శుక్రవారం, 14 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionచెరుకు బకాయిలు ‘లాకౌట్‌’

1 గంట క్రితం

యువగళం పాదయాత్రలో నారా లోకేష్ హామీ (ఫైల్)

యువగళం పాదయాత్రలో నారా లోకేష్ హామీ (ఫైల్)

వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 14, 2026, 05:29 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

  • రూ.154 కోట్ల కోసం ఎనిమిదేళ్లగా రైతుల పోరాటం

  • అమలు కాని మంత్రి లోకేష్‌ ‌హామీ

ప్రజాశక్తి- తిరుపతి బ్యూరో : ఒకటి కాదు... రెండు కాదు... ఏకంగా రూ.154 కోట్ల బకాయిలు. నెల కాదు... రెండు నెలలు కాదు... ఎనిమిదేళ్లగా నిరీక్షణ. ఆరుగాలం కష్టించి అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి చెరుకు పండించిన రైతుల కష్టం.

ఫ్యాక్టరీకి తొలిన చెరుకును యాజమాన్యాలు సొమ్ము చేసుకున్నాయి. రైతులకు మాత్రం డబ్బులు చెల్లించలేదు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని రెండు చెరుకు ఫ్యాక్టరీలు నష్టాల పేరుతో లాకౌట్ ప్రకటించి రైతులకు బకాయిలు పెట్టేశాయి. ప్రభుత్వం, ఉన్నతాధికారులు ఉదాశీనతంగా వ్యవహరిస్తుండడంతో అప్పటి నుంచి రైతులు దశలవారీ పోరాడుతూనే ఉన్నారు.

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మయూరి సుగర్, నేతమ్స్ సుగర్ ఫ్యాక్టరీ ఉండేవి. వీటికి ఉమ్మడి చిత్తూరు, ఉమ్మడి కడప జిల్లాలు, నెల్లూరు జిల్లా నుంచి సుమారు 4,500 మంది రైతులు 2018-19లో తోలిన చెరుకుకు పేమెంట్లు జరగలేదు. మయూరి సుగర్ ఫ్యాక్టరీ రూ.40 కోట్లు, నేతమ్స్ సుగర్‌ ‌ఫ్యాక్టరీ రూ.34.92 కోట్లు అప్పట్లో బకాయి పడ్డాయి. ఈ డబ్బుల కోసం రైతులు పోరాడారు. ఈ సందర్భంగా బకాయిలను వడ్డీతో సహా ఇప్పిస్తామని 2020లో అప్పటి ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు. అసిస్టెంట్ కేన్ కమిషనర్ జాన్ విక్టర్ సమక్షంలో ఈ నిర్ణయం జరిగింది. సుగర్ ఫ్యాక్టరీల ఆస్తులు అమ్మి తమ బకాయిలు తీర్చాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ ఫ్యాక్టరీలను ఎవరైనా కొనుగోలు చేస్తే వచ్చే మొత్తంతో బకాయిలు తీరుస్తామని అప్పట్లో చర్చల సందర్భంగా చిత్తూరు, తిరుపతి జిల్లాల కలెక్టర్లు హామీ ఇచ్చినా కార్యాచరణ రూపొందించలేదు. దీంతో, రైతులు ఫ్యాక్టరీల ముట్టడి, యజమానుల ఇళ్ల ముట్టడి, రేయింబవళ్లు అక్కడే వంటా-వార్పు, నిద్ర వంటి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. మయూరి సుగర్ ఫ్యాక్టరీ రూ.16 కోట్లను రైతులకు రెండేళ్ల క్రితం చెల్లించింది. ఇంకా రూ.90 కోట్లు బకాయి ఉంది. త్వరలోనే బకాయిలు చెల్లిస్తామని నేతమ్స్ సుగర్ యజమాని నందకుమార్ రామానుజం ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదు. తనకు అప్పులు ఉన్నాయంటూ, ముంబయిలో ఎస్‌‌విసిఐ ఫైనాన్స్ కంపెనీ వద్ద మార్టిగేజ్ చేసి రూ.60 కోట్లు అప్పు తెచ్చానంటూ, వారి ద్వారా కోర్టులో కేసు వేయించి లిటిగేషన్‌ ‌పెట్టారు. కలెక్టర్ జోక్యం చేసుకుని ఆర్ అండ్‌ ఆర్ యాక్ట్ అమలు చేశారు. చిత్తూరు సివిల్ కోర్టులో రైతుల తర‌ఫున వ్యాజ్యం వేయించారు. దీంతో, ముంబయి ఎస్‌‌విసిఐ ఫైనాన్స్ కంపెనీ రైతులతో రాజీకి వచ్చింది. కార్మాగారాన్ని అమ్మితే రూ.70 కోట్లకుపైగా వస్తుందని, ఫ్యాక్టరీలోని స్క్రాబ్ ను అమ్మితే రూ.35 కోట్లు వస్తుందని, వీటిని అమ్మగా వచ్చిన డబ్బులతో కలెక్టర్ సమక్షంలో సమానంగా తీసుకుందామని చెప్పింది. ఇది జరిగి రెండేళ్లయినా ఇప్పటికీ రైతుల బకాయిలు చెల్లించలేదు. ఈ రెండు ఫ్యాక్టరీలూ బకాయిలను వడ్డీతో సహా చెల్లించేలా చూడాలని కోరుతూ రైతులు గత ఏడాది డిసెంబర్‌‌లో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్ సిఎల్ టి)ను ఆశ్రయించారు.

దీంతో, లిక్విడేటర్‌ ‌గా బాలసుబ్రమణ్యంను ఈ ఏడాది జనవరిలో ఎన్ సిఎల్ టి నియమించింది. ఒప్పందం ప్రకారం రైతులకు అసలు, వడ్డీ కలిపి రూ.154 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని లెక్క తేల్చి ఈ మేరకు ఆయన నివేదించారు. ఇందులో మయూరి సుగర్స్ రూ.90 కోట్లు, నేతమ్స్ రూ.64 కోట్లు ఇవ్వాల్సి ఉందని పేర్కొన్నారు.

అమలు కాని లోకేష్‌‌ హామీ

యువగళం పాదయాత్ర ఈ ప్రాంతాల్లో సాగినప్పుడు లోకేష్‌కు చెరుకు రైతులు వినతిపత్రాలు అందజేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బకాయిల చెల్లింపునకు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. టిడిపి కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు దాటినా నేటికీ ఈ హామీ అమలుకు నోచుకోలేదు.

మయూరి సుగర్ ఫ్యాక్టరీ యజమాని ఇంటి వద్ద   రైతుల ఆందోళన (ఫైల్)మయూరి సుగర్ ఫ్యాక్టరీ యజమాని ఇంటి వద్ద రైతుల ఆందోళన (ఫైల్)

రైతులకు న్యాయం చేస్తాం : జాన్ విక్టర్, అసిస్టెంట్ కేన్ కమిషనర్, తిరుపతి జిల్లా

మయూరి సుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం పరారీలో ఉంది. ఆ సంస్థ ఆస్తులను జప్తు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తమిళనాడులో 83 ఎకరాలు వేలం వేసి రైతులకు రూ.16 కోట్లు బకాయిలు చెల్లించాం. కోర్టు స్టేను తొలగించుకున్నాం. ఫ్యాక్టరీకి చెందిన పొదలకూరులోని 30 ఎకరాలు, నెల్లూరు సమీపంలోని ఆరు ఎకరాలు, బిఎన్ కండ్రిగలోని కర్మాగారాన్ని, తిరుపతిలోని ఇంటిని, హోటళ్లను సీజ్ చేశాం. వాటిని విక్రయించి రైతుల బకాయిలు చెల్లించేందుకు ప్రయత్నిస్తున్నాం.

ఎన్ సి ఎల్ టిలో పెండింగ్ ఉంది : ముత్యాలనాయుడు, అసిస్టెంట్ కేన్ కమిషనర్, చిత్తూరు జిల్లా​

నేతమ్స్ సుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి ఎన్ సిఎల్ టిలో కేసు పెండింగ్ ఉంది. రైతులకు రూ.34 కోట్లు మాత్రమే చెల్లించాల్సి ఉందని ఫ్యాక్టరీ యాజమాన్యం చెప్తోంది. వడ్డీతో కలిపి రూ.64 కోట్లు చెల్లించాలని రైతులు అడుగుతున్నారు. ఈ కేసులో 20 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎన్ సిఎల్ టి తీర్పు వచ్చిన వెంటనే దానికి అనుగుణగా పరిహారం చెల్లించే చర్యలు తీసుకుంటాం.

న్యాయం చేయాలి :ఆదినారాయణరెడ్డి, రైతు, నిండ్ర గ్రామం

వైసిపి, టిడిపి మాట తప్పాయి. 4,500 మంది రైతుల ఆత్మఘోష ఇది. పాలకులు పట్టించుకోవడం లేదు. రైతే రాజు అని చెబుతున్నారు తప్ప, మా సమస్య పరిష్కరించి మాకు న్యాయం చేయడం లేదు. వెంటనే మాకు న్యాయం చేయాలి.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్