో సహా 24,673 ఎకరాలను ఇప్పటికే స్వాధీనం చేసుకుంది. 2025లో 6,392 ఎకరాలు, 2026లో 5,845 ఎకరాలు వ్యాపారవేత్తలకు కేటాయించింది. ఇవి కాకుండా 37 ప్రైవేట్ పారిశ్రామిక పార్కులు 43,081 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్స్ పాలసీ (4.0) 2024–29 కింద 4,596 ఎకరాలలో 11 ప్రైవేట్ పార్కులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అలాగే సెమీకండక్టర్లు, డ్రోన్లు, క్వాంటమ్ కంప్యూటింగ్, ఎఐ డేటా సెంటర్లు బల్క్ డ్రగ్స్, సోలార్, పెట్రో కెమికల్స్, వస్త్రాలు, బొమ్మలు, క్రీడా వస్తువులకు సంబంధించి రంగాల వారీ 25 పార్కులను అభివృద్ధి చేయనున్నారు. ప్రతి ఓడరేవుకు అనుబంధంగా పారిశ్రామిక ప్రాంతాన్ని ఏర్పాటు చేయనున్నారు.








కామెంట్లు (0)